ఏనాడూ భారత్‌ను అర్థం చేసుకోని అమెరికా!

ABN , First Publish Date - 2022-05-29T06:04:37+05:30 IST

ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడంతో ప్రచ్ఛన్నయుద్ధ విరోధాలు మళ్లీ రంగంలోకి వచ్చాయి. మంచి-చెడు మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ యుద్ధాన్ని చెపుతున్నారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో మిత్రదేశాల మద్దతును...

ఏనాడూ భారత్‌ను అర్థం చేసుకోని అమెరికా!

ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడంతో ప్రచ్ఛన్నయుద్ధ విరోధాలు మళ్లీ రంగంలోకి వచ్చాయి. మంచి-చెడు మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ యుద్ధాన్ని చెపుతున్నారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో మిత్రదేశాల మద్దతును సాధించడంలో సఫలమయ్యారు. అయితే కొత్తగా ఏర్పాటైన క్వాడ్ కూటమిలో ఆయనకు పాక్షిక విజయం మాత్రమే లభించింది. ఈ కూటమి సభ్య దేశాలలో ఒకటైన భారత్, రష్యా దురాక్రమణను ఖండించేందుకు ఎంత మాత్రం కలిసిరావడం లేదు. రష్యా వ్యతిరేక అంతర్జాతీయ సంకీర్ణంలో చేరేలా భారత్‌కు నచ్చ జెప్పేందుకు పలు పాశ్చాత్యదేశాలు తమ ఉన్నతస్థాయి దౌత్యవేత్తలను న్యూఢిల్లీకి పంపి సకల ప్రయత్నాలు చేశాయి. జో బైడెన్ స్వయంగా గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన చర్చల్లో భారత్‌పై ఒత్తిడి పెంచారు. రష్యా దురాక్రమణను ఖండించడం పట్ల భారత్ వైఖరి ‘దుర్బలంగా’ ఉందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. న్యూఢిల్లీ విధానం తనకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని జో బైడెన్ నిర్మొహమాటంగా చెప్పారు. 


రష్యాను ఖండించడంలో వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య ఏకీభావం లేకపోవడం వింతగా కన్పిస్తుంది ఒక దశాబ్ద కాలానికి పైగా భారత్‌తో శాశ్వత భాగస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉభయ దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలు కావడంతోపాటు ప్రపంచాధిపత్యానికి చైనా ఆరాటం అటు వాషింగ్టన్‌కూ, ఇటు న్యూఢిల్లీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సైనిక సామగ్రి, ఇంధన దిగుమతులకు రష్యాపై ఆధారపడి ఉన్నందునే ఉక్రెయిన్‌పై మాస్కో దురాగతాన్ని ఖండించేందుకు భారత్ సుముఖంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత్-–అమెరికా సంబంధాలు ఎందుకు అనిశ్చితంగా ఉన్నాయనే విషయాన్ని ఆ కారణాలు పూర్తిగా వివరించలేవు. నిజానికి సైద్ధాంతికంగా చూస్తే భారత్, అమెరికా శాశ్వత భాగస్వాములుగా ఉండి తీరాలి. అయితే అటువంటి స్నేహబంధాన్ని ఉభయ దేశాలు పెంపొందించుకోలేక పోతున్నాయి. దశాబ్దాలుగా భిన్న ప్రపంచ దృక్పథాలు కలిగి ఉండడంతో పాటు తరచు పరస్పర వ్యతిరేక లక్ష్యాలతో వ్యవహరించవలసి రావడం వల్ల కూడా భారత్-–అమెరికాల మధ్య సంబంధాలు దృఢతరం కాలేకపోతున్నాయి. 2022లో భారత్ అనుసరిస్తున్న వైఖరిని అర్థం చేసుకోవాలంటే ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికాతో భారత్ సంబంధాలను నిశితంగా పరిశీలించవలసి ఉంది. 


1947లో భారత్, ప్రపంచ అతి పెద్ద కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆవిర్భవించినప్పుడు, ప్రపంచ అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాతో దాని సంబంధాలు ఏ విధంగా చూసినా స్నేహపూర్వకంగా ఉండాలి. నియమబద్ధ అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఎన్నికలు, చట్టబద్ధ పాలన, వాక్ స్వాతంత్ర్యం, పౌర హక్కులకు నిబద్ధమయిన ప్రజాస్వామ్య దేశాలవి. అయినా ఉభయ దేశాలూ వివిధ అంతర్జాతీయ పరిణామాలను భిన్న కోణాలలో చూడడం వల్ల పరస్పర వ్యతిరేకంగా వ్యవహరించవలసి రావడం అనివార్యమయింది. భారత్‌కు స్వాతంత్ర్యం రాక పూర్వమే ఉభయ దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో భారత్‌కు సత్వరమే స్వాతంత్ర్యం ఇచ్చేలా బ్రిటన్‌కు నచ్చచెప్పాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్‌ను జవహర్ లాల్ నెహ్రూ కోరారు. భారత్‌కు స్వాతంత్ర్యమివ్వడం అన్ని విధాల శ్రేయస్కరమని బ్రిటిష్ ప్రధాని చర్చిల్‌కు నచ్చచెప్పేందుకు రూజ్వెల్ట్ ప్రయత్నించారు. అయితే చర్చిల్ అంగీకరించలేదు. దీంతో రూజ్వెల్ట్ తన ప్రయత్నాలను పూర్తిగా విరమించారు. ఇది, నెహ్రూకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. 


స్వాతంత్ర్యానంతరం కొత్త వివాదాలు మొదలయ్యాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాత్మక పద్ధతులతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న భారత్ అంతర్జాతీయ వ్యవహారాలలో స్వతంత్ర విధానాన్ని అనుసరించింది. అమెరికా, సోవియట్ యూనియన్‌ల నేతృత్వంలోని సైనిక కూటములలో చేరేందుకుగానీ, వాటికి మద్దతునిచ్చేందుకుగానీ నిరాకరించింది. భారతదేశం అనుసరించిన అలీన విధానం అమెరికాకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. అలీన విధానం పేరిట సోవియట్ కూటమికే నెహ్రూ మద్దతునిస్తున్నారని అమెరికా పాలకులు అనుమానించారు. అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ అయితే నెహ్రూను ‘కమ్యూనిస్టు’ అని నిందించాడు. అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న జాన్ ఫాస్టర్ డల్లెస్ అయితే నిక్కచ్చిగా అలీన విధానం అనైతికమని దుయ్యబట్టారు. ‘మా పక్షాన లేనివారు మాకు వ్యతిరేకులే’ అని డల్లెస్ బెదిరించాడు. అయినా నెహ్రూ అలీన విధానానికే నిబద్ధమయ్యారు.


ఆర్థిక సహాయాన్ని అందించడంలో అమెరికా వైఖరిని స్వతంత్ర భారతదేశ పాలకులు హర్షించలేక పోయారు. భారత్‌కు అన్ని విధాల సహాయమందించడం పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థగా, సంపన్న దేశంగా అమెరికా నైతిక కర్తవ్యమని నెహ్రూ విశ్వసించారు. అయితే అమెరికా శాసన నిర్మాతలు తమ సహాయాన్ని అందుకునే దేశాలు తమ పట్ల కృతజ్ఞతగా ఉండాలని, తమ విధానాలను సమర్థించాలని అహంకరించారు. ఈ వైఖరి నెహ్రూకు చికాకు కలిగించింది. ఇజ్రాయిల్, కొరియా వ్యవహారాలలో అమెరికా విధానాలను భారత్ సమర్థించలేదు. ఐక్యరాజ్యమితిలో ఇంకా వివిధ అంశాలలో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది, ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్ఠమయ్యేందుకు ఆటంకమయింది. 


ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా భారత్‌ను పారిశ్రామిక దేశంగా అభివృద్ధిపరిచేందుకు నెహ్రూ సంకల్పించారు. బొకారోలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అమెరికా సహాయాన్ని నెహ్రూ ఆశించారు. ఈ విషయమై ఉభయ దేశాల మధ్య జరిగిన సంప్రదింపులు ఫలించలేదు. అంతిమంగా సోవియట్ యూనియన్ ముందుకు వచ్చి బొకారోలో ఉక్కు కర్మాగారం ఏర్పాటునకు అన్ని విధాల తోడ్పడింది. నెహ్రూ మరణాంతరం కూడా ఉభయ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. 1960 దశకం మధ్యనాళ్లలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నది. ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ వాషింగ్టన్ వెళ్లి ఆహారధాన్యాలను సరఫరా చేయాలని కోరారు. షరతులతో కూడిన సహాయాన్ని అందించించేంకు అమెరికా అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు, అమెరికా ప్రభుత్వం ఒత్తిడి ఫలితంగా రూపాయి విలువను ఇందిర తగ్గించారు. ఈ చర్యను ఆమె ప్రభుత్వంలోని వారే తీవ్రంగా విమర్శించారు. అప్పటికి బలీయ శక్తులుగా ఉన్న వామపక్షాలు ఇందిరకు పూర్తిగా వ్యతిరేకులు అయ్యారు. ఆహారధాన్యాల సరఫరా విషయమై వాషింగ్టన్ తన హామీని చిత్తశుద్ధితో నెరవేర్చక పోవడం పట్ల ఇందిర అసంతృప్తి చెందారు. దరిమిలా వియత్నాం విషయంలో అమెరికా విధానాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఆహారధాన్యాల సరఫరాలను మరింత జాప్యం చేశారు. ఆహారాన్ని అమెరికా ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని న్యూఢిల్లీ విమర్శించడంతో ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింతగా దిగజారాయి. 


1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో అమెరికా పాకిస్థాన్‌కు బాసటగా నిలిచింది. 1974లో భారత్ విజయవంతంగా అణుపాటవ పరీక్షను నిర్వహించడంతో అమెరికా అనేక ఆంక్షలు విధించింది. ఈ కారణాలన్నిటి వల్ల భారత్ తన సైనిక అవసరాలకు పూర్తిగా సోవియట్ యూనియన్‌పై ఆధారపడడం అనివార్యమయింది. ఇప్పటికీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న సైనిక సామగ్రే భారత సైన్యం అవసరాలను అత్యధికంగా తీరుస్తోంది. 1990 దశకంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా భారత్ సకల రంగాలలో శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించింది. చైనా ప్రభవ ప్రాభవాలను అడ్డుకునేందుకు భారత్‌ను ఉపయోగించుకునేందుకు అమెరికా పాలకులు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అణురంగంలో సైతం సహాయాన్ని అందించసాగారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికాతో స్నేహ సంబంధాలకు కీలక ప్రాధాన్యమివ్వడం భారత్ విదేశాంగ విధానానికి ఒక మూలస్తంభమయింది.


ఉక్రెయిన్ సంక్షోభం భారత్, అమెరికాల మధ్య కొత్తగా అభివృద్ధి చెందుతున్న శాశ్వత భాగస్వామ్యాన్ని సవాల్ చేసింది. తన భూభాగాలను 1962లోనూ, 2020లోనూ ఆక్రమించుకున్న చైనాను అదుపు చేసేందుకు అమెరికాతో సంబంధాలను మరింతగా పటిష్ఠం చేసుకునేందుకు భారత్ నిర్ణయించుకుంది. అయితే రక్షణ సామగ్రికి రష్యాపై ఆధారపడడం తప్పనిసరి. ఇరుగుపొరుగున ఉన్న రెండు అణు రాజ్యాల నుంచి తన భద్రతకు ముప్పు ఉందన్న వాస్తవాన్ని భారత్ విస్మరించలేదు. ఈ కారణంగా ఉక్రెయిన్ సంక్షోభంలో పాశ్చాత్య దేశాలకు మద్దతునిచ్చేందుకు న్యూఢిల్లీ వెనుకాడుతోంది. భారత్ సందిగ్ధ పరిస్థితిని అర్థం చేసుకున్నామని అమెరికా స్పష్టంగా చెప్పినప్పటికీ రష్యా నుంచి ఇటీవల పెద్ద ఎత్తున యుద్ధ సామగ్రిని భారత్ కొనుగోలు చేసింది. దీంతో అమెరికాతో భారత్ సైనిక సంబంధాలపై మేఘాలు కమ్ముకున్నాయి. 

మీనాక్షి అహ్మద్

వ్యాసకర్త ‘A Matter of Trust- U.S. India relations from Truman to Trump’ పుస్తక రచయిత్రి.

(‘ది అట్లాంటిక్‌’ సౌజన్యంతో)

Updated Date - 2022-05-29T06:04:37+05:30 IST