ప్రతిష్టాత్మకంగా మహానాడు

ABN , First Publish Date - 2022-05-18T06:21:20+05:30 IST

తెలుగుదేశం పార్టీశ్రేణులు పండుగలా జరుపుకొనే మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

ప్రతిష్టాత్మకంగా మహానాడు
మహానాడు నిర్వహణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న యనమల

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల 

ఒంగోలులో ఎంపిక చేసిన స్థల పరిశీలన 

 ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చ

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 17 : తెలుగుదేశం పార్టీశ్రేణులు పండుగలా జరుపుకొనే మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద మహానాడు నిర్వహించేందుకు పార్టీ సమాయాత్తమైంది. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన స్థలాన్ని యనమల మంగళవారం పరిశీలించారు. సభావేదిక, హాజరయ్యే వారి కోసం ప్రాంగణం, ఇతరత్రా అంశాలపై జిల్లా నాయకులతో చర్చించారు. అనంతరం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో రెండురోజులపాటు మహానాడు కార్యక్రమం వైభవంగా నిర్వహించడమే కాకుండా ప్రజాసమస్యలే అజెండాగా చర్చించబోతున్నామని చెప్పారు. జగన్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. రాష్ట్రం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న దన్నారు. ప్రస్తుతం జగన్‌ పాలనపై ప్రజలు తిరగబడుతున్నార న్నారు. గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరం గా విఫలమైందన్నారు. ఇసుక, గనుల మాఫియాతో ప్రజల ను దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ దుష్టపాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. విచ్చలవిడిగా దోచేసే కార్యక్రమం రాష్ట్రంలో సాగుతోందని ధ్వజమెత్తారు. తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్‌ దోచుకున్న సొమ్మును రాష్ట్ర ట్రెజరీలో జమచేయాలని యనమల డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వ పథకాల ప్రకటన పేరుతో సాక్షి మీడియాకు కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును సొంత మీడియాకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అతనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర నాయకులు దామచర్ల సత్య, వైవీ.సుబ్బారావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, ముత్తన శ్రీనివాసరావు, ఆర్ల వెంకటరత్నం, టి.అనంతమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-18T06:21:20+05:30 IST