Ambedkar's photos in the courts: కోర్టుల్లో అంబేడ్కర్‌ ఫొటోలు

ABN , First Publish Date - 2022-07-26T15:59:03+05:30 IST

మద్రాసు హైకోర్టు, హైకోర్టు మదురై(Madhurai) డివిజన్‌ బెంచ్‌ సహా రాష్ట్రంలో అన్ని కోర్టులు, పోలీస్‏స్టేషన్లలో అంబేడ్కర్‌ ఫొటో పెట్టాలనే పిటిషన్‌ను మద్రాసు

Ambedkar's photos in the courts: కోర్టుల్లో అంబేడ్కర్‌ ఫొటోలు

                                      - పిటిషన్‌ తోసిపుచ్చిన హైకోర్టు


పెరంబూర్‌(చెన్నై), జూలై 25: మద్రాసు హైకోర్టు, హైకోర్టు మదురై(Madhurai) డివిజన్‌ బెంచ్‌ సహా రాష్ట్రంలో అన్ని కోర్టులు, పోలీస్‏స్టేషన్లలో అంబేడ్కర్‌ ఫొటో పెట్టాలనే పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. తిరునల్వేలి జిల్లా పాళయంకోటకు చెందిన అయ్యా మద్రాసు హైకోర్టు(Madras High Court)లో దాఖలుచేసిన పిటిషన్‌లో, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఫొటో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏర్పాటుచేయాలని కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని, అలాగే ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్‌ ఫొటో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీచేశారని తెలిపారు. కానీ, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌, తిరువళ్లువర్‌, తందై పెరియార్‌, దివంగత ముఖ్యమంత్రులు కామరాజర్‌, అన్నా తదితరుల చిత్రపటాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అనుమతించినా ఆ ఉత్తర్వులు అమలుకావడం లేదన్నారు. రాష్ట్రంలో హైకోర్టులో సహా అన్ని న్యాయస్థానాల్లో అంబేడ్కర్‌ చిత్రపటం ఏర్పాటుచేయాలనే ఉత్తర్వులివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌(Petition) సోమవారం ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి మాలలతో కూడిన ధర్మాసనం, అంబేడ్కర్‌ చిత్రపటం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని, మళ్లీ అదే అంశంతో దాఖలైన పిటిషన్‌ను జరిమానాతో తోసిపుచ్చనున్నట్లు హెచ్చరించింది. దీంతో, పిటిషన్‌ వాపసు తీసుకుంటున్నట్లు పిటిషన్‌దారుడు ధర్మాసనానికి తెలుపవడంతో, కేసు విచారణ ముగిసినట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-07-26T15:59:03+05:30 IST