ఆశయం ఘనం... నిర్వహణ అధ్వానం

ABN , First Publish Date - 2021-08-09T16:33:39+05:30 IST

ఎంతగొప్ప ఆశయమైనా నిర్వహణలో..

ఆశయం ఘనం... నిర్వహణ అధ్వానం

మాయమైపోతున్న మినీ డస్ట్‌బిన్‌లు

రోడ్డు పక్కన అట్టహాసంగా ప్రారంభం

పాదచారులు, వాహన చోదకులు రోడ్లపై చెత్తపడేయకుండా ఏర్పాటు

దొంగలపరమైన పలు స్టీల్‌ డ్రమ్ములు

నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్న స్టాండ్‌లు


మర్రిపాలెం/జ్ఞానాపురం: ఎంతగొప్ప ఆశయమైనా నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిస్తే లక్ష్యం హుష్‌కాకి అవుతుంది. లక్షల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవుతుంది. జీవీ ఎంసీ కొన్నాళ్ల క్రితం రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన మినీ డస్ట్‌ బిన్‌లు (వేలాడేవి) దుస్థితి చూస్తే ఇది ఎంత నిజమో ఇట్టే అర్థమవుతుంది. స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ స్టీల్‌/ప్లాస్టిక్‌ డ్రమ్ములు చాలావరకు దొంగలపాలవ్వగా, ఖాళీ స్టాండ్‌లు అధికారుల పర్యవేక్షణలోపాన్ని ఎత్తిచూపుతు న్నాయి. పాదచారులు, వాహన చోదకులు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా  నగరలోని అన్ని ప్రధాన రహదారుల్లో వీటిని ఏర్పాటు చేశారు. రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌ లను ఆనుకుని ఇనుప స్టాండ్‌లు ఏర్పాటుచేసి వాటికి రెండేసి చొప్పున డ్రమ్ములు వేలాడదీశారు. ఇందుకోసం లక్షలు అప్పట్లో ఖర్చు చేశారు. ఆ తర్వాతే వాటిని గాలికి వదిలేశారు. 


అవి వినియోగిస్తున్నారా,అందులో చెత్త క్రమంతప్ప కుండా తరలిస్తున్నారా, డస్ట్‌బిన్‌లు సక్రమంగా వినియోగిస్తున్నారా అన్న విషయాలు పట్టించుకున్న వారు లేరు. పాడవుతున్నా పట్టించుకున్న వారు లేకపోవడంతో స్టీల్‌ డ్రమ్ములు చాలా వరకు దొంగలపాలయ్యాయి. ప్లాస్టిక్‌ డ్రమ్ములు కూడా కొం దరు ఎత్తుకుపోయి సొంత అవసరాలకు వాడుకుంటూ ఉం డగా, మరికొన్ని విరిగి వేలాడుతున్నాయి. చాలాచోట్ల  డ్రమ్ము లు మాయమై స్టాండ్‌లు ఖాళీగా కనిపిస్తుండగా, మరి కొన్ని చోట్ల విరిగి వాలిపోయిన స్టాండ్‌లు కని పిస్తున్నాయి.  ఉదాహరణకు...


104 ఏరియాలోని మర్రిపాలెం కేంద్రీయ విద్యాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ డ్రమ్ములను దొంగలు ఎత్తుకు పోయారు. ప్రస్తుతం వీటి కప్పులు, ఖాళీ స్టాండ్‌ ఇక్కడ దర్శనమిస్తోంది.


104 ప్రాంతంలో ఉన్న ఓ సినిమా థియేటర్‌ సమీపంలో  మినీ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేశారు. వీటిని కొందరు ఆకతా యిలు కాల్చి వేయడంతో దెబ్బతిన్నాయి.


మర్రిపాలెం నుంచి వెళ్లే రోడ్డులో ఎస్టేట్‌ బస్టాప్‌ ఉంది. ఈ బస్టాప్‌ వెనుక ఉన్న డ్రమ్ములు కూడా కనిపించడం లేదు.


ఎన్‌ఏడీ నుంచి మర్రిపాలెం వైపు వచ్చే రోడ్డులో కరాస బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన డస్ట్‌ బిన్‌లు దొంగలపాలయ్యాయి. దీంతో ఖాళీ స్టాండ్‌లు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.


జ్ఞానాపురం జేఎన్‌ఎన్‌ఆర్‌ఎం కాలనీ నుంచి కాన్వెంట్‌ కూడలి వరకు పలు చోట్ల ఫుట్‌పాత్‌లను ఆనుకుని కుండీలు ఏర్పాటు చేశారు.


జూబ్లీస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్‌ బేస్‌ దెబ్బతిని వాలిపోవడంతో ప్రస్తుతం రెండు డస్ట్‌బిన్‌లు ఫుట్‌పాత్‌పై పడివున్నాయి.


ఐదో జోన్‌ కార్యాలయం సమీపంలోని ఓ కుండీ విరిగి పోయి మట్టిదిబ్బల మధ్య పడివుంది. అధికారులు ఈ రోడ్డు లోనే తిరుగుతున్నా దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.


జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన  స్లాండ్‌లో స్టీల్‌ డ్రమ్ములు మాయమైపోగా ప్రస్తుతం ఇక్కడ ఖాళీ స్టాండ్‌ దర్శనమిస్తోంది.


ఈ విధంగా అప్పట్లో ఏర్పాటు చేసిన మినీ డస్ట్‌బిన్‌లలో 90 శాతం నిరుపయోగంగా మారడమో, దొంగలపాలవ్వడమో జరిగినా జీవీఎంసీ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటుకాకముందు వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీవీఎంసీకి పాలకవర్గం ఏర్పాటైంది. కనీసం ఇప్పుడైనా వీటిపై దృష్టిపెడతారో, లేదో చూడాలి.

Updated Date - 2021-08-09T16:33:39+05:30 IST