వాహ్..! ఇది కదా మానవత్వమంటే.. Americaలోని ఆ Restaurant గొప్పతనం తెలుసా..?

ABN , First Publish Date - 2021-08-31T21:51:33+05:30 IST

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన కాళ్లు నేలమీదే ఉండాలని పెద్దలంటారు. తోటి వారికి చేయూతనందించి, కష్టాల్లో ఉన్నవారికి..

వాహ్..! ఇది కదా మానవత్వమంటే.. Americaలోని ఆ Restaurant గొప్పతనం తెలుసా..?

న్యూయార్క్: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన కాళ్లు నేలమీదే ఉండాలని పెద్దలంటారు. తోటి వారికి చేయూతనందించి, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలోనే నిజమైన మానవత్వం దాగుందంటారు. సరిగ్గా అలాంటి పనే చేస్తోంది ఆ హోటల్. ఓ భిక్షగాడికి ఉచితంగా భోజనం పెడుతూ అతడి కడుపు నింపుతోంది. అది కూడా ఏదో ఒకటి  రెండు రోజులు కాదు.. ఏకంగా ఏళ్లుగా ఇలా అతడి ఆకలి తీరుస్తోంది. నెక్స్ట్ డోర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా జనేస్సా అనే ఓ మహిళ ఈ విషయానికి సంబంధించిన పోస్ట్ చేసింది. దీంతో  ఈ ఉదంతం ఎంతోమంది నెటిజన్లు హృదయాలను కదిలించింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.


జనేస్సా చేసిన పోస్ట్ ప్రకారం.. ‘‘న్యూయార్క్ సిటీలోని స్టేటెన్ ఐలాండ్‌లోని బేగెల్స్ ఎన్' బన్స్ అనే రెస్టారెంట్ కౌంటర్ వద్ద ఓ ఆర్డర్ కోసం వేచి చూస్తున్నాను. ఇంతలో రెస్టారెంట్ వద్దకు ఓ భిక్షగాడు వచ్చాడు. అతడి వద్దకు రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వెయిటర్ వెళ్లి.. ‘ఏం కావాలని ఆ భిక్షగాడిని అడిగాడు. తన వద్ద ఉన్న ఓ డబ్బా చూపించి నీళ్లు కావాలని  ఆ భిక్షగాడు అడిగాడు. అతడి చేతిలో దాదాపు అర గ్యాలన్(రెండు లీటర్లు) నీరు పట్టే పెద్ద డబ్బా అది. కౌంటర్ వద్ద నుంచి చూస్తున్న నేను.. వెయిటర్ ఒప్పుకోడని, అన్ని నీళ్లు కావాలంటే డబ్బులు అడుగుతాడని అనుకున్నా. కానీ ఆ వెయిటర్ అలా అడగకుండా.. అన్ని నీళ్లెందుకని అతడిని ప్రశ్నించాడు. దానికి అవతలి వ్యక్తి తాగడానికని సమాధానమిచ్చాడు. దానికి వెయిటర్ మరెలాంటి ప్రశ్నలూ వేయకుండా ‘ఆ కూలర్ పక్కన మంచినీళ్లున్నాయి. వెళ్లి ఎన్ని కావాలో పట్టుకో’ అని సమాధానమిచ్చాడు.


ఆ వ్యక్తి అక్కడకు వెళ్లి నీళ్లు పట్టుకుని వచ్చాడు. నీళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూనే.. తనకు చాలా ఆకలిగా ఉందని, ఏదైనా పెట్టమని అడిగాడు. దానికి కూడా ఆ వెయిటర్ కోపగించుకోకుండా.. అతడి వద్ద చాలా మర్యాదగా ఆర్డర్ తీసుకున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అయితే అతడికి నేను కూడా ఏమైనా సాయం చేయాలనుకున్నాను. అక్కడి రిజిస్టర్(రిసెప్షనిస్ట్) కేథీ వద్దకు వెళ్లాను. అతడి కోసం కొంత సొమ్ము ఇస్తానని చెప్పాను. దానితో అతడికి కొంత కాలం భోజనం పెట్టమని అడిగాను. దానికి కేథీ ఇచ్చిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయాను. ‘జనేస్సా.. చాలా సంతోషం. కానీ అతడు ఎప్పుడు ఆకలిగా ఉన్నా మేము అతడికి భోజనం పెడతాం’ అని సమాధానమిచ్చింది. దాదాపు ఏళ్లుగా అతడికి ఈ రెస్టారెంట్ ఉచితంగా భోజనం, తాగు నీరు అందిస్తోంది. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది‘‘ అని జనేస్సా తన పోస్ట్‌లో వెల్లడించింది.


ఇదిలా ఉంటే జనేస్సా పోస్ట్‌పై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ పోస్ట్‌ను వెయ్యి సార్లు ఎలా లైక్ చేయాలనుంది. ఎలా..?’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘ఇది అసలైన మానవత్వం అంటే. ఏ మాత్రం ఊహించలేదు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఇంకో యూజర్.. ‘ఆమెన్.. ఆ ఉద్యోగిని, అతడి సేవలను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి. ఇలాంటి వాళ్లే ఈ రోజుల్లో మనకు కావాల్సింది’ అని కామెంట్ చేయగా, ఇకొంకరు.. ‘ఇలాంటి పేదలకు అండగా నిలుస్తున్న వారి మంచితనం అభినందించాల్సిందే. ఆ రెస్టారెంట్ వ్యాపారం చాలా వృద్ధి చెందాలి’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2021-08-31T21:51:33+05:30 IST