అంబేడ్కర్‌ వర్సిటీలో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2020-08-10T09:15:48+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పాలన గాడితప్పింది. వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌ లేకపోవడంతోపాటు కీలక విభాగాల బాధ్యతలన్నీ ఇన్‌చార్జులే చూస్తున్నారు.

అంబేడ్కర్‌ వర్సిటీలో ఇష్టారాజ్యం

  • ఇన్‌చార్జి అధికారులతో గాడితప్పిన పాలన..
  • విద్యార్థులకు పుస్తకాలూ అందించని వర్సిటీ
  • 10 నెలలుగా చేపట్టని పుస్తకాల ముద్రణ
  • ఫిర్యాదుల ‘హెల్ప్‌డెస్క్‌’ లైన్లన్నీ తొలగింపు 
  • కీలక విభాగాల బాధ్యతలు జూనియర్‌ అధికారికి
  • సెమిస్టర్‌ విధానంతో భారీగా ఫీజుల వసూలు
  • అధికారుల తప్పులతో విద్యార్థులకు తిప్పలు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పాలన గాడితప్పింది. వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌ లేకపోవడంతోపాటు కీలక విభాగాల బాధ్యతలన్నీ ఇన్‌చార్జులే చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేకపోయినా.. విద్యార్థులకు కనీసం పుస్తకాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. 10 నెలలుగా పుస్తకాలే ముద్రించలేకపోయారు. పైగా.. సెమిస్టర్‌ విధానం పేరుతో ఫీజులను అడ్డగోలుగా పెంచేసి.. వర్సిటీ ఉన్నది లాభాలు గడించడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అంబేడ్కర్‌ వర్సిటీలో గతంలో ఏడాదికోసారి పరీక్షలు నిర్వహించి నామమాత్రంగా ఫీజులు వసూలు చేసేవారు.


అయితే విద్యార్థుల వెసులుబాటు కోసమంటూ నాలుగేళ్ల క్రితం సెమిస్టర్‌ విధానాన్ని ప్రారంభించారు. కానీ, దీంతోపాటే కోర్సు ఫీజును, పరీక్ష ఫీజులను భారీగా పెంచేశారు. గతంలో ఒక యూజీ విద్యార్థి ఏడాదికి చెల్లించే ఫీజు రూ.1000 లోపు ఉండగా.. ప్రస్తుతం రెండు సెమిస్టర్లకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఇక పరీక్షలు, పరీక్ష గైర్హాజరు, ప్రాక్టికల్స్‌ ఫీజులనూ భారీగా పెంచారు. కానీ, విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన పాఠ్యపుస్తకాలను కూడా ఇవ్వలేకపోతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను గత ఏడాది చివర్లోనే విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నా.. మార్చి 20 వరకు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత కరోనా సాకుతో అతీగతీ లేకుండా పోయింది. ముఖ్యంగా మూడేళ్ల యూజీ కోర్సు ఫైనలియర్‌ 5వ, 6వ సెమిస్టర్‌ విద్యార్థులకు ఒక్క పుస్తకం కూడా అందలేదు. మరోవైపు కరోనా నేపథ్యంలో పరీక్షలతోపాటు ఫలితాలన్నీ వాయిదా వేయడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రత్యేక హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటుచేసి అనుమానాలు నివృత్తి చేయాల్సిందిపోయి.. ఫిర్యాదులు భారీగా వస్తున్నాయంటూ అప్పటికే ఉన్న నాలుగు హెల్ప్‌డెస్క్‌ నెంబర్లనూ తొలగించేశారు. కరోనా నేపథ్యంలో వర్సిటీకి పలువురు కీలక అధికారులు తప్ప ఎవరూ రావడంలేదు. 


నియామకాల్లో ఇష్జారాజ్యం.. 

గత ఏడాది జూలైలో అన్ని వర్సిటీలతోపాటు అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ పదవీకాలం కూడా ముగియడంతో అప్పటినుంచి ఇన్‌చార్జుల పాలన సాగుతోంది. ముందుగా బాధ్యతలు చూసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి కూడా గత ఏప్రిల్‌లో పదవీ విరమణ చెందటంతో వికా్‌సరాజ్‌ను ఇన్‌చార్జి వీసీగా నియమించారు. ఆయన బాఽధ్యతలు స్వీకరించిన రోజు తప్ప.. ఆ తర్వాత వర్సిటీ సమస్యలపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో నియామకాల్లో కొందరు అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మరోవైపు రిజిస్ట్రార్‌, అకాడమిక్‌ డైరెక్టర్‌ కూడా ఇన్‌చార్జులే ఉన్నారు. కీలక శాఖల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగిపోతున్నాయి. 


2 కీలక శాఖలకు జూనియర్‌  అధికారి.. 

వర్సిటీ నిర్వహణలో మెటీరియల్‌ ప్రొడక్షన్‌ బ్రాంచ్‌ బాధ్యతలు కీలకం. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలన్నీ సకాలంలో అందించాల్సిన బాధ్యత ఈ శాఖదే. దీనికి ఇన్‌చార్జిగా ఉన్న ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ రిటైర్‌ కావడంతో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ రంగంలో అనుభవమున్న ఐదుగురు సీనియర్‌ ప్రొఫెసర్లను కాదని ఆయనకు ఇవ్వడం వర్సిటీలో తీవ్ర వివాదాస్పదమైంది. ఇక దూరదర్శన్‌ ద్వారా వీడియో పాఠాల ప్రసారానికి, ఆలిండియా రేడియో ద్వారా ఆడియో ప్రసారాలకు పాఠాలను అందించే ఏవీపీఆర్‌సీ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా మెటీరియల్‌ ప్రొడక్షన్‌ బ్రాంచ్‌ అధికారికే ఇచ్చారు. దీనిపై సీనియర్లు తీవ్ర అభ్యంతరం తెలిపినా.. ఫలితం లేకపోయింది. ఇకనైనా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వర్సిటీలో గాడితప్పిన పాలనను సరిదిద్దాల్సి ఉంది.  

Updated Date - 2020-08-10T09:15:48+05:30 IST