అమెజాన్‌కు 40% వాటా?

ABN , First Publish Date - 2020-09-11T06:21:13+05:30 IST

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌లో అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2,000 కోట్ల డాలర్ల (రూ.1.50 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది...

అమెజాన్‌కు 40% వాటా?

  • రిలయన్స్‌ రిటైల్‌లో 


ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌లో అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2,000 కోట్ల డాలర్ల (రూ.1.50 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పటికే తన డిజిటల్‌ సేవల కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 32.84 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,52,055.45 కోట్లు సమీకరించింది. తాజాగా రిటైల్‌ వ్యాపారంలో అమెజాన్‌కు 40 శాతం వరకు వాటా విక్రయించాలని భావిస్తోందని బ్లూంబర్గ్‌ తాజా కథనం వెల్లడించింది. అయితే, ఈ విషయంపై అటు అమెజాన్‌, ఇటు రిలయన్స్‌ గానీ స్పందించలేదు. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 1.75 శాతం వాటాను సిల్వర్‌ లేక్‌ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ మార్కెట్‌ విలువను రూ.4.21 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది.  మరో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ కూడా రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.


ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, సిల్వర్‌ లేక్‌,  కేకేఆర్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌ సహా మొత్తం 13 అంతర్జాతీయ దిగ్గజాలు జియోలో పెట్టుబడులు పెట్టాయి. ముకేశ్‌ అంబానీ వీరందరికీ రిలయన్స్‌ రిటైల్‌ వాటాలను ఆఫర్‌ చేసినట్లు సమాచారం. వీరంతా రిటైల్‌లోనూ వాటాలు తీసుకుంటారా..? లేదంటే అమెజాన్‌ గంపగుత్తగా కొనుగోలు చేస్తుందా..? వేచి చూడాల్సిందే. 


భారత్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐ.. 

అమెజాన్‌ 2000 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తే, భారత చరిత్రలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) అవుతుంది. అలాగే, అమెజాన్‌కూ భారత్‌లో ఇదే అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. 


ప్రత్యర్ధులు మిత్రులుగా.. 

అమెజాన్‌, రిలయన్స్‌ మధ్య ఒప్పందం కుదిరితే, ఇన్నాళ్లు రిటైల్‌ రంగంలో ప్రత్యర్ధులుగా ఉన్న జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌ వ్యవస్థాపకుడు), ముకేశ్‌ అంబానీ మిత్రులుగా మారతారు. అంతేకాదు, దేశీయ రిటైల్‌ రంగ మహా దిగ్గజంగా ఎదిగేందుకు రిలయన్స్‌కు ఈ డీల్‌ ఎంతగానో దోహదపడనుంది. ఈ డీల్‌తో అమెజాన్‌కూ లాభ మే. రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన జియోమార్ట్‌ సేవలను ఉపయోగించుకునేందుకు అమెజాన్‌కు అవకాశం లభిస్తుందని, అమెజాన్‌ ఫ్రెష్‌, ప్యాంట్రీ వినియోగదారులు ఆర్డర్‌ చేసిన రోజే సరుకులు డెలివరీ అందించేందుకు ఉపయోగపడగలదని విశ్లేషకులంటున్నారు.  


Updated Date - 2020-09-11T06:21:13+05:30 IST