ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బుచ్చిరాజు

ABN , First Publish Date - 2022-07-01T06:46:31+05:30 IST

ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ జి.బుచ్చిరాజు నియమితులయ్యారు.

ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బుచ్చిరాజు
డాక్టర్‌ బుచ్చిరాజు

మహారాణిపేట, జూన్‌ 30: ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ జి.బుచ్చిరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బుచ్చిరాజు కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతిగా సేవలందించారు. ఇటీవల ఆయనకు కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ న్యూరాలజీ విభాగానికి బదిలీ అయ్యింది. తాజాగా ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ మాతృసంస్థకు ప్రిన్సిపాల్‌గా రావడం చాలా సంతోషంగా ఉందని, కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన హయాంలో కళాశాల శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం గౌరవంగా భావిస్తానన్నారు.  


పలువురు వైద్యులకు పదోన్నతులు

ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సత్యనారాయణమూర్తి మచిలీపట్నం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, డాక్టర్‌ కె.జీవన్‌ప్రదీప్‌ విజయనగరం గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ పి.హిమకర్‌ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. వీరికి అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా పదోన్నతులు లభించాయి. 


రేషన్‌ డిపోల్లో మినీ సిలిండర్లు

ఐదు కిలోలు రూ.635

కనెక్షన్‌కు రూ.1,130

4వ తేదీ నుంచి ప్రారంభం

అర్బన్‌ డీఎస్‌వో సూర్యప్రకాష్‌


విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ డిపోల ద్వారా ఐదు కిలోల మినీ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాష్‌ తెలిపారు. గురువారం పందిమెట్ట జంక్షన్‌లోని ద్వారకామయి గ్యాస్‌ ఏజెన్సీలో డీలర్లతో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు కిలోల మినీ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.635కు విక్రయించనున్నట్టు చెప్పారు. కనెక్షన్‌ కోసం వినియోగదారులు  రూ.1130 చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశాఖ జిల్లా పరిధిలో 200 రేషన్‌ డిపోల్లో ఐదు కిలోల సిలిండర్లు అందుబాటులో వుంచాలని నిర్ణయించామన్నారు. ప్రతి డిపోలో 20 మినీ సిలిండర్లు స్టాకు పెట్టుకునేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. ఇంకా వినియోగదారుడి సౌలభ్యం కోసం పలు కంపెనీలకు చెందిన స్టౌలు ఉంటాయన్నారు. చిరు వ్యాపారులకు ఈ మినీ సిలిండర్లు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఈ పథకం జూలై నాలుగో తేదీన ప్రారంభిస్తామన్నారు. గ్యాస్‌ సిలిండర్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్యాస్‌ కంపెనీలు ఈ మినీ సిలిండర్లు, కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఐవోసీఎల్‌ సేల్స్‌ అధికారి ఉమాదేవి, రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. 


6 నుంచి పలు రైళ్లు రద్దు..మరికొన్ని దారిమళ్లింపు

విశాఖపట్నం, జూన్‌ 30: వాల్తేరు డివిజన్‌ పరిధిలోని టిట్లాగర్‌, కెసింగ సెక్షన్‌లో ఆధునికీకరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై ఆరో తేదీ నుంచి పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని మళ్లింపు మార్గంలో నడిపించనున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-రాయపూర్‌-విశాఖ మధ్య నడిచే (08527/08528) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సంబల్‌పూర్‌-రాయగడ-సంబల్‌పూర్‌ (18301/18302) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జూలై ఏడు నుంచి 17వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. తిరుపతి-బిలాస్‌పూర్‌ (17482) ఎక్స్‌ప్రెస్‌ 7, 10, 14 తేదీల్లో, బిలాస్‌పూర్‌-తిరుపతి (17481) ఎక్స్‌ప్రెస్‌ 9, 12, 16 తేదీల్లో రద్దు చేశారు. రూర్కెలా-జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18107)ను 6 నుంచి 16వ తేదీ వరకు, జగదల్‌పూర్‌-రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ (18108)ను ఏడు నుంచి 17వ తేదీ వరకు రద్దు చేశారు.


దారి మళ్లించిన రైళ్లు

టాటా నుంచి ఎర్నాకులం వెళ్లే 18189 నంబరు గల రైలు జూలై 7, 10, 14, 17వ తేదీల్లో...ఎర్నాకులం నుంచి టాటానగర్‌ వచ్చే 18190 నంబరు గల రైలు 6, 10, 13, 17 తేదీల్లో వయా జరోలి, నయాగర్‌, కటక్‌, కుర్దారోడ్డు, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయని వివరించారు. 


మరో 65 మందికి కరోనా

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 65 మందికి వైరస్‌ సోకినట్టు గురువారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,92,220కు చేరింది. ఇందులో 1,90,688 మంది కోలుకోగా, మరో 340 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1,153 మంది మృతిచెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-07-01T06:46:31+05:30 IST