అంబేడ్కర్‌ మహా కృషి

ABN , First Publish Date - 2020-11-26T05:45:15+05:30 IST

భారతదేశంలో పరాయి పాలన అంతమయింది. దేశం స్వాతంత్రం పొందింది. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్‌ పరిపాలనలో మగ్గిన భరతమాతకు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే...

అంబేడ్కర్‌ మహా కృషి

భారతదేశంలో పరాయి పాలన అంతమయింది. దేశం స్వాతంత్రం పొందింది. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్‌ పరిపాలనలో మగ్గిన భరతమాతకు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశం లభించింది. మనదైన పరిపాలన కోసం ఒక రాజ్యాంగం అవసరమైయింది. సుపరిపాలనకు అనుగుణమైన అధికరణాలను ఆ రాజ్యాంగంలో పొందు పరచాలని ప్రజలందరూ ఆకాంక్షించారు. దానిననుసరించి 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటయింది. అంటే స్వాతంత్ర్యం వచ్చిన 15 రోజులకు ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. దీనిలో ఏడుగురు సభ్యులున్నారు. వీరిలో డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ముఖ్యులు. 1919 నుంచి 1946 వరకూ వివిధ స్థాయిలో రాజ్యాంగ సంబంధ చర్చలో చురుకుగా పాల్గొన్న అతికొద్ది మంది నేతల్లో అంబేడ్కర్‌ ఒకరు. రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఎంపికైయ్యారు. ఆ కమిటీలోని ఇతర సభ్యులు: అల్లాడి కుప్పుస్వామి అయ్యర్‌, గోపాల స్వామి అయ్యంగార్‌, కెయం మున్షీ, సయ్యద్‌ మహమ్మద్‌ సాదుల్లా, బి యల్‌ మిశ్రా, డిపి సేత్నాలు. వీరిలో ఉన్నత చదువులు చదివినవారు. ఎక్కువ దేశాలలో పర్యటించినవారు, పలు గ్రంథాలు రచించినవారు, పలు దేశాల చరిత్రలను ఆకళింపచేసుకున్నవారు, చురుకుగా చాకచక్యంగా వ్యవహరించేవారు, దూరదృష్టితో యోచించేవారు డా. బిఆర్‌ అంబేడ్కర్‌ మాత్రమే. మిగిలిన వారిలో ఈ అర్హతలు సమగ్రంగా లేవు. 


తన మేధస్సును రంగరించి ఎంతో సమయాన్ని, శ్రమను వెచ్చించి అనేక దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సమితి దానిని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1949 నవంబర్‌ 25న రాజ్యాంగసభలో అంబేడ్కర్‌ ప్రసంగిస్తూ, సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మనం వీలైనంత త్వరగా రాజ్యాంగబద్ధమైన పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. ‘మన దేశం 1950 జనవరి 26వ తేదీ నుంచి నూత్న దశలోకి ప్రవేశిస్తున్నది. రాజకీయంగా మనం సమానత్వం సాధించినప్పటికీ సామాజిక ఆర్థిక రంగాలలో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడక తప్పదు’ అని హెచ్చరించారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ప్రసాదించడంతో పాటు నిమ్నకులాలకు బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాకులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ న్యాయం చేకూర్చాలని ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాల ద్వారా సామాజిక ప్రజాస్వామ్యం అవతరించాలని అంబేడ్కర్‌ ఆశించారు. దాని కోసమే ప్రత్యేకంగా రక్షణ కల్పించే అంశాలను పొందుపరచి ఆమోదింపజేశారు. ఆర్టికల్‌ 38, ఆర్టికల్‌ 46 ఈ దేశంలోని వివిధ ప్రాంతాల కులాల, తెగల ప్రజల మధ్య అంతరాలను తొలగించే మార్గదర్శకాలు. కాని వాటిని నేటి ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు.

బత్తుల వీరాస్వామి,

అధ్యక్షుడు, అంబేడ్కర్‌ యువజన సంఘం

Updated Date - 2020-11-26T05:45:15+05:30 IST