అటకెక్కిన అంబులెన్స్‌ హామీ

ABN , First Publish Date - 2021-05-17T05:04:35+05:30 IST

కంభం 30 పడకల వైద్యశాలలో కొత్త అంబులెన్స్‌ ఏర్పాటు హామీ అటకెక్కింది. పదేళ్ల నుంచి అదే దుస్థితి కొనసాగు తోంది. అంబులెన్స్‌ లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వసతి లేక రోగులు అనేక వ్యయప్రయాసలు పడు తున్నారు.

అటకెక్కిన అంబులెన్స్‌ హామీ
చిల్లచెట్లలో మూలనపడి ఉన్న అంబులెన్సులు


కంభం ప్రభుత్వ వైద్యశాలలో పదేళ్ల నుంచి ఇదే దుస్థితి

ఇబ్బందులు పడుతున్న రోగులు

మెరుగైన వైద్యం కోసం తరలింపులో జాప్యంతో కొందరి ప్రాణాలు హరీ

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ లెక్కలేని తనమా!

ఏమాత్రం పట్టించుకోని పాలకులు


కంభం, మే 16 : కంభం 30 పడకల వైద్యశాలలో కొత్త అంబులెన్స్‌ ఏర్పాటు హామీ అటకెక్కింది. పదేళ్ల నుంచి అదే దుస్థితి కొనసాగు తోంది. అంబులెన్స్‌ లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వసతి లేక రోగులు అనేక వ్యయప్రయాసలు పడు తున్నారు. ప్రస్తుత విపత్కర కరోనా పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయ లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆరోగ్య రక్షణపై శ్రద్ధ లేదని విమర్శిస్తున్నారు.

స్థానిక ప్రభుత్వ ఆసుప్రతిలో అంబులెన్సులు పదేళ్ల కిందట ప్రమాదానికి గురికావడంతో మూలన పడవేశారు. అప్పటి నుంచి కొత్త అంబులెన్స్‌ ఏరాటు కాలేదు. ఆసుపత్రిలోని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలించడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. ముఖ్యంగా అర్థవీడు, బేస్తవారపేట మండలాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు, ఒంగోలు, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కంభం వైద్యశాలను సందర్శించేందుకు వచ్చే జిల్లా వైద్యాధికారులు నూతన అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నెరవేరలేదు.  గతంలో అప్పటి డీఎంహెచ్‌ఒ, జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు కంభం వైద్యశాలకు తప్పనిసరిగా అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకాలేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అధికారులు స్పందించి మూడు మండలాలకు ఆధారమైన కంభం వైద్యశాలకు నూతన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T05:04:35+05:30 IST