అంబటి నిలదీత

ABN , First Publish Date - 2022-08-02T10:32:17+05:30 IST

మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలోనే శృంగభంగమైంది.

అంబటి నిలదీత

  • సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు
  • పెన్షన్‌ ఆపివేతపై దులిపేసిన దివ్యాంగురాలు
  • ‘గడప..’కు వెళుతున్నట్టు ముందే ప్రకటన
  • అక్కడే అన్నీ తేలిపోతాయంటూ ఆర్భాటం
  • తీరా జనంలోకి వెళ్లాక దిక్కు తోచని పరిస్థితి
  • మూడేళ్లలో ఏంచేశారంటూ జనం ప్రశ్నలు
  • దేనికీ జవాబుచెప్పని మంత్రిపై తిట్ల దండకం


అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి)/రాజుపాలెం: మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలోనే శృంగభంగమైంది. పలు సమస్యలపై ఆయనను మహిళలు నిలేసి.. తమ గడపల్లో దులిపేశారు. శాపనార్ధాలు పెట్టారు. తమ ఊరికి, వీధికి, గడపకు ఎందుకొచ్చారంటూ ఛీత్కరించారు. నిజానికి, శనివారం విజయవాడ జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, తాను సోమవారం ‘గడప గడప..’కు వెళుతున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఈ మూడేళ్లలో ఏం చేశామో ‘గడప గడపకూ’ కార్యక్రమంలో ప్రజలే చెబుతారంటూ కాసింత గర్వంగా చెప్పారు. కావాలంటే ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ కూడా రావాలని అన్నారు. అన్నట్లుగానే.. సత్తెనపల్లిలోని రాజుపాలెంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించిన అంబటి రాంబాబుపై గ్రామస్థులు మూడేళ్లుగా దాచుకున్న ఆగ్రహ ఆక్రోశాలన్నీ వెళ్లగక్కారు. వేంకటేశ్వరస్వామి ఆలయం రహదారిలో నివశిస్తున్న కేదారి రమేశ్‌ సమస్యలపై వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే మంత్రిని పక్క ఇంటికి తీసుకువెళ్లారు. కాస్తా ముందుకు వచ్చిన తరువాత.... సైడు కాలువ సమస్యను ఓ యువతి మంత్రి దృష్టికి తెచ్చారు. కాలువలో చేరిన మురుగు వల్ల పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


టీడీపీ వాళ్లకు రోడ్డెందుకు వేస్తాం? 

రాజుపాలెంలో తిరిగే క్రమంలో మంత్రి రాంబాబు ధర్మరావు బజారుకు వెళ్లారు. ఆ సమయంలో ఓ యువకుడు మంత్రికి తన సమస్య తెలిపారు. వర్షం పడితే మోకాళ్లలోతు నీటిలో నడవాల్సి వస్తోందని, రోడ్డు వేయించమని కోరాడు. ఆ యువకుడి గురించి తన పక్కన ఉన్న అధికారులను మంత్రి ఆరా తీశారు. ‘అసలు ఇతను మనవాడేనా?’ అని అడిగారు. ‘కాదండి నేను తెలుగుదేశం’ అని ఆ యువకుడే చెప్పాడు. దీంతో.. ‘నీకు రోడ్డు ఎలా వేస్తామ’ని మంత్రి అన్నారు. పార్టీలు చూడమని సీఎ నుంచి నేతలందరూ డాంబికాలు పలుకుతారని.. ఇప్పుడు పార్టీలెందుకు అడుగుతున్నారని అతడు విరుచుకుపడ్డాడు. అతడు ప్రశ్నిస్తుండగానే వడివడిగా అంబటి వెళ్లిపోయారు. అంబటి వెళ్లిపోయినా .. జనం రుసరసలు తగ్గలేదు.  కాగాచ సమస్యలపై ఆరాతీస్తున్న మంత్రి వద్దకు జలపాటి సోమయ్య దంపతులు వచ్చారు. ఏడాది క్రితం వరకు ఇచ్చిన పింఛనును ఇటీవల నిలిపివేశారని ఫిర్యాదుచేశారు సోమయ్య భార్య సరోజని గట్టిగా నిలదీస్తూ.. ‘‘అసలే నేను వికలాంగురాలిని. పనికి కూడా వెళ్లలేను. నా పింఛనును ఎలా తొలిగిస్తారు?’’ అని ప్రశ్నించారు. ఇంతలో స్థానికులు కూడా అందుకున్నారు. ‘అన్ని రేట్లు పెంచారు. రైతు భరోసా రూ.13వేలు అన్నారు. ఇప్పటివరకు రూ.7వేలు ఇచ్చారు. సత్తెనపల్లి నుంచి రాజుపాలేనికి చార్జీ ఎంత? ట్రాక్టరు మట్టి రూ.1500 అమ్ముతున్నారు. ఏమిటీ మీరు చేసింది?’’ అంటూ కడిగిపారేశారు. అంబటిపైనా, ప్రభుత్వంపైనా బూతులు లంఘించుకున్నారు. దీనిపై మంత్రి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను వీడియోలు తీసిన విలేకరులను పిలిచి బెదిరించారు.

Updated Date - 2022-08-02T10:32:17+05:30 IST