ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేసి ఆ వెంటనే డిలీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే తనకు చివరి ఐపీఎల్ అని, ఈ 13 ఏళ్ల కాలంలో రెండు గొప్ప జట్లకు ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉందని రాయుడు ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది కొత్తేమీ కాదు. 2019 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులోకి తనను తీసుకోవడంతో మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మళ్లీ ఐపీఎల్‌లో ఆడాడు. రాయుడు భారత్ తరపున 55 వన్డేలు ఆడి 1,694 పరుగులు చేశాడు. ఇందులో 47.05 సగటుతో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆరు టీ20ల్లో 42 పరుగులు చేశాడు. హైదరాబాద్, ఆంధ్రా, బరోడా, విదర్భ తరపున 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి 271 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 187 మ్యాచుల్లో 4187 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న పదో ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.
ఇవి కూడా చదవండి