మహనీయుల స్మరణ మా జన్మహక్కు!

ABN , First Publish Date - 2021-04-03T06:05:21+05:30 IST

మాకు ఈ జీవితాలను ఇచ్చిన వాళ్ళు మా తల్లిదండ్రులు అయితే, మా ఈ జీవితాలను నిలబెట్టినవాళ్లు అంబేడ్కర్‌, పూలే, జగీజీవన్‌రామ్‌, సాహూ మహరాజ్‌, కాన్షీరాం మా మహనీయులు. వారి ఆ మహనీయులను స్మరించుకోవడం...

మహనీయుల స్మరణ మా జన్మహక్కు!

మాకు ఈ జీవితాలను ఇచ్చిన వాళ్ళు మా తల్లిదండ్రులు అయితే, మా ఈ జీవితాలను నిలబెట్టినవాళ్లు  అంబేడ్కర్‌, పూలే, జగీజీవన్‌రామ్‌, సాహూ మహరాజ్‌, కాన్షీరాం మా మహనీయులు. వారి ఆ మహనీయులను స్మరించుకోవడం మా విధి, ధర్మం. అంబేడ్కర్‌ జన్మదినం ఏప్రిల్‌ 14 ఈ దేశ అణగారిన కులాల ప్రజలకు పర్వదినం. ఏప్రిల్‌ 5 బాబూ జగీజీవన రామ్‌ జన్మదినం, ఏప్రిల్‌ 11 పూలే జన్మదినం దళిత బహుజనుల పండుగ రోజులు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఉత్సవాలకు కరోనా మహమ్మారి పేరు చెప్పి చరమగీతం పాడేందుకు సాహసించింది తెలంగాణ సర్కారు. ఏప్రిల్‌ 5, ఏప్రిల్‌ 14న ఎలాంటి బహిరంగ సామూహిక ప్రదర్శనలు జరపకూడదని ఏకంగా జీవోనే విడుదల చేశారు. 


నిజానికి కరోనా మహమ్మారి ఆరోగ్యానికి మించిన ఇతర అనేక సమస్యలను మనకు రుచిచూపిస్తున్నది. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండి లేక కోట్లాది జనం బతుకులెల్లదీస్తున్నారు. ప్రజల కనీస హక్కులు సైతం హరించుకుపోతున్నాయి. ప్రజల బతుకులకు పాలకులు పూచీపడడం ఓ జ్ఞాపకంగామిగిలిపోయే పరిస్థితులు దాపురించాయి. మీ బతుకు మీ ఖర్మ, బతికితే బతకండి... చస్తేచావండి అంటున్నారు పాలకులు. ఇందుకు మన తెలంగాణ పాలకులు సైతం మినహాయింపుకాకపోవడం దురదృష్టకరం. ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ పాలకులు నినదించే గొంతులను నొక్కేసేందుకు పూనుకోవడం దుర్మార్గం. 


ఎన్నికల ప్రచారాలకు, రాజకీయ జాతరలకు అడ్డురాని కరోనా మన మహనీయుల స్మరణకే ఎందుకు అడ్డువస్తున్నది? రామ్‌కు అడ్డురాని కరోనా భీమ్‌కు ఎందుకు అడ్డువస్తున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణలో సైతం రామ్‌ను ముందుపెట్టి సామాజిక, రాజకీయ ఆధిపత్యం కోసం కమలనాథులు కాలుదువ్వుతున్న స్థితిలో, క్షేత్ర స్థాయిలో రామ్‌ను ఢీకొనగలిగిన భీమ్‌ను ఆ క్షేత్రం నుంచి దూరం చేయడం రాజకీయంగా అవివేకపు నిర్ణయం.


క్షేత్ర స్థాయిలో మనువాదులను ఈ మహనీయుల వారసులు తప్ప మరెవ్వరు ఎదుర్కొంటారు? మనువాదులకు రాజకీయ, సామాజిక రంగాలలో అడ్డే లేకపోతే, ఆ తరువాత అణగారిన కులాల బిడ్డల బతుకేమిటి? మహనీయుల ఉత్సవాలను నియంత్రించడం కొందరికి చిన్న విషయంగానే కనిపించవచ్చు. కాని ఆ నిర్ణయం వెనుక చాలా పెద్ద విషయం దాగుంది. కాబట్టి, ప్రభుత్వం తక్షణం మెమో నంబర్‌ 189ను ఉపసంహరించుకుని ఆ మహనీయులను స్మరించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలి. రాష్ట్రంలోని దళిత, బహుజనులు అందరూ ఐక్యతను చాటుతూ బాబూ జగీజీవన్‌రామ్‌, మహాత్మా పూలే, అంబేడ్కర్‌ల జయంతి ఉత్సవాలను గ్రామగ్రామాన గొప్పగా జరుపుకుని, వారి బాటలో సాగుతామని ప్రతిన బూనాలి. 


వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ

వైస్‌ ఛైర్మన్‌, దళిత, బహుజన అభ్యుదయ వేదిక

Updated Date - 2021-04-03T06:05:21+05:30 IST