సరిహద్దులో ఆగిన అంబులెన్స్‌!

ABN , First Publish Date - 2021-05-15T09:54:38+05:30 IST

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లా సరిహద్దులో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తీరు కరోనా బాధితులకు శాపంలా మారింది.

సరిహద్దులో ఆగిన అంబులెన్స్‌!

  • కరోనా బాధితుల ప్రాణాలతో టీ-పోలీసుల చెలగాటం
  • అంబులెన్స్‌లు ఆపొద్దన్న టీ-హైకోర్టు 
  • ఆదేశాలనూ లెక్కచేయని వైనం 
  • పుల్లూరు, రామాపురం చెక్‌పోస్టుల నుంచి 
  • 50కి పైగా అంబులెన్స్‌లు వెనక్కి 
  • సాయంత్రం వరకు చెట్ల కిందే బాధితులు
  • ఆక్సిజన్‌ అయిపోతున్నా పట్టని అధికారులు 
  • వచ్చే పోయేవారిని సాయం అర్థిస్తూ వేడుకోళ్లు 
  • ఇద్దరు మరణించారన్న వార్తతో ఉద్రిక్తత 
  • టీ-వాహనాలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు 
  • ట్రాఫిక్‌ బంధంలో ఈ-పాసులున్న వాహనాలూ 
  • రాత్రి 9.30 తర్వాత అంబులెన్స్‌లకు అనుమతి

కర్నూలు(ఆంధ్రజ్యోతి)/జగ్గయ్యపేట రూరల్‌,/దాచేపల్లి, మే 14: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లా సరిహద్దులో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తీరు కరోనా బాధితులకు శాపంలా మారింది. రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుంచి కరోనా అత్యవసర చికిత్సల నిమిత్తం 50కి పైగా అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు శుక్రవారం బయల్దేరాయి. పుల్లూరు చెక్‌పోస్టుకు చేరుకున్న అంబులెన్స్‌లతో పాటు వందలాది వాహనాలను పోలీసులు నిలిపివేశారు.


అనుమతులు ఉంటేనే అనుమతిస్తామని తేల్చిచెప్పడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. ఈ-పా్‌సలు ఉన్నవారి వాహనాలు సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అందులో కరోనా బాధితులున్న అంబులెన్స్‌లున్నా తెలంగాణ పోలీసులు పట్టించుకోలేదు. ఆస్పత్రి అనుమతితో పాటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ ఉంటేనే పంపుతామని తేల్చి చెబుతున్నారు. 


ఉదయం నుంచే అడ్డగింతలు 

శుక్రవారం ఉదయం 5గంటల నుంచే పుల్లూరు చెక్‌పోస్టు వద్ద భారీగా తెలంగాణ పోలీసులు మోహరించారు. తెల్లవారుజామున అక్కడకు 20కి పైగా అంబులెన్స్‌లు చేరుకున్నాయి. అందులో కరోనా బాధితులతో పాటు ఆక్సిజన్‌ అందని స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారిలో చాలామందికి హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో బెడ్లు కూడా కన్ఫర్మ్‌ అయ్యాయి. అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అంబులెన్స్‌ డ్రైవర్లు పోలీసులకు చూపించారు. అయినా ఈ-పా్‌సలు లేనిదే అనుమతించబోమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పలువురు బాధితుల బంధువులు అక్కడినుంచే ఈ-పా్‌సల కోసం ప్రయత్నం చేశారు. కానీ అవి త్వరితగతిన అందకపోవడంతో 35కు పైగా అంబులెన్స్‌లను తిప్పి పంపారు. వెనక్కు వెళ్లలేక డ్రైవర్లు అంబులెన్సులను చెట్ల నీడన ఆపారు. ఇలా వచ్చిన వారిలో కడప, కర్నూలు, కర్ణాటక వాసులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో అంబులెన్సులో రెండేసి సిలిండర్లు ఉంచగా.. అవి ఖాళీ అయిపోతుండటంతో డ్రైవర్లు, వెంట వచ్చిన సిబ్బంది ఆందోళన చెందారు.


విషయం వివరించినా తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. సాయంత్రం వరకు చెట్ల నీడనే పార్కింగ్‌ చేసిన అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకుని ఉన్న బాధితులు వచ్చే పోయేవారిని సాయం అర్థిస్తూ వేడుకుంటున్న దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వచ్చి పోలీసులతో సంప్రదింపులు జరిపినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. హఫీజ్‌ఖాన్‌ అక్కడ ఉన్నప్పుడు ఒక అంబులెన్స్‌ను తెలంగాణలోకి అనుమతించారు. ఆయన వెళ్లిపోగానే తిరిగి వాహనాలు నిలిపివేశారు. 


చెక్‌పోస్టు వద్ద బీజేపీ నిరసన 

తెలంగాణ పోలీసుల వైఖరికి నిరసనగా కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు పుల్లూరు చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను ఏపీలోకి వెళ్లనివ్వబోమని నినదిస్తూ అడ్డుగా నిలబడ్డారు. దీంతో పోలీసులు వారిని అక్కడినుంచి పంపివేశారు. తిరిగి కొద్ది కిలోమీటర్ల దూరంలోని చెకింగ్‌ పాయింట్‌ వద్దకు చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తిరిగి నిరసనను కొనసాగించారు. దాదాపు 2గంటలకు పైగా రోడ్లపై బైఠాయించి వాహనాలను ఏపీలోకి రాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చెకింగ్‌ పాయింట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. డీఎస్పీ మహేశ్‌, ఇతర అధికారులు బీజేపీ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 2.15గంటల సమయంలో నిరసన విరమించారు. 



ఇద్దరా.. ముగ్గురా? 

అంబులెన్సుల నిలిపివేతతో పరిస్థితి విషమించి బాధితుల్లో కొందరు చనిపోయారన్న వార్త క్షణాల్లో చర్చనీయాంశంగా మారింది. మరణించినవారు ఇద్దరని కొందరు చెబుతుండగా.. స్థానికంగా ఉన్న వ్యక్తులు ముగ్గురని పేర్కొంటున్నారు. మృతులు కర్నూలులోని వెంకన్న బావి, చిన్న టేకూరు, పందిపాడు ప్రాంతాలకు చెందిన వారుగా చెబుతున్నారు. మరణాలపై పోలీసుల వద్ద పూర్తి సమాచారం ఉందంటూ సమస్యను ప్రత్యక్షంగా చూసిన కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై పోలీసులు నోరు మెదపడం లేదు. అలాంటిదేమైనా ఉంటే తమకు సమాచారం ఉండేదని, లేని సమాచారాన్ని చెప్పలేక మాట్లాడటం లేదని కర్నూలు డీఎస్పీ వివరించారు. మరోవైపు పొందుగుల, వాడపల్లి సరిహద్దుల్లో సైతం పూర్తిస్థాయి పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ-పాస్‌ ఉంటేనే వాహనాలను పంపుతున్నారు. కొంతమంది వద్ద ఈ-పాస్‌ ఉన్నప్పటికీ ఆస్పత్రి బెడ్‌ ఖాళీ లేకపోవడంతో తెలంగాణ వెళ్లేందుకు అనుమతించడం లేదు. 


అనుమతుల్లేవని వెనక్కి... 

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్దకు కరోనా బాధితులతో పాటు సాధారణ రోగుల బంధువులు ఆయా ప్రాంతాల నుంచి 15 అంబులెన్స్‌ల్లో చేరుకున్నారు. అనుమతులు లేవని ఆ వాహనాలను వెనక్కు పంపడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సాధారణ వైద్యం కోసం వెళ్తున్నామని పత్రాలు చూపి కాళ్లావేళ్లా పడినా పోలీసులు అనుమతించలేదు. నిర్దేశిత పత్రాలుంటే తప్ప అనుమతించేది లేదని తేల్చిచెప్పడంతో అంబులెన్స్‌లు వెనుదిరిగాయి. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్తున్న రోగులను అడ్డుకోవటం అమానుషమని, ఆ వాహనాలను వదలాలని కోరారు. కాగా, ముందస్తు అనుమతి ఉంటేనే అనుమతిస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిందని సమాచారం ఉన్నప్పటికీ శుక్రవారం సాయంత్రం వరకు ఉన్నతాధికారుల నుంచి దీనిపై ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. 


మీరే ప్రాణాలు తీస్తారా?: ఉదయభాను 

విజయనగరం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మూడు అంబులెన్సుల్లో రోగులను హైదరాబాద్‌కు తరలిస్తున్నవారి బంధువులు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఆశ్రయించారు. ఆయన వారితో పాటు రామాపురం క్రాస్‌ రోడ్డు వద్దకు చేరుకుని అంబులెన్స్‌లు పంపాలని సూచించారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకే ప్రభుత్వాలున్నాయని ఇటువంటి పరిస్థితిలో వారి ప్రాణాలను మీరే తీస్తారా అంటు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఖాళీ అంబులెన్స్‌ వెనక్కు 

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి నుంచి విజయవాడకు నాన్‌ కొవిడ్‌తో మృతిచెందిన మహిళను శుక్రవారం వేకువజామున తీసుకువచ్చిన అంబులెన్స్‌ తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా అడ్డుకున్నారు. సంబంధిత పత్రాలు చూపినా అధికారులు వెనక్కు పంపడంతో డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు(70) మెరుగైన వైద్యం కోసం తెల్లవారుజామున సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అనుమతించాలని బతిమాలినా అధికారులు వెనక్కు తిప్పి పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని బంధువులు కారులో వచ్చి ఆమెను కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 


రంజాన్‌లో డ్యూటీకి వచ్చా

రంజాన్‌ పండుగైనప్పటికీ కరోనా బాధితుడిని అత్యవసరంగా హైదరాబాద్‌ తరలించాలన్న సమాచారంతో వచ్చిన తనను నిలిపివేయటం బాధాకరమని అంబులెన్స్‌ డ్రైవర్‌ పాషా అన్నారు. పరిస్థితి విషమించి రోగి మృతి చెందితే ఏ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. 




‘తూర్పు’లో సరిహద్దులు మూసివేత 

చింతూరు, మే 14: కొవిడ్‌ ప్రభంజనంతో రాష్ట్ర సరిహద్దులైన ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా శివారు గ్రామాల్లో శుక్రవారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసర గూడ్సు మినహా ఇతర వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి తూర్పు గోదావరి జిల్లా చింతూరు మీదుగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయి. తెలంగాణ నుంచి ఇదే రహదారి మీదుగా ఛత్తీ్‌సగఢ్‌లోని జగదల్‌పూర్‌, రాయ్‌పూర్‌, దంతెవాడ, భిలాయ్‌లకు, ఒడిశాలోని మల్కన్‌గిరి, జైపూర్‌, భువనేశ్వర్‌లకు నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఆ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేలాదిగా చింతూరు మీదుగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రకు ఉపాధి కోసం వలస వెళ్తారు. దీంతో ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు కొవిడ్‌ నియంత్రణ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఆయా చెక్‌పోస్టుల వద్ద సచివాలయ సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ వాహనాన్నీ నిలువరించి అత్యవసరమైతే తప్ప అనుమతి నిరాకరించాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2021-05-15T09:54:38+05:30 IST