చైనా గూఢచర్యంపై అమెరికా, బ్రిటన్ నిఘా సంస్థల హెచ్చరిక... భారత్‌కు మేలుకొలుపు...

ABN , First Publish Date - 2022-07-07T19:23:12+05:30 IST

అమెరికా, బ్రిటన్ ప్రయోజనాలకు దీర్ఘ కాలంలో చైనా నుంచి

చైనా గూఢచర్యంపై అమెరికా, బ్రిటన్ నిఘా సంస్థల హెచ్చరిక... భారత్‌కు మేలుకొలుపు...

న్యూఢిల్లీ : అమెరికా, బ్రిటన్ ప్రయోజనాలకు దీర్ఘ కాలంలో చైనా నుంచి ముప్పు ఎదురవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా ఎదుగుదల వల్ల ఆ రెండు దేశాలకు మాత్రమే కాకుండా భారత్ సహా యావత్తు ప్రపంచ ప్రయోజనాలకు హాని జరుగుతుందని హెచ్చరికలు వస్తున్నాయి. బుధవారం అత్యంత అరుదైన సంఘటనతో ఈ ఆందోళన మరింత బలపడింది. అమెరికా, బ్రిటన్ నిఘా, భద్రతా వ్యవస్థలు ఎఫ్‌బీఐ, ఎంఐ5 అధిపతులు క్రిస్టఫర్ రే, కెన్ మెక్‌కల్లమ్ సంయుక్తంగా మీడియాతో అనేక వివరాలను పంచుకున్నారు. 


ఈ విధంగా అమెరికా, బ్రిటన్ భద్రతా వ్యవస్థల అధిపతులు సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా అరుదు. పాశ్చాత్య దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను వీరు వివరించారు. లాబీయింగ్, ధనబలాలతో ప్రభుత్వాల విధాన నిర్ణయ ప్రక్రియలను చైనా ప్రభావితం చేస్తోందని ప్రపంచాన్ని హెచ్చరించారు. 


జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఈ ఏడాది చివర్లో జరిగే కమ్యూనిస్టు పార్టీ (China Communist Party) ఎన్నికల్లో మూడోసారి ఎన్నికై, చైనా శాశ్వత అధ్యక్షునిగా స్థిరపడటం కోసం ప్రయత్నిస్తున్నారని అమెరికాలో పలుకుబడిగల మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో భారతదేశం (India), నరేంద్ర మోదీ (Narendra Modi)  ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, ఇది వారికి ఓ మేలుకొలుపు వంటిదని పేర్కొంది. జిన్‌పింగ్ తన రాజకీయ అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు, సెంట్రల్ మిలిటరీ కమిషన్, విదేశాంగ విధానాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది. శక్తిమంతమైన చైనాకు నూతన చక్రవర్తిగా జీ జిన్‌పింగ్ తయారు కాబోతున్నారని పేర్కొంది. సున్నీ ముస్లింలు అధికంగాగల జింజియాంగ్ రీజియన్‌లో చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, పాకిస్థాన్ (Pakistan), ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) సహా ముస్లిం దేశాలకు చైనాను నిలదీసే సత్తా లేదని తెలిపింది. 


లండన్‌లోని థేమ్స్ హౌస్‌లో ఎంఐ-5 ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఎంఐ-5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ, ఆందోళనకరమైన చైనా కార్యకలాపాలపై తాము గతంలో చేసిన కృషిని ప్రస్తుతం రెట్టింపు చేసినట్లు తెలిపారు. 2018లో నిర్వహించిన దర్యాప్తులకు ఏడు రెట్లు ఎక్కువ దర్యాప్తులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. సైబర్ గూఢచర్యం నుంచి రక్షణ పొందాలని కోరుతూ 37 దేశాలతో నిఘా సమాచారాన్ని బ్రిటన్ పంచుకుందన్నారు. ముఖ్యమైన ఏరోస్పేస్ కంపెనీలకు ఎదురయ్యే ముప్పును మే నెలలో తాము భగ్నం చేయగలిగామని తెలిపారు. 


ఎఫ్‌బీఐ (Federal Bureau of Investigation) డైరెక్టర్ క్రిస్టఫర్ రే మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్, ఈ రెండు దేశాలకు యూరోపులో ఉన్న మిత్ర దేశాలు, ఇతర దేశాల జాతీయ, ఆర్థిక భద్రతకు చైనా నుంచి అతి పెద్ద, దీర్ఘకాలిక ముప్పు ఉందని చెప్పారు. అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి ఓ రూపం ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ ఏడాది న్యూయార్క్‌లో జరిగిన కంగ్రెషనల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగానే చైనా జోక్యం చేసుకుందన్నారు. తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొని, చైనాను విమర్శిస్తున్న ఓ అభ్యర్థి గెలవకూడదని చైనా కోరుకుందన్నారు. 


పాశ్చాత్య దేశాల వ్యాపార సంస్థలకు చైనా ప్రభుత్వం నుంచి మరింత ఎక్కువ ముప్పు ఉందన్నారు. అత్యాధునిక వ్యాపార సంస్థల యాజమాన్యాలు సైతం గుర్తించలేనంత ముప్పు ఉందని తెలిపారు. ఆయా దేశాల్లోని టెక్నాలజీని చైనా దొంగతనం చేస్తోందన్నారు. చైనా ప్రభుత్వం హ్యాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, మిగిలిన ప్రధాన దేశాల్లోని హ్యాకింగ్ వ్యవస్థల కన్నా ఇది చాలా పెద్దదని వివరించారు. 


Updated Date - 2022-07-07T19:23:12+05:30 IST