జియోలో కేకేఆర్‌కు వాటా

ABN , First Publish Date - 2020-05-23T07:35:14+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) తమ డిజిటల్‌ విభాగం జియోలో మరో 2.32 శాతం వాటాలను విక్రయించింది. ఈ విడత ఆ వాటాలను అమెరికాకు చెందిన పీఈ దిగ్గజం కేకేఆర్‌కు రూ.11,367 కోట్లకు విక్రయించినట్టు...

జియోలో కేకేఆర్‌కు వాటా

  • 2.32 శాతం వాటా కొనుగోలు
  • డీల్‌ ధర రూ.11,367 కోట్లు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) తమ డిజిటల్‌ విభాగం జియోలో మరో 2.32 శాతం వాటాలను విక్రయించింది. ఈ విడత ఆ వాటాలను అమెరికాకు చెందిన పీఈ దిగ్గజం కేకేఆర్‌కు రూ.11,367 కోట్లకు విక్రయించినట్టు తెలిపింది. నాలుగు వారాల వ్యవధిలో ఇది ఐదో డీల్‌. దీంతో మొత్తం రూ.78,562 కోట్ల నిధులు ఆర్‌ఐఎల్‌కు అందాయి. ఈ లావాదేవీతో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లకు పెరిగినట్టు కంపెనీ తెలిపింది. ఆసియాలో కేకేఆర్‌కు అతి పెద్ద పెట్టుబడి ఇదేనని పేర్కొంది. ఏప్రిల్‌ 22వ తేదీన ప్రారంభమైన తొలి వాటాల విక్రయం ప్రక్రియ ఇప్పటికి ఐదు విడతలు పూర్తయింది. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ (ఏప్రిల్‌ 22), సిల్వర్‌లేక్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ (మే 8), జనరల్‌ అట్లాంటిక్‌ (మే 17) కంపెనీలు జియోలో వాటాలు కొనుగోలు చేశాయి. 1976లో ఏర్పాటైన కేకేఆర్‌ ఇప్పటికే టెక్నాలజీ, బీఎంసీ సాఫ్ట్‌వేర్‌, బైటెండెన్స్‌, గోజెక్‌ కంపెనీల్లో భారీగా నిధులు ఇన్వెస్ట్‌ చేసింది. ఇప్పటివరకు ఆ కంపెనీ 20కి పైగా టెక్నాలజీ కంపెనీల్లో 3 వేల కోట్ల డాలర్ల పైబడిన నిధులు పెట్టుబడిగా పెట్టింది. 

Updated Date - 2020-05-23T07:35:14+05:30 IST