న్యూఢిల్లీ: ‘పెగాసస్ స్పైవేర్’ వ్యవహారం ప్రస్తుతం భారత్తో పాటూ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సాఫ్ట్వేర్ కారణంగా జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు నిఘా నీడలోకి వెళ్లారనే వార్తలు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ రూపకర్త ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్లను నిలిపివేసినట్టు తాజాగా ప్రకటించింది. ‘‘పెగాసస్ వ్యవహారం మాకు తెలిసిన వెంటనే..ఎన్ఎస్ఓ అకౌంట్లను నిలిపివేశాం’’ అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ వసతుల సాయంతోనే ‘పెగాసస్’ సేకరించిన సమాచారం మరోచోటుకి తరలిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధనలో బయటపడిన విషయం తెలిసిందే.