అందరూ ఒక్కటై దోపిడీ

ABN , First Publish Date - 2021-06-18T05:53:33+05:30 IST

ఒకవైపు కరోనా.. మరోవైపు సీజనల్‌ రోగాలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రైవేటు అంబులెన్స్‌ల నిర్వాహకులు మాత్రం దోపిడీకి తెగబడుతున్నారు. అందరూ ఒక్కటై వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు రింగ్‌గా మారి విచ్చలవిడిగా దండుకుంటున్నారు. ఛార్జీలపై జిల్లా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అడిగినంత ఇవ్వకపోతే ఒక్క అంబులెన్స్‌ కూడా కదలడంలేదు. ఐదుగురు వ్యక్తులు పదిహేను అంబులెన్సులను నడుపుతూ దోచుకుంటున్నారు.

అందరూ ఒక్కటై దోపిడీ
సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో నిలిపిన ప్రైవేట్‌ అంబులెన్స్‌లు

అంబులెన్సు యజమానుల దురాశ

నిబంధనలకు విరుద్ధంగా రూ.వేలల్లో వసూళ్లు

జిల్లా ఆస్పత్రిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌లు, ఫ్రీజర్ల దందా

కరెంట్‌ బిల్లు ఆస్పత్రికి.. లాభం నిర్వాహకులకు

ఆస్పత్రివర్గాలకు వాటా!


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 17 : ఒకవైపు కరోనా.. మరోవైపు సీజనల్‌ రోగాలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రైవేటు అంబులెన్స్‌ల నిర్వాహకులు మాత్రం దోపిడీకి తెగబడుతున్నారు. అందరూ ఒక్కటై వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు రింగ్‌గా మారి విచ్చలవిడిగా దండుకుంటున్నారు. ఛార్జీలపై జిల్లా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అడిగినంత ఇవ్వకపోతే ఒక్క అంబులెన్స్‌ కూడా కదలడంలేదు. ఐదుగురు వ్యక్తులు పదిహేను అంబులెన్సులను నడుపుతూ దోచుకుంటున్నారు.


ఐదుగురు వ్యక్తులు.. 15 అంబులెన్స్‌లు

సంగారెడ్డిలో ఐదుగురు వ్యక్తులు 15 అంబులెన్స్‌లను నడుపుతున్నారు. వీరందరూ రింగ్‌గా ఏర్పడి ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. వారు తమ అంబులెన్సుల్లో కొన్నింటిని జిల్లా ఆస్పత్రి గేటు ఎదుట, మరికొన్ని ఆస్పత్రి ఆవరణలోనే నిలిపి ఉంచుతున్నారు. జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగం వద్ద అంబులెన్స్‌లను నిలిపి ఉంచి సీరియస్‌గా ఉన్న పేషంట్లను హైదరాబాద్‌ లేదా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. ఇలా రోజుకో అంబులెన్స్‌ నిర్వాహకుడి వంతుగా ఒప్పదం చేసుకుని, ఆరోజు ఎన్ని కేసులు వచ్చినా సదరు నిర్వాహకుడే తన అంబులెన్స్‌ల్లో తరలిస్తుంటాడు. ఈ తతంగమంతా ఆస్పత్రివర్గాల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం.


ధరలు నిర్ణయించిన జిల్లా యంత్రాంగం

ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వహణకు సంబంఽధించి జిల్లా యంత్రాంగం ధరలను నిర్ణయించింది. కొవిడ్‌ లేదా ఇతర అనారోగ్యంతో బాధపడే పేషెంట్లను సంగారెడ్డి నుంచి పెద్దాస్పత్రులకు తరలించే సమయంలో తాము నిర్ణయించిన చార్జీలను తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్వాహకులను ఆదేశించింది. మారుతివ్యాన్‌ అంబులెన్స్‌ ఒకరోజుకు వెయ్యి రూపాయలు అద్దె, డ్రైవర్‌ బత్తా రూ.500, శానిటైజేషన్‌, పీపీఈ కిట్‌కు రూ.700, కిలోమీటర్‌ దూరానికి రూ.8 చొప్పున తీసుకోవాలని జిల్లా యంత్రాంగం తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ పెడితే గంటకు రూ.200 చొప్పున తీసుకోవాలని నిర్ధేశించింది. అలాగే, కొవిడ్‌తో మృతిచెందిన వారిని తరలించేందుకు రూ.4,500తో పాటు కిలోమీటర్‌కు రూ.8ల చొప్పున తీసుకోవాలని ఆదేశించింది.

 

కొవిడ్‌ పేషెంట్లను హైదరాబాద్‌ తరలించేందుకు రూ.15 వేలు

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు పేషెంట్లను తరలించేందుకు ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. కొవిడ్‌ పేషెంట్లను హైదరాబాద్‌ తరలించేందుకు రూ. 15 వేలు తీసుకుంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని తరలించేందుకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇస్తేనే అంబులెన్స్‌లను పంపిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆస్పత్రుల్లో ఎవరైనా మృతిచెందితే అంబులెన్స్‌ నిర్వాహకులు అడిగినంత చెల్లించక తప్పడంలేదు. దవాఖానాల్లో మృతదేహాలను ఉంచకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు అడిగినంత చెల్లించక తప్పడంలేదు.


జిల్లా ఆస్పత్రిలో ఆరు ఉచిత అంబులెన్స్‌లు

జిల్లా ఆస్పత్రిలో ఐదు ప్రభుత్వ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా లయన్స్‌క్లబ్‌ ఒక అంబులెన్స్‌ను ఆస్పత్రికి అందజేసింది. వీటిలో పేషెంట్లను ఉచితంగా తరలిస్తారు. కేవలం ఇందన చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఉచిత అంబులెన్స్‌లను ఉపయోగించుకోవాలంటే రెండుమూడు గంటలు అలస్యమవుతుంది. ఆస్పత్రి వర్గాల నుంచి అనుమతి తీసుకుని, డీజిల్‌ పోయించుకున్న తర్వాతనే అంబులెన్స్‌ కదులుతుంది. దీనికితోడు ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు ఉచిత అంబులెన్స్‌లకు డ్రైవర్లు అందుబాటులో ఉండకుండా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు ఎక్కువైనా వెంటనే కదిలే ప్రైవేట్‌ అంబులెన్స్‌కోసం బాధితులు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు దండుకుంటున్నారు.


జిల్లా ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్‌ అంబులెన్స్‌లు

ప్రైవేట్‌ అంబులెన్స్‌లను నిబంధనలకు విరుద్ధంగా సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ఆవరణలోనే దర్జాగా నిలుప ుతున్నారు. అయినా ఆస్పత్రి వర్గాలు నోరు మెదపడం లేదు. నిబంధనలకు విరుద్ధమైనా వారికీ వాటా అందుతుండటంతోనే మౌనంగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ఆస్పత్రి మార్చురీలో ప్రైవేట్‌ ఫ్రీజర్లు

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి మార్చరీలో ప్రైవేట్‌ ఫ్రీజర్లు పెడుతున్నారు. వీటిలో ఉంచడానికి ఒక్కో మృతదేహానికి రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. రోజంతా ఫ్రీజర్‌లో ఉంచినా అందుకు ఆస్పత్రి కరెంట్‌నే వాడుతున్నారు. కానీ ఫ్రీజర్ల నిర్వాహకులు ఆస్పత్రికి కరెంట్‌ బిల్లు కూడా ఇవ్వడంలేదు. అయినా ఆస్పత్రి వర్గాలు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటం విడ్డూరం.

Updated Date - 2021-06-18T05:53:33+05:30 IST