Right To Get Abortion: సురక్షిత గర్భస్రావంపై అమెరికన్ పొలిటీషియన్ సూచనలు

ABN , First Publish Date - 2022-06-29T19:43:06+05:30 IST

అమెరికాలో గర్భస్రావాలను రాజ్యాంగబద్ధం చేసిన ఓ తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు

Right To Get Abortion: సురక్షిత గర్భస్రావంపై అమెరికన్ పొలిటీషియన్ సూచనలు

న్యూఢిల్లీ : అమెరికాలో గర్భస్రావాలను రాజ్యాంగబద్ధం చేసిన ఓ తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు జూన్ 24న రద్దు చేసింది. దీంతో ఆ దేశంలోని సుమారు సగం రాష్ట్రాల్లో గర్భస్రావం హక్కులపై దాదాపుగా నిషేధం అమలవుతుంది. తాజా తీర్పును ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, మహిళా హక్కుల ఉద్యమకారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు అలగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ గర్భస్రావం హక్కులపై ఇస్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా గర్భస్రావాలపై నిషేధం అమలయ్యే రాష్ట్రాల్లో సురక్షితంగా, స్వయంగా గర్భస్రావం చేయించుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తోంది. 


రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ అంటే ఏమిటి? 

Roe vs Wade judgement 1973లో వచ్చింది. దీని ప్రకారం అమెరికాలో గర్భస్రావం చేయించుకోవడం రాజ్యాంగబద్ధ హక్కు అయింది. అయితే జూన్ 24న సుప్రీంకోర్టు ఈ తీర్పును 6-3 మెజారిటీతో రద్దు చేసింది. ఫలితంగా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో గర్భస్రావం రాజ్యాంగ హక్కు కాకుండాపోయింది. దాదాపు సగం రాష్ట్రాల్లో గర్భస్రావాలపై నిషేధం అమల్లోకి వస్తుంది. 


Roe vs Wade judgement రద్దు కాగానే మిసోరీ అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ‘‘ట్రిగ్గర్ లా’’ను యాక్టివేట్ చేశారు. దీంతో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మినహా మిగిలిన సందర్భాల్లో గర్భస్రావం చేయించుకోవడానికి అవకాశం ఉండదు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ట్రిగ్గర్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ మీడియా చెప్తోంది. 


మహిళల అనుభవాలతో దద్దరిల్లుతున్న ఇంటర్నెట్

గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కు కాదని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ప్రధాన గర్భాశయానికి వెలుపల పిండం ఎదుగుతుండటం)తో బాధపడిన మహిళలు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇటువంటి గర్భవతులు నెలలు నిండే వరకు కొనసాగినట్లయితే, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల వారు గర్భస్రావం చేయించుకోవడం తప్పనిసరి. 


అమీ మూరే అనే మహిళ జూన్ 25న ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె అనుభవించిన కష్టాలను వివరించారు. మూడుసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయని, ట్విన్-టు-ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ కారణంగా తాను అనేకసార్లు గర్భస్రావాలు చేయించుకోవలసి వచ్చిందని తెలిపారు. గర్భస్రావమనేది చాలా మంది మహిళలకు ప్రాణ రక్షక వైద్య చికిత్స అని వివరించారు. రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్‌ను రద్దు చేయడం మహిళల ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. గర్భస్రావం చేయించుకుని ఉండకపోతే తాను ఎనిమిదేళ్ళ క్రితమే ప్రాణాలను వదిలేసి ఉండేదాన్నని తెలిపారు. తాము జీవికి అనుకూలమని వాళ్ళు చెప్తున్నారని, అయితే తాను గర్భస్రావం చేయించుకుని ఉండకపోతే మరణించి ఉండేదాన్నని చెప్పారు. ఇప్పుడు తన పిల్లలు ఉండేవారు కాదన్నారు. అలాంటపుడు జీవికి అనుకూలం (Pro life) అనడంలో అర్థం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి లైక్‌లు 10 వేలు దాటిపోయాయి. అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, స్టైలిస్ట్ అలియా అల్ రుఫా వంటి సెలబ్రిటీలు షేర్ చేశారు. అబార్షన్ స్టోరీస్‌ను షేర్ చేయాలని మహిళలను ప్రోత్సహించిన బుసీ ఫిలిప్ అనే నటి 2019లో ఉపయోగించిన #youknowme హ్యాష్ ట్యాగ్‌ను అమీ మూరే కూడా ఉపయోగించారు. 


Politician AOC సూచనలు

రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అమెరికన్ పొలిటీషియన్ అలగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె AOCగా అందరికీ సుపరిచితులు. ఆమె గర్భస్రావం హక్కుల గురించి, సురక్షితంగా గర్భస్రావం చేయించుకోవడం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక కథనాలను షేర్ చేశారు. గర్భస్రావాలపై నిషేధం అమలవుతున్న, ఇకపై అమలు కాబోతున్న రాష్ట్రాల్లో మహిళలు సురక్షితంగా, స్వయంగా గర్భస్రావం ఎలా చేసుకోవచ్చునో వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల ప్రకారం మందులతో సొంతంగా గర్భస్రావం చేసుకునే విధానాన్ని వివరించారు. 


ఓ సంప్రదాయవాద పత్రికతో గతంలో అనుబంధం గల జాన్ గేజ్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దానిలో AOC తీరును వ్యంగ్యంగా పేర్కొన్నారు. AOC ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్‌షాట్‌ను పెట్టి, ‘‘గర్భస్రావంపై నిషేధాన్ని ఎలా తప్పించుకోవచ్చునో AOC వివరిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 


ఈ వ్యంగ్యాస్త్రాన్ని AOC చక్కగా వినియోగించుకున్నారు. తన స్టోరీస్‌కు ఈ వ్యంగ్యాస్త్రాన్ని జోడించి షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది డైరెక్ట్ లింక్ అడుగుతున్నారని, దానిని ఇక్కడ జత చేస్తున్నానని కూడా పోస్ట్ చేస్తున్నారు. 


AOC ట్వీట్లు కొద్ది గంటల్లోనే వేలాదిగా రీట్వీట్ అవుతున్నాయి. ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ, తాను రో తీర్పు కోసం పోరాడిన వెటరన్‌నని తెలిపారు. AOC ధైర్య, సాహసాలను మెచ్చుకున్నారు. మంచి సమాచారం అందజేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు లేని కాలంలో (1970వ దశకంలో) తాము కూడా ఇదేవిధంగా చేసినట్లు చెప్పారు. ఇప్పుడు AOC ట్వీట్లకు విస్తృత స్పందన వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 


గర్భస్రావమే ప్రాణాలను కాపాడింది

కాజల్ అగర్వాల్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, తాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల అనుభవించిన కష్టాలను పంచుకున్నారు.  గర్భస్రావం తన ప్రాణాలను ఏ విధంగా కాపాడిందో వివరించారు. ఆమె 2022 ఏప్రిల్ 19న ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-06-29T19:43:06+05:30 IST