అంబేద్కర్‌ను నేను దూషించలేదు: శ్రీదేవి

ABN , First Publish Date - 2021-12-31T20:52:13+05:30 IST

రాజకీయ నేతలు నోట్లో ఏ మాట దాగదు. ఉద్వేగానికి లోనవుతారో.. లేక వివాదాలు సృష్టించడానికే అనిచిత వ్యాఖ్యలు చేస్తారా అర్థం కాదు.

అంబేద్కర్‌ను నేను దూషించలేదు: శ్రీదేవి

అమరావతి: రాజకీయ నేతల నోట్లో ఏ మాట దాగదు. ఉద్వేగానికి లోనవుతారో.. లేక వివాదాలు సృష్టించడానికే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో నేతలు చరిత్రనే వక్రీకరిస్తూ విమర్శల పాలవుతుంటారు. తీరా బయట నుంచి ఒత్తిడిపెరిగిన తర్వాత తాము ఆ వ్యాఖ్యలు చేయలేదని నాలుక కరచుకోవడం సాదారణమే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎదుటివారిపైనే నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యూటర్న్ తీసుకున్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను తాను దూషించలేదని వివరణ ఇచ్చారు. కావాలనే కొంత మంది వ్యక్తులు తనపై దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్ఫింగ్, ఎడిటింగ్ వీడియో వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాల దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను ఈ స్థాయిలో నిలబడేందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలే తోడ్పాటు నిచ్చాయని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రాం దళితులకు రెండు కళ్లులాంటి వాళ్లని తెలిపారు. తాను  చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినని చెప్పారు. వీడియో ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ కుట్ర వెనుక ఎవరున్న వదిలిపెట్టేది లేదని శ్రీదేవి స్పష్టం చేశారు.


గురువారం రాజమహేంద్రవరంలో జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో ఏకంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పైనే శ్రీదేవి నోరు జారారు. ‘‘బాబూ జగ్జీవన్‌రామ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంబేడ్కర్‌ ద్వారా హక్కులు వచ్చాయా? రాలేదు. రాజ్యాంగ హక్కులను జగ్జీవన్‌రామ్‌ మనకు అమలు చేశారు. ఈ రోజున రాజకీయంగా, సామాజికంగా మనం ఎదుగుతున్నామంటే అది జగ్జీవన్‌రామ్‌ ఘనతే. నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని శ్రీదేవి అన్నారు. అంబేడ్కర్‌ ద్వారా మనకు హక్కులు రాలేదంటూ ఆమె మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ‘‘దళిత బహుజనుల ఆరాధ్య దైవం అంబేడ్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి యావత్‌ దళిత బహుజన జాతులకు క్షమాపణ చెప్పాలి," అని డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2021-12-31T20:52:13+05:30 IST