కేంద్రం నుంచి సవరణ ప్రతిపాదనలు!

ABN , First Publish Date - 2021-12-09T07:17:06+05:30 IST

ఏడాదికి పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలను ముగించడం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన దశలో తమ నిర్ణయాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) గురువారానికి వాయిదా వేసింది.

కేంద్రం నుంచి సవరణ ప్రతిపాదనలు!

  • ఆ ముసాయిదాపైనే ఎస్‌కేఎం చర్చ.. ఏకాభిప్రాయం
  • నేడు మళ్లీ భేటీ.. రైతు ఆందోళనల ముగింపుపై ప్రకటన
  • డిమాండ్ల పరిష్కారంపై సంప్రదింపుల కమిటీ ఆశాభావం

న్యూఢిల్లీ, డిసెంబరు 8: ఏడాదికి పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలను ముగించడం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన దశలో తమ నిర్ణయాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకారం బుధవారం ఎస్‌కేఎం భేటీ జరిగింది. అయితే రైతు సంఘాల పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారం అంశమ్మీద కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా బుధవారం సవరణలో కూడిన ముసాయిదా ప్రతిపాదనలు రావడంతో సమావేశంలో దీనిపైనే చర్చించారు. సవరణలతో కూడిన ప్రతిపాదనపై భేటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. గురువారం మధ్యాహ్నం  12 గంటలకు మరోసారి భేటీ అయి తమ నిర్ణయాన్ని ఎస్‌కేఎం ప్రకటించనుంది. కాగా గతంలో వచ్చిన ప్రతిపాదనలను తాము అంగీకరించని కారణంగానే కేంద్రం తాజా ప్రతిపాదనలను పంపిందని ఎస్‌కేఎం సభ్యుడు గుర్నామ్‌ సింగ్‌ చదునీ పేర్కొన్నారు. గురువారం భేటీ తర్వాతే రైతు ఆందోళనలు ముగించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏడాదికి పైగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలు ప్రస్తుత చరిత్రాత్మక సమయంలో అంతిమ దశకు చేరుకున్నాయని.. అదే సమయంలో సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురిస్తున్నాయని  రైతు నేత యోగేంద్ర యాదవ్‌ పేర్కొనడం విశేషం. కాగా మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం  సహా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఎస్‌కేఎం ఏర్పాటు చేసింది.


ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు తాజా ప్రతిపాదనలు అందాయని, పరిష్కారంపై ఆశాభావంతో ఉన్నామని కమిటీ పేర్కొంది. మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఈ భేటీ కొనసాగింపు అని, ప్రభుత్వానికి కొన్ని అంశాలమీద ప్రశ్నలు అడిగామని.. వాటిపై బుధవారం సవరించిన ముసాయిదా అందిందని, దీనిపై సమావేశంలో చర్చించామని రైతు నేత యుధ్వీర్‌ సింగ్‌ వెల్లడించారు. సమావేశంలో జరిగిన చర్చలు, అభిప్రాయాలను ఎస్‌కేఎం సమావేశం టేబుల్‌పై ఉంచుతామని.. ఒకవేళ మోర్చా అంగీకరిస్తే ఆ మేరకు ముందుకెళతామని చెప్పారు. సవరించిన ముసాయిదాలో ఏముందని ప్రశ్నించగా మోర్చా భేటీ అయ్యేంత వరకు వివరాలేమీ వెల్లడించలేమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-09T07:17:06+05:30 IST