అమెరికా చరిత్రలో పెద్ద సంక్షోభం

ABN , First Publish Date - 2020-04-05T07:15:16+05:30 IST

అమెరికా మొత్తాన్ని చుట్టుముడుతున్న కరోనా వైరస్‌ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా సంక్షోభాన్ని సృష్టిస్తుందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా అమెరికాలోని 90% ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ జరుగుతోంద...

అమెరికా చరిత్రలో పెద్ద సంక్షోభం

1982 తర్వాత ఉద్యోగాల్లో భారీ కోత

తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ 

ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌


(న్యూయార్క్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అమెరికా మొత్తాన్ని చుట్టుముడుతున్న కరోనా వైరస్‌ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా సంక్షోభాన్ని సృష్టిస్తుందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా అమెరికాలోని 90% ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ జరుగుతోందని, దీంతో 2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 1982లో అమెరికాను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం కన్నా ఇది 100% అధిక సంక్షోభాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. తాను నివసిస్తున్న న్యూయార్క్‌లో ప్రతి గంటకు వందల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 30 మంది ప్రముఖులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని, న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్వోమో సోదరుడికీ కరోనా సోకిందని వెల్లడించారు. 15% మంది ఫైర్‌ సిబ్బందికి, 300 మంది పోలీసులకు సైతం కరోనా సోకిందన్నారు. 


న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోనే సగం బాధితులు

అమెరికాలోని లక్షలాది మంది కరోనా బాధితుల్లో న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల వారే సగం మంది ఉన్నారని జయశేఖర్‌ చెప్పారు. ఉపాధి కోల్పోయిన వారి కోసం అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన 2.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసా ఉన్న వారు మరో ఉద్యోగంలో చేరేందుకు గతంలో 60 రోజుల సమయం ఉండేదని, దాన్ని 180 రోజులకు పెంచాలని తానాతో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. చిన్న వ్యాపారులకు 10 వేల డాలర్ల ఆర్థిక సాయం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. క్రైస్లర్‌, బెడ్‌బాత్‌ వంటి భారీ కంపెనీలు ప్రకటించిన లాక్‌డౌన్‌తో హెచ్‌1బీ వీసాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారి కోసం తానా ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని జయశేఖర్‌ చెప్పారు. మూసేసిన వివిధ యూనివర్సిటీల్లోని హాస్టల్‌ విద్యార్థులకు బయట వసతి సౌకర్యం కల్పించామన్నారు. నిధులు సేకరించి అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కరోనా బాధితులను ఆదుకుంటామని చెప్పారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారు తానా హెల్ప్‌లైన్‌ 1855&OURTANA నంబరును సంప్రదించాలని జయశేఖర్‌ సూచించారు. 

Updated Date - 2020-04-05T07:15:16+05:30 IST