Flipkart-Amazon sales: నష్టపోతూనే 80, 90 శాతం డిస్కౌంట్లను ఇస్తున్నాయనుకుంటున్నారా..? అసలు కథ ఇదీ..!

ABN , First Publish Date - 2022-09-23T18:30:51+05:30 IST

పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్టు(Flipkart), అమెజాన్(Amazon) వంటి ఈకామర్స్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్టు, అమెజాన్ ఈ నెల ప్రారంభంలోనే బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days), గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(Amazon Great Indian Festival Offers) పేరుతో భారీ డిస్కౌంట్‌తో కూడిన సేల్స్‌ను ప్రకటించాయి

Flipkart-Amazon sales: నష్టపోతూనే 80, 90 శాతం డిస్కౌంట్లను ఇస్తున్నాయనుకుంటున్నారా..? అసలు కథ ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్టు(Flipkart), అమెజాన్(Amazon) వంటి ఈకామర్స్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్టు, అమెజాన్ ఈ నెల ప్రారంభంలోనే బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days), గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(Amazon Great Indian Festival Offers) పేరుతో భారీ డిస్కౌంట్‌తో కూడిన సేల్స్‌ను ప్రకటించాయి. గృహోపరకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌లపై పెద్ద మొత్తంలో ఇంకా చెప్పాలంటే.. కొన్ని వస్తువులపై 80-90శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి రెండు ప్లాట్‌ఫాంలలో సేల్స్ కూడా ప్రారంభమైపోయాయి. దీంతో షాపింగ్ ప్రియులతో పాటు సాధారణ జనం కూడా తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇంతలా డిస్కౌంట్స్ ఇస్తే.. సదరు సంస్థలకు నష్టం రాదా? అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? నష్టాలను భరించి మరీ.. ఈ ఈకామర్స్ సంస్థలు మనకు మేలు చేస్తున్నాయనే భ్రమల్లో ఉంటే.. ఈ వార్త మీ కోసమే. 


ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థల పని ఇదీ(Amazon-Flipkart)

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, లేక మరొక ఈ కామర్స్ సంస్థ అయినా.. వ్యాపారి, వినియోగదారుడి మధ్య కేవలం మధ్యవర్తిగా మాత్రమే పని చేస్తాయి. ఇలా పని చేసినందుకుగాను కొంత మొత్తంలో ఇవి కమీషన్ పొందుతాయి అంతే. వ్యాపారులకు తమ ప్లాట్‌ఫాంలను ఓ వేదికగా అందించి.. ప్రొడక్ట్‌లను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తాయి. దీని ప్రతిఫలంగా ఈ ఈకామర్స్ సంస్థలు కమీషన్ పొందుతాయి. 



డిస్కౌంట్..

వ్యాపారం బాగా జరిగి.. లాభాల బాట పట్టాలంటే.. కష్టమర్ల తాకిడీ ఎక్కువగా ఉండాలి. అందుకే భారీ మొత్తంలో డిస్కౌంట్ల పేరుతో తొలుత వ్యాపారులు కానీ.. మధ్యవర్తిగా పని చేస్తున్న ఈ కామర్స్ సంస్థలు కాని ఆఫర్ల పేరుతో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. రిలయన్స్ జియో. కొత్తలో జియో.. ఫ్రీగా ఇంటర్నెట్‌ను అందించింది. తీరా ప్రజలందరూ దానికి అలవాటు పడిన తర్వాత.. జేబులు గుల్ల అయ్యేలా టారీఫ్ రేట్లు పెంచేసింది. ఇదే స్ట్రాటజీని ఈకామర్స్ సంస్థలు అమలు చేస్తున్నాయి. తొలుత డిస్కౌంట్స్ పేరుతో ప్రజలను దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందుకోసం ఈ ఈకామర్స్ సంస్థలు, వ్యాపారులు.. కమీషన్‌ను లాభాలను వదులుకుంటున్నాయి. 



80%-90% డిస్కౌంట్లలో మతలబు ఏంటంటే..

సరిగ్గా గమనిస్తే.. ప్రతి విభాగంలోని వస్తువులపై ఈ కామర్స్ సంస్థలు(Festival Offers) 80-90శాతం డిస్కౌంట్లు ఇవ్వవు. కేవలం కొన్ని వస్తువులపై మాత్రమే ఇంత పెద్ద మొత్తాన్ని తగ్గించినట్టు చూపిస్తుంటాయి. నిజానికి చెప్పాలంటే.. 80-90 శాతం డిస్కౌంట్లు ప్రకటించే ముందు.. సంబంధిత వస్తువుల రేట్లను పెంచేసి.. తిరిగి ఆ పెంచిన ధరతోపాటు ఇంకొంత మొత్తాన్ని తగ్గించి పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నాయనుకునేలా చేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సాధారణంగానే కొన్ని బ్రాండ్లు.. ఏడాది చివర్లో భారీగా మిగిలిపోయిన ప్రొడక్ట్‌లను క్లియరెన్స్ సేల్స్ పేరుతో తమ బ్రాండ్ వాల్యూ పోకుండా చూసుకుంటూనే కొంత మొత్తంలో డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.


ఇలా డిస్కౌంట్లో వచ్చిన ప్రొడక్ట్‌లను వ్యాపారులు పెద్ద మొత్తంలో రిటైల్ ధరలో 20-30శాతానికి కొనుగోలు చేస్తారు. వాటినే ఈకామర్స్ సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో డిస్కౌంట్లకు(Big Billion Days Discounts) అమ్ముతూ.. దీర్ఘకాలం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లాభాలు చూసుకోకుండా కస్టమర్లకు అమ్మేస్తుంటారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావొచ్చు.. ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్‌ల పైనా రెండు సంస్థలూ భారీ డిస్కౌంట్లు(Flipkart Big Billion Days) అందిస్తున్నాయి కదా.. అవి స్టాక్ ప్రొడక్ట్‌లు ఎలా అవుతాయనే ఆలోచనలు మీ మదిలో మెలుగుతూ ఉండొచ్చు. మీ ఆలోచన నిజమే. అయితే ఇక్కడ జియో సూత్రం పని చేస్తుంది. అదీకాకుండా.. ఐఫోన్‌లపై అంతపెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తూ సేల్స్ ముగిసే వరకు ఈకామర్స్ సంస్థలు(Amazon-Flipkart) అదే రేటుకు అమ్మవు. సేల్స్ మధ్యలోనే సాధారణంగా ఔటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేస్తాయి. 


కస్టమర్లకు ఎంత వరకు ప్రయోజనం

కస్టమర్లు ఒక విషయాన్ని గమనించాలి. భారీ డిస్కౌంట్ల ప్రకటనలు చూసి ప్రజలు ఆయా ఈకామర్స్ సంస్థల వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తారు. ఇలా విజిట్ చేసిన వారిలో కొందరు మాత్రమే.. వాళ్లకు ఉపయోగపడే వస్తువులను కొనుగోలు చేసి అందులోంచి బయటకు వస్తారు. కానీ చాలా మంది తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడంతోనే ఆగిపోరు. అక్కడ కనిపిస్తున్న ధరలను చూసి.. తనకు అవసరం లేకున్నా ఇతర వస్తువులను కొనుగోలు(Amazon Great Indian Festival Offers) చేస్తారు. జేబులను గుల్ల చేసుకుంటారు. అంతిమంగా ఈ సేల్స్ కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటారు. చాలా మంది మాత్రం.. తమ డబ్బులను వృథా చేసుకుంటారు. కాదు.. కాదు.. వృథా చేసుకునేలా ఈకామర్స్ సంస్థలు మాయ చేస్తాయనడం బెటర్.


Updated Date - 2022-09-23T18:30:51+05:30 IST