కన్నీటి కష్టాలు

ABN , First Publish Date - 2020-10-21T10:03:38+05:30 IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మండల పరిధిలోని సూర్యవంశీ గార్డెన్‌ సిటీలో ఉంటున్న సోమ శంకరయ్య కట్టుబట్టలతో మిగిలారు.

కన్నీటి కష్టాలు

నగరవాసులను ముంచేసిన వరద

కట్టుబట్టలతో మిగిలిన వేల కుటుంబాలు

ఒక్కో కుటుంబానికి రూ.లక్ష -2.5 లక్షల నష్టం

బాధితులుగా 3 నుంచి 4 లక్షల కుటుంబాలు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మండల పరిధిలోని సూర్యవంశీ గార్డెన్‌ సిటీలో ఉంటున్న సోమ శంకరయ్య కట్టుబట్టలతో మిగిలారు. కప్పల చెరువు, కుమ్మరికుంట చెరువుల్లోంచి నీరు బాతుల చెరువులోకి దూసుకొచ్చింది. అది కాస్తా తెగడంతో కింద ఉన్న కాలనీల్లోకి ఒక్కసారిగా వరద వచ్చేసింది. చూస్తున్నంతలోనే నిలువెత్తు నీళ్లు వచ్చాయి. మూడు క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. ఫ్రిజ్‌ మునిగిపోయింది. వంట సామాను పాడైపోయింది. వాషింగ్‌ మెషీన్‌ పూర్తిగా మునిగిపోయింది. ఇంకా విషాదం ఏమిటంటే.. వాషింగ్‌ మెషీన్‌ను కొత్తగా తీసుకొచ్చారు. వారం కూడా కాలేదు. అప్పుడే పాడైపోయింది. అప్రోచ్‌ గోడ కూలిపోయింది. మొత్తంమీద లక్ష రూపాయలకుపైగా నష్టం జరిగిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, వరద తగ్గడంతో శుక్రవారం శుభ్రం చేసుకున్నారు. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయాన్నే మళ్లీ వర్షం.. మళ్లీ వరద. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.


సరూర్‌నగర్‌ మండలం కోదండరాం కాలనీలో వెంకటేశ్‌ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆయన ఇంట్లోకి ఒక్కసారిగా భారీ వరద ముంచుకొచ్చింది. గోడకు తగిలించిన 45 ఇంచుల టీవీ, ల్యాప్‌టాప్‌, వాషింగ్‌ మెషిన్‌, డైనింగ్‌ టేబుల్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌తోపాటు బీరువాలోని దుస్తులు, నగలు, పిల్లల సర్టిఫికెట్లు అన్నీ తడిసి ముద్దయ్యాయి. బియ్యం బస్తాలు, వంట సామగ్రి పూర్తిగా నీటిలో మునగడంతోపాటు వరద తగ్గకపోవడంతో ఇంటికి తాళం వేసి   బంధువుల ఇంటికి వెళ్లారు. మొత్తంగా కృష్ణ కుటుంబానికి వర్షం కారణంగా రూ.2.50 లక్షల నష్టం వాటిల్లింది.


హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరదతో నగరవాసులు ఎంతగా నష్టపోయారో చెప్పేందుకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే! కొంతమంది సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలితే.. మరికొందరు విలువైన వస్తువులను మాత్రం కాపాడుకోగలిగారు. ఇంకొందరికి కార్లు కొట్టుకుపోతే, మరికొందరు బైక్‌లను కోల్పోయారు. కొందరు బీరువాల్లో దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలు కూడా జలార్పణం అయిపోయాయి. ఇంకొందరికి వ్యాపార, వాణిజ్య దుకాణాలు నీట మునిగాయి. వెరసి, నగరం నలుమూలలా వేలాదిమంది లక్షల్లో నష్టపోయారు. వెల్లువై వచ్చిన వరద వారందరినీ నిలువు దోపిడి చేసేసింది! వరదకు తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలు మూడు నుంచి నాలుగు లక్షల వరకూ ఉంటాయని ప్రభుత్వమే అంచనా వేస్తోంది. వీటిలో ఓ కుటుంబం రూ.50 వేల వరకూ నష్టపోతే.. ఇంకో కుటుంబం రూ.5 లక్షల వరకూ కోల్పోయింది. ఒక్కో కుటుంబానికి సగటున లక్ష రూపాయల వరకూ నష్టం జరిగిందని అంచనా వేసినా.. నగరవాసులకు జరిగిన నష్టం వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇంటింటి సర్వే చేస్తే బాధితుల సంఖ్య పూర్తి స్థాయిలో స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది.


వ్యాపార, వాణిజ్య వర్గాలకు భారీ నష్టం

ఎన్నడూ లేనంత వాన.. ఎప్పుడూ చూడని వరద. కాలనీలను ముంచెత్తుతూ.. ఇళ్లలోకి చేరిన నీరు. పాడైపోయిన గృహోపకరణాలు, ఎలక్రిక్టల్‌ వస్తువులు, దుస్తులు, వంట సామగ్రి. వరద ఉధృతికి కొట్టుకుపోయిన బైక్‌లు, కార్లు. ఇలా.. నగరంలో వందలాది కాలనీలను ముంచెత్తిన వర్షం.. వేలాది కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కష్టపడి కొనుక్కున్న వస్తువులన్నీ బురద నీటితో పాడైపోయాయి. 13వ తేదీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలో 1500కుపైగా కాలనీలు నీటమునిగాయి. ఆసి్‌ఫనగర్‌, అల్మా్‌సగూడ, ఫీర్జాదిగూడ, బాలాపూర్‌ చౌరస్తాలోని ఎంఎల్‌ఆర్‌ కాలనీ, రామంతాపూర్‌, ఆసి్‌ఫనగర్‌, బండ్లగూడ, టోలీచౌకి, నదీమ్‌ కాలనీ, మేడిపల్లి, బహదూర్‌పురా, హిమాయత్‌నగర్‌, గోల్కొండ, దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీ పరిసరాలు, పెద్ద అంబర్‌పేట మండలంలోని బంజారా కాలనీ, బ్యాంకు కాలనీ, లేబర్‌ బస్తీ, సూర్యవంశీ గార్డెన్‌ సిటీ తదితర ప్రాంతాలు జల విపత్తును ఎదుర్కొన్నాయి.


వరద ఉధృతి వచ్చి కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ల పరిసరాలు, ఇళ్లలో నడుము లోతు వరకు వరదనీరు చేరడంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, ల్యాప్‌టా్‌పలు వంటి ఎలక్రికల్‌ వస్తువులు తడిసి ముద్దయ్యాయి. డైనింగ్‌ టేబుళ్లు, డ్రెస్సింగ్‌ టేబుళ్లు నీటిలో నానిపోయాయి. కష్టజీవులైతే తినడానికి తిండిలేక ఇబ్బందులు పడ్డారు.  ఇంతటి వరద విపత్తును తామెన్నడూ చూడలేదని టోలీచౌకికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. చాలామందికి మళ్లీ మొదటి నుంచీ జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యాపార, వాణిజ్య వర్గాలకు జరిగిన నష్టం కోలుకోలేనిదిగా ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌ జాతీయ రహదారిపైకి చేరిన వరదతో అక్కడి షాపుల్లోకి నీళ్లు వచ్చాయి. ఒక్కో షాపులోనూ రెండు నుంచి పది లక్షల వరకూ ఉంచిన సరుకు పాడైపోయింది. పాతబస్తీలో వ్యాపార వర్గాలకు జరిగిన నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా. 1500 వరకూ కాలనీల్లో జరిగిన వాణిజ్య, వ్యాపార నష్టం ఊహాతీతంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2020-10-21T10:03:38+05:30 IST