సందిగ్ధం..

ABN , First Publish Date - 2022-05-15T06:49:50+05:30 IST

కరువు జిల్లాలో విత్తన వేరుశనగ సేకరణ గందరగోళంగా మారింది. ఈ సారి ఆలస్యంగా సేకరణ ప్రారంభించడమే ఇందుకు కారణమైంది

సందిగ్ధం..

విత్తన సేకరణలో జాప్యం

జిల్లాకు 1.10 లక్షల క్వింటాళ్ల వేరుశనగ 

కేటాయింపు ఇప్పటి దాకా ఆర్బీకేలకు  10 వేల క్వింటాళ్లే సరఫరా 

ఆలస్యంగా సేకరణ ప్రారంభించడమే కారణం 

సమీపిస్తున్న ఖరీఫ్‌ సీజన 

అనంతపురం అర్బన, మే 14: కరువు జిల్లాలో విత్తన వేరుశనగ సేకరణ గందరగోళంగా మారింది. ఈ సారి ఆలస్యంగా సేకరణ ప్రారంభించడమే  ఇందుకు కారణమైంది. గతేడాది జిల్లాలో రబీ సీజనలో బోరు బావుల కింద వేరుశనగ సాగు చేసిన రైతుల నుంచి విత్తన కాయలు కొనుగోలు చేసి, తిరిగి ఖరీ్‌ఫలో సబ్సిడీతో పంపిణీ చేశారు. ఏపీసీడ్స్‌ ఆధ్వర్యంలో గతేడాది మార్చి నెలలోనే విత్తన సేకరణ మొదలుపెట్టారు. ఈ సారి విత్తన సరఫరాదారుల నుంచి విత్తన కాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టెండర్లు ఖరారు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఈ పరిస్థితుల్లో ఈనెల మొదటి వారం నుంచి ఆలస్యంగా విత్తన సేకరణ మొదలు పెట్టారు. దీంతో విత్తన పంపిణీపై దీని ప్రభావం పడే  అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 


సమీపిస్తున్న ఖరీఫ్‌ సీజన 

ఖరీఫ్‌ సీజన సమీపిస్తోంది. జూన నుంచి సీజన ఆరంభం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ సారి కాస్త ముందుగానే పలకరించే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ  విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అయినప్పటికీ సకాలంలో విత్తన వేరుశనగ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విత్తన సేకరణలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో ఈ సారి పరిస్థితి అధ్వానంగా మారింది. గత కొన్నేళ్లుగా జిల్లాకు కేటాయించే విత్తన మోతాదులో సగం శాతం జిల్లాలో, మిగతా మోతాదును ఇతర జిల్లాల  నుంచి తెప్పించేవారు. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసే విత్తన కాయలు నాణ్యంగా ఉండటం లేదన్న కారణంతో  జిల్లాలో రబీ సీజనలో పండించిన విత్తనాన్నే సేకరించాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ సహకారంతో ఏపీసీడ్స్‌ సంస్థ రైతుల నుంచి విత్తన కాయలు కొనుగోలు చేస్తూ వస్తోంది. ఈ  ఏడాది విత్తన సేకరణ చేసేందుకు తగిన డబ్బుతోపాటు సిబ్బంది లేరన్న కారణాన్ని చూపుతూ చేతులెత్తేశారు. ఈ ఏడాది నుంచి తిరిగి పాత పద్ధతిలో విత్తన సరఫరాదారుల నుంచే విత్తన కాయలు సేకరిస్తున్నారు. విత్తన సరఫరాదారులతో టెండర్లు ఆలస్యంగా నిర్వహించడంతో ఈనెల మొదటి వారం నుంచి విత్తన సేకరణను ప్రారంభించారు. 


ఇప్పటి దాకా 10 వేల క్వింటాళ్లే సరఫరా 

జిల్లాకు ఈ ఏడాది 1.10 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. ఆలస్యంగా విత్తన  సేకరణ మొదలు పెట్టడంతో ఇప్పటి దాకా కేవలం 10వేల క్వింటాళ్లను పలు ఆర్బీకేలకు సరఫరా చేశారు. జిల్లాలో ఐదుగురు విత్తన సరఫరాదారులకు విత్తన సేకరణ బాధ్యతలు అప్పగించారు. మరో వారం రోజుల్లోగా విత్తన పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు ఆదేశించారు. విత్తన పంపిణీ మొదలు పెట్టాలంటే కనీసం 60 శాతం విత్తన కాయలు సిద్ధంగా ఉంచుకుంటేనే పంపిణీ సవ్యంగా జరిగే పరిస్థితి ఉంది. జిల్లాలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొనడంతో విత్తన పంపిణీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం విత్తన సేకరణను ఎంత వేగవంతం చేసినా అనుకున్న సమయానికి విత్తన సేకరణ పూర్తి చేయడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈపరిస్థితుల్లో విత్తన పంపిణీ ప్రారంభం మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన ప్రారంభమైన మాసంలోనే వేరుశనగ సాగు చేసే అలవాటు ఉంది. ఈ పరిస్థితుల్లో విత్తన సేకరణ పై మరింత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే పంపిణీ సవ్యంగా జరిగే అవకాశం ఉంది. లేదంటే కరువు రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తప్పవన్న వాదనలు లేకపోలేదు. ఇప్పటికైనా వ్యవసాయ యంత్రాంగం ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే. 


విత్తన సేకరణను వేగవంతం చేస్తాం 

విత్తన వేరుశనగ సేకరణను మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. ఏపీసీడ్స్‌ ఆధ్వర్యంలో విత్తన సేకరణ జరిగినా వ్యవసాయ అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్దేశించిన తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే విత్తన పంపిణీ చేపడతాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. 

- జిల్లా వ్యవసాయ అధికారి, చంద్రనాయక్‌ 


Updated Date - 2022-05-15T06:49:50+05:30 IST