Green cards: గ్రీన్ కార్డులపై అమెరికా ప్రభుత్వానికి అమెజాన్ సంస్థ కీలక సూచన

ABN , First Publish Date - 2022-08-12T02:13:28+05:30 IST

ప్రముఖ కార్పొరేట్ సంస్థ అమెజాన్ గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన గ్రీన్ కార్డులను వృథా చేయద్దని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శాఖకు తాజాగా సూచించింది.

Green cards: గ్రీన్ కార్డులపై అమెరికా ప్రభుత్వానికి అమెజాన్ సంస్థ కీలక సూచన

ఎన్నారై డెస్క్: ప్రముఖ కార్పొరేట్ సంస్థ అమెజాన్(Amazon) గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన గ్రీన్ కార్డులను వృథా(wastage) చేయద్దని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శాఖకు(USCIS) తాజాగా సూచించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గ్రీన్ కార్డుల ద్వారా అమెరికాలో శాశ్వతనివాసానికి అనుమతి లభిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక జూన్ నెల ముగిసే సమయానికి ఇంకా లక్ష ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు(Employment based green cards) పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వం USCIS ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. 


ఇటువంటి వీసాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలంటూ పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు అమెజాన్ మానవ వనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ బెత్ గ్యాలెటీ సంస్థ వెబ్‌సైట్‌లో ఓ బ్లాగ్ పోస్ట్ పెట్టారు. ‘‘2020కు ముందే అమెరికాకు వలసొచ్చిన అనేక మంది.. గ్రీన్ కార్డుల కోసం సుదీర్ఘకాలం వేచిచూడాల్సి వచ్చేది. కరోనా కారణంగా ఈ జాప్యం మరింత పెరిగింది. 2021లో 65 వేల పైచిలుకు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు ఎవరికీ జారీ కాకపోవడంతో నిరుపయోగమయ్యాయి. 2022 సంవత్సరానికి కాంగ్రెస్ 2,81,000 గ్రీన్ కార్డులను కేటాయించింది. కానీ..జూన్ 30 నాటికి లక్షకు పైగా వీసాలు మిగిలి ఉన్నాయి. వాటిపై USCIS ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆమె ప్రస్తావించారు.


సెప్టెంబర్ మాసాంతానికి ఈ అంశంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో అవి వృథా అయిపోతాయి. అమెరికా చట్టాల ప్రకారం.. ఓ సంవత్సరంలో వినియోగించని గ్రీన్ కార్డులను తదుపరి ఏడాది కోటాలోకి బదిలీ చేసే అవకాశం ఉండదు. కాగా.. అమెరికాలో ఉంటున్న అమెజాన్ ఉద్యోగులపై ఈ జాప్యం ప్రభావం చూపిస్తోందని బెత్ తెలిపారు. వారందరూ ఇప్పటికే తామున్న ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా సాయపడుతున్నారని చెప్పారు. త్వరితంగా గ్రీన్ కార్డులు జారీ చేస్తే అది వలసదారులకు వారి కుటుంబీకులకు లాభిస్తుందని, తద్వారా అమెరికా ఆర్థికంగా, సాంస్కృతికపరంగా మరింత సుసంపన్నం అవుతుందని ఆమె అన్నారు. 

Updated Date - 2022-08-12T02:13:28+05:30 IST