బైల్స్‌కు మానసిక సమస్య?

ABN , First Publish Date - 2021-07-28T09:40:39+05:30 IST

మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ ఆల్‌రౌండ్‌ ఫైనల్‌ జరుగుతుండగా.. అమెరికన్‌ సూపర్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌ అర్థంతరంగా జట్టు నుంచి వైదొలిగింది...

బైల్స్‌కు మానసిక సమస్య?

మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ ఆల్‌రౌండ్‌ ఫైనల్‌ జరుగుతుండగా..   అమెరికన్‌ సూపర్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌ అర్థంతరంగా జట్టు నుంచి వైదొలిగింది. దీంతో ఆమెకు ఏమైందనే ఆందోళన అందరిలో నెలకొంది. మంగళవారం జరిగిన ఈ పోరులో ముందుగా బైల్స్‌ వాల్ట్‌ ఈవెంట్‌ బరిలోకి దిగింది. అయితే పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచాక ఆమె హఠాత్తుగా టీమ్‌ను వీడింది. దీంతో మిగిలిన అన్‌ఈవెన్‌ బార్‌, బీమ్‌, ఫ్లోర్‌ ఈవెంట్లలో మరో జిమ్నాస్ట్‌ను బరిలోకి దించారు. అయితే బైల్స్‌ సమస్యకు కారణమేంటో మొదట అమెరికా జిమ్నాస్టిక్స్‌ సంఘం స్పష్టం చేయకపోయినా.. ఫైనల్స్‌ ముగిశాక బైల్స్‌ స్పందించింది. ‘నేను వైదొలిగింది గాయంతో కాదు.. మానసికంగా కాస్త విశ్రాంతి తీసుకోవాలనిపించింది. మా జట్టులో ఇతర జిమ్నాస్ట్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారు నా బాధ్యతను తీసుకుని జట్టు గర్వపడేలా చేశారు. ఇప్పుడు విశ్రాంతికి కాస్త సమయం లభించింది. ఆ తర్వాత మిగతా పోటీలపై దృష్టి పెడతా’ అని బైల్స్‌ పేర్కొంది. ఈ ఫైనల్లో రష్యా స్వర్ణం గెలవగా, అమెరికాకు రజతం దక్కింది. పతక ప్రదానోత్సవానికి మాత్రం బైల్స్‌ హాజరైంది. 2016 రియో గేమ్స్‌లో బైల్స్‌ ఏకంగా నాలుగు స్వర్ణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.


Updated Date - 2021-07-28T09:40:39+05:30 IST