ఈ ఫొటోలోని పాప పుట్టుకతోనే ఓ సెన్సేషన్.. ఒకప్పటి మేగజైన్లపై ఫొటోలు.. ప్రస్తుతం ఆమె ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2021-12-29T01:19:01+05:30 IST

ఈ పాప పుట్టుకే ఓ సంచలనం..! అందరిలాగా ఆమె పుట్టులేదు.. ఆధునిక సాంకేతిక అందించిన బహుమతి ఆమె.

ఈ ఫొటోలోని పాప పుట్టుకతోనే ఓ సెన్సేషన్.. ఒకప్పటి మేగజైన్లపై ఫొటోలు.. ప్రస్తుతం ఆమె ఎలా ఉందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ పాప పుట్టుకే ఓ సంచలనం..! అందరిలాగా ఆమె పుట్టలేదు.. ఆధునిక సాంకేతికత అందించిన బహుమతి ఆమె. కృత్రిమ గర్భధారణ..ఈ పదం ఇప్పుడు మనకు కొత్తేం కాదు కానీ.. ఆ పాప పుట్టిన సమయంలో మాత్రం అందరూ నోరెళ్ల పెట్టారు.  ఓ ప్రయోగశాల బిడ్డ పుట్టుకకు కారణమైందా  అంటూ ఆశ్చర్యపోయారు. కొందరు సంప్రదాయవాదులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె ఉనికినే వ్యతిరేకించారు. కానీ.. నాటి అపోహలు, ద్వేషాన్ని అధికమిస్తూ ఆ పాప పెరిగి పెద్దది అయింది. ప్రస్తుతం ఆమెకు 40 ఏళ్లు. శాస్త్రవిజ్ఞానం సాధించిన విజయాలకు ప్రతీకగా నిలిచిన ఆమె పేరు ఎలిజబెత్ కార్! ఆమె అమెరికాలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఐవీఫ్(ఇన్‌విట్రోఫర్టిలైజేషన్) పద్ధతిలో ప్రాణం పోసుకున్న చిన్నారి..!


ఎలిజెబెత్ తల్లిదండ్రులు జూడిత్, రోజర్ కార్‌లు సహజ పద్ధతుల్లో సంతానం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పలు మార్లు గర్భస్రావం జరగడంతో ఇక పిల్లలు పుట్టరన్న నిరాశ వారిని ఆవరించింది. అటువంటి తరుణంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం కోసం ప్రయత్నిద్దామని వారు అనుకున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు తల్లి నుంచి అండాన్ని, తండ్రి నుంచి శుక్రకణాలను సేకరించి ఓ టెస్ట్‌ ట్యూబ్‌లో ఫలదీకరణం చెందేలా చేశారు. అలా రూపుదిద్దుకున్న పిండాన్ని తల్లిలో ప్రవేశపెట్టారు. ఇది జరిగిన తొమ్మిది నెలల తరువాత అంటే 1981, డిసెంబర్ 28న .. జూడిత్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ జంట తమ చిన్నారికి ఎలిజబెత్ కార్ అని పేరు పెట్టుకుంది.  


ఎలిజబెత్ కార్ పుట్టకతోనే ఓ సంచలనంగా మారింది. పాప పుట్టుకకు సంబంధించిన వివరాలు తెలిపితే బోలెడంత డబ్బులు ఇస్తామంటూ ఓ వార్త పత్రిక కార్ దంపతులకు ఆఫర్ ఇచ్చింది. కానీ.. వారు మాత్రం దీన్ని మరో ఆలోచన లేకుండా తోసి పుచ్చారు. అప్పటికే  సంప్రదాయ వాదుల నుంచి విమర్శలు ఎక్కువ అవుతున్న తరుణంలో వారు తమ వివరాలు గోప్యంగా ఉంచేందుకే మొగ్గు చూపారు. అలా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి పెద్దదైని కార్..ఇటీవలే నలభయ్యో పడిలోకి అడుగుపెట్టింది. ఆమె కాస్త పెద్దదైయ్యాకే ఆమె ఫొటోలను ప్రచురించే అవకాశం అప్పటి మ్యాగజైన్లకు లభించింది. దీంతో ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయింది. కాగా.. మంగళవారం నాడు నలభైయ్యో పడిలోని అడుగుపెట్టిన ఆమె నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంది. నేటికాలంలో కృత్రిమ గర్భధారణ విధానాలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని కార్ ఆవేదన వ్యక్తం చేసింది. తన కోసం తల్లిదండ్రులు పెద్దగా ఖర్చు పెట్టలేదని చెప్పిన ఆమె.. నేటి జంటలు మాత్రం పిల్లల బోసినవ్వుల కోసం వేల డాలర్లు ఖర్చు చేస్తున్న వైనాన్ని ప్రస్తావించింది. ఈ పరిస్థితి మారాల్సి ఉందని కూడా ఎలిజబెత్ కార్ అభిప్రాయపడింది. 

Updated Date - 2021-12-29T01:19:01+05:30 IST