అపురూప బంధం

ABN , First Publish Date - 2022-08-12T05:28:42+05:30 IST

సోదరీ సోదరుల అనురాగాన్ని రక్షాబంధన్‌ (రాఖీ) ఇనుమడింపజేస్తుంది.

అపురూప బంధం


సోదరీ సోదర అనుబంధాన్ని   చాటే రక్షాబంధన్‌
నేడు రాఖీ పౌర్ణమి


కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 11: సోదరీ సోదరుల అనురాగాన్ని  రక్షాబంధన్‌ (రాఖీ) ఇనుమడింపజేస్తుంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకోనున్నారు. అన్నదమ్ములకు కట్టేందుకు సోదరీమణులు రాఖీలను  కొని సిద్ధం చేసుకుంటున్నారు.   ఒకప్పుడు రక్షా బంధన్‌   ఉత్తరాది రాష్ట్రాల సంస్కృతి.  ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకుంటున్నారు. అక్కడి  నుంచి మార్వాడీలు, రాజస్థానీయులు, గుజరాతీయులు ఐదు దశాబ్దాలకు పైగా జిల్లాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇందు వల్ల కూడా ఉమ్మడి జిల్లాలో ఏటా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.   మార్కెట్లో  విభిన్న రకాల డిజైన్లలో, వివిధ సైజుల్లో ఆకర్షణీయమైన రాఖీలు విక్రయిస్తున్నారు.  
 
సోదరీ సోదర ప్రేమకు గుర్తు
 
 రక్షాబంధన్‌  సోదర సోదరీమణుల మధ్య ప్రేమాభిమానాలను పటిష్టపరుస్తుంది.  సోదరి తన సోదరుడి కుడిచేయి ముంజేతికి రాఖీ కట్టి, నుదుట తిలకం దిద్ది, మిఠాయిలు తినిపిస్తుంది.  ఆతర్వాత సోదరులు కానుకలు ఇస్తారు.    ఏ బంధుత్వం లేకున్నా సోదర భావంతో రాఖీ కట్టడం ఒక సంప్రదాయం. ఆత్మీయతకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు.


ఆలయాల్లో శ్రావణ పౌర్ణమి సందడి..

 రాఖీ పండుక శ్రావణ పౌర్ణమినాడు వస్తుంది. అందుకే ఈ మాసంలో విచ్చేసే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు.  ఈ పౌర్ణమి రోజునే జగద్గురువైన నారాయణుడు హయగ్రీవ స్వామిగా అవతరించారని పురాణాలు చెబుతాయి. అందుకని శ్రావణ పౌర్ణమి రోజునే హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు.   నగరంలోని  వివిధ శైవ, వైష్ణవ ఆలయాల్లో శ్రావణ పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నోములు, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో...

విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద యం 10 గంటల నుంచి కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో రక్షాబంధన్‌ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాశ్‌ తెలిపారు. వీహెచ్‌పీ మహిళా విభాగ్‌ అధ్వర్యంలో ‘నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష’ అనే నినాదంతో ఈ కార్యక్రమం ఉంటుం దని ఆయన తెలిపారు.

ఆకట్టుకుంటున్న రాఖీలు...

నగరంలో రక్షాబంధన్‌ వేడుక సందర్భంగా పెద్దమార్కెట్‌ , పాతబస్టాండ్‌, మించిన్‌బజార్‌, సి.క్యాంపు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రక్షాబంధనాలు అమ్మకాలకు పెట్టారు. విభిన్న రూపాల్లో, రంగులతో రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. శిల్కు దారానికి గాజుపూసలు, చెమ్కీలు, తగరపు కాగితాలతో వీటిని తయారు చేశారు.  వీటిపై ఆదనపు ఆకర్షణగా పింగాణి కోటెడ్‌లతో, ఆకర్షణీయమైన అక్షరాలతో చూడముచ్చట గొలిపేలా వీటిని  తయారు చేశారు. ఒక్కో రాఖీలు రూ.10 నుంచీ రూ. 200 వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి.

Updated Date - 2022-08-12T05:28:42+05:30 IST