పదవీకాంక్ష చిచ్చు

ABN , First Publish Date - 2022-06-13T06:04:11+05:30 IST

పదవీకాంక్ష చిచ్చు

పదవీకాంక్ష చిచ్చు
ఎమ్మెల్యేతో సమావేశమైన కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు


  • వికారాబాద్‌ మునిసిపాలిటీలో రాజుకున్న రాజకీయం 
  • మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి నుంచి దిగిపోవాల్సిందే.. 
  • అధికార పార్టీ కౌన్సిలర్ల ఆల్టిమేట్టం 
  • ఎమ్మెల్యేతో  కౌన్సిలర్ల సమావేశం 
  • పోస్టు నుంచి దిగేది లేదన్న చైర్‌పర్సన్‌ మంజుల 

వికారాబాద్‌, జూన్‌ 12: వికారాబాద్‌ మునిసిపల్‌ పాలకవర్గంలో రాజుకున్న రాజకీయం చిచ్చురేపుతోంది. తాము అనుకున్న వారిని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు కట్టబెట్టేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు అందరూ ఒకవర్గంగా ఏర్పాటై తమ పార్టీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లతో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పదవుల్లో కొనసాగుతున్న వారిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశ పెట్టి పదవీచ్యుతులను చేసేందుకు ప్రయత్నించడం సహజమే కానీ వికారాబాద్‌ మునిసిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే అధికార పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను పదవుల్లో నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులా రమేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగంలను వారి పదవుల్లో నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతూ వారిద్దరూ మినహా మిగతా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అందరూ ఆదివారం ఎమ్మెల్యే వద్దకు వెళ్లి  రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు. పాలకవర్గం ఏర్పడిన సమయంలో ప్రస్తుత చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ల రెండున్నరేళ్ల వరకు పదవుల్లో కొనసాగించి, ఆ తర్వాతవేరే వారికి అవకాశం కల్పించేలా ఒప్పందపత్రాన్ని రాసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ ఒప్పందంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. .

పాలకవర్గం ఏర్పడిన తొలినాటి నుంచే విభేదాలు

మునిసిపల్‌ పాలకవర్గం ఏర్పడిన కొన్ని రోజులకే పాలకవర్గంలోని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తమ పార్టీకే చెందిన చైర్‌పర్సన్‌ను ఒంటరిగా చేసే ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా ఓ సాధారణ కౌన్సిల్‌ సమావేశానికి కౌన్సిలర్లు అందరూ గైర్హాజరై చైర్‌పర్సన్‌కు షాక్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన బడ్జెట్‌ సమావేశానికి సైతం టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ విషయమై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. 

ఒప్పందం ప్రకారమే ..

ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల పదవీ కాలం పూర్తి కావచ్చినందున చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తప్పుకొని వెంటనే కొత్తవారికి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానించి ఆదివారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను  పదవుల నుంచి తప్పించాలని చేసిన తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మీడియాకు విడుదల చేయడం గమనార్హం. 

అధికార పార్టీ కౌన్సిలర్లలో కొరవడిన సయోధ్య

రాష్ట్రంలో, మునిసిపాలిటీలో అధికార పార్టీ వారే పగ్గాలు చేపట్టడంతో ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు భావించగా వారి ఆశలు అడియాశల య్యాయి. ఫలితంగా వికారాబాద్‌పట్టణాభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 

వినకపోతే దూరం?

చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పార్టీ పెద్దల మాటవినని పక్షంలో వారిద్దరిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోఆరు నెలల పాటు ఆవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో వారుమొండిగా వ్యవహరిస్తే సమావేశాలు, అభివృద్ధిపనులకు కౌన్సిలర్లు దూరంగా ఉండాలని భావిసున్నారు. ఏకార్యక్రమాలకూ వారిని ఆహ్వానించకుండా నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే మునిసిపల్‌ సాధారణ సమావేశాల్లో ఎజెండా ఆమోదం పొందే అవకాశం లేనట్లే. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేక తగదాలకు పోయి పట్టణాభివృద్ధిని కుంటు పడేలా చేస్తారా అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు పాలకవర్గంపై అవిశ్వాసం ప్రకటిస్తారు. కానీ వికారాబాద్‌ మునిసిపాలిటీలో సొంత పార్టీ నాయకులే చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర ్సన్‌లను పదవుల నుంచి దించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.  విబేధాలు ఇలాగే కొనసాగితే అభివృద్ధి కుంటు పడుతుంది. 

                                                    - ఎ.సుధాకర్‌రెడ్డి,  కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

అసలు ఒప్పందం ఎక్కడ చేసుకున్నాం

 నేను ఏం అవినీతి చేశానో మాపార్టీ కౌన్సిలర్లే  చెప్పాలి. పదవి వరకు వచ్చేసరికి ఒప్పందం జరిగిందని అంటున్నారు. అసలు ఒప్పందం ఎక్కడ జరిగిందో చెప్పాలి. వాట్సాప్‌లలో పదవి నుంచిదిగాలని పోస్టులు పెడుతున్నారు. ఇదేమి అరాచకం. కరోనా సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్లకు వెళ్లి ప్రజలకు సేవలందించా. ప్రతి వార్డుకు సమానంగా నిధులు కేటాయించా. 

- చిగుళ్లపల్లి మంజులరమేష్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ 

Updated Date - 2022-06-13T06:04:11+05:30 IST