విషం చిమ్మి.. విధ్వంసం!

ABN , First Publish Date - 2022-04-30T08:17:06+05:30 IST

మొత్తం నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసి, 33 వేల ఎకరాలు సమీకరించి, నిజాయితీతో కూడిన పాలనకు ప్రపంచంలోనే పేరొందిన సింగపూర్‌ను భాగస్వామిగా మార్చి, వేలకోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసి... ‘

విషం చిమ్మి.. విధ్వంసం!

అమరావతి రూపంలో అద్భుతమైన అవకాశం

అప్పటికే 20 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు

ప్రముఖ బ్యాంకులకూ స్థలాల కేటాయింపు

ప్రఖ్యాత విద్యా, వైద్య సంస్థలకు చోటు

అవన్నీ కచ్చితంగా ప్రారంభమయ్యేవే

1691 ఎకరాల్లో సింగపూర్‌ స్టార్టప్‌ సిటీ

ప్రభుత్వ నగరిలో వేల కోట్ల నిర్మాణాలు

ఇప్పటికే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి

కొన్ని లక్షల మందికి పరోక్ష ఉపాధి

ప్రభుత్వానికి లక్ష కోట్లకుపైగా ఆదాయ అవకాశం

ఆంధ్రుల ఆత్మగౌరవానికీ చిహ్నంగా నిలిచేది

అడ్డగోలు సాకులతో అమరావతిని ఆపిన జగన్‌

అన్నీ దారిలో పెట్టి చేతికందించిన గత ప్రభుత్వం

యథాతథంగా కొనసాగిస్తే అవకాశాల గని



అమరావతి, పోలవరం... రాష్ట్రానికి రెండు కళ్లుగా భావించారు. పోలవరం రాష్ట్రానికి జల జీవనాడిగా... అమరావతిని రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా తీర్దిదిద్దాలని తలపోశారు. అంతకుముందు తట్టెడు కాంక్రీటు కూడా ఎరుగని పోలవరం ప్రాజెక్టును గేట్ల దాకా తీసుకెళ్లారు. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించి వేలకోట్ల రూపాయల పనులు కూడా చేశారు. అంతలోనే... జగనన్న అధికారంలోకి వచ్చారు. ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగించి ఉంటే... రాష్ట్రం తీరు మరోలా ఉండేది. కానీ... ఆ రెండు కళ్లనూ జగన్‌ పొడిచేశారు. ఫలితం.... రాష్ట్ర భవిష్యత్తు అంధకారం! అమరావతి నిర్మాణం యథాతథంగా సాగి ఉంటే... రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవనే అంశంపై ప్రత్యేక కథనం.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మొత్తం నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసి, 33 వేల ఎకరాలు సమీకరించి, నిజాయితీతో కూడిన పాలనకు ప్రపంచంలోనే పేరొందిన సింగపూర్‌ను భాగస్వామిగా మార్చి, వేలకోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసి... ‘అమరావతి’ అనే అద్భుతమైన అవకాశాన్ని అప్పనంగా చేతిలో పెడితే  ఏ పాలకుడైనా ఏం చేస్తారు? దానిని అందిపుచ్చుకుని, ముందుకు తీసుకెళతారు. ఒక సరికొత్త నగర నిర్మాణంలో భాగస్వామిగా మారి... చరిత్రలో నిలిచిపోతారు. కానీ... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చెల్లని సాకులు అనేకం చెప్పారు. ‘అమరావతి’ని అటకెక్కించారు. ఒకప్పుడు వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతిని, నిజంగానే ఎడారిలా మార్చారు. వేలకోట్లతో నిర్మితమైన భవనాలు, రోడ్లను పాడుపెట్టారు. అలాకాకుండా... అమరావతి ప్రణాళికను యథాతథంగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, ఈపాటికి ప్రభుత్వ నగరి నిర్మాణం, ప్రైవేటు ప్రాజెక్టులు అనేకం పూర్తయి, మరెన్నో జోరుగా ముందుకు సాగుతుండేవి. అమరావతికి మూడేళ్ల కిందటే చిన్నస్థాయి పట్టణం రూపం వచ్చింది.


అవకాశం వదులుకుని..

ఒక్క సైబరాబాద్‌ నిర్మాణానికి ప్రభుత్వాలు ఖర్చుపెట్టింది రూ.2వేల కోట్లు. కానీ దానివల్ల వచ్చిన ఉద్యోగాలు 13 లక్షలు. హైదరాబాద్‌ నగర ముఖ చిత్రాన్ని మార్చిన కొత్త నగరం ‘సైబరాబాద్‌’. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 50 శాతం సైబరాబాద్‌, హైదరాబాద్‌ల నుంచే వస్తోంది. అదే అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే... అదే పరిస్థితి నవ్యాంధ్రలోనూ ఉండేది. స్టార్టప్‌ నగరాన్ని ప్రమోట్‌ చేసే బాధ్యతను సింగపూర్‌ ప్రభుత్వమే తీసుకుంది. తమ దేశంలో ఉన్న అన్ని ప్రఖ్యాత కంపెనీల కార్యాలయాలను అమరావతిలోనూ ఏర్పాటు చేయాలని భావించింది.  1691 ఎకరాల్లో కట్టే అద్భుత వాణిజ్య భవనాలు, ఆకాశ హర్మ్యాలు ప్రపంచ దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారేవి. భారత దేశంలో తొలి ప్రణాళికాబద్ధమైన సరికొత్త నగరం (గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ)లో తమకూ స్థానం ఉండాలని అనేక బహుళ జాతి కంపెనీలు అప్పట్లోనే భావించాయి. ఇవన్నీ జరిగి ఉంటే... అమరావతి ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు అతిపెద్ద కేంద్రంగా విలసిల్లేది. ఇది... ఆంధ్రులకు ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచేది. 


ప్రైవేటు ఆస్పత్రులు, సంస్థలూ....

అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే... ఇప్పటికి జాతీయస్థాయిలో ‘హెల్త్‌ హబ్‌’గా మారి ఉండేది. రాజధాని నగర ప్రాంతంలో ఇండో-యూకే ఆస్పత్రికి 150 ఎకరాలు, బీ.ఆర్‌.శెట్టి మెడికల్‌ కళాశాలకు 100ఎకరాలు, కిమ్స్‌కు 40ఎకరాలు, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి 12.5 ఎకరాలు, బసవతారకం మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి 11ఎకరాలు కేటాయించారు. రాజధాని ఆగిపోవడంతో ఇవన్నీ  వెనక్కి వెళ్లిపోయాయి. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని హైదరాబాద్‌లోనే రూ.500 కోట్లతో విస్తరించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 


ఉపాధి, ఉద్యోగాల గనిలా...

ఒక్క మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో ఐదువేల మందికి ఉపాధి లభిస్తుంది. ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుతో 2వేల మంది ఉపాధి పొందుతారు. ఒక్క ఏపీఎన్‌ఆర్‌టీ నిర్మిస్తానన్న ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌లోనే దాదాపు 5వేల మందికి హైఎండ్‌ ఉద్యోగాలు లభించేవి. అలాంటిది... అమరావతిలో అప్పటికే స్థలాలు పొందిన ప్రఖ్యాత విద్యా, వైద్య, వాణిజ్య సంస్థల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేవో, పరోక్షంగా ఎందరు ఉపాధి పొందేవారో అర్థం చేసుకోవచ్చు! దీంతోపాటు... రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణ రంగం కొన్నేళ్లపాటు అలా జోరుగా కొనసాగేది. ఈ రంగంలోనే వేల మందికి ఉపాధి లభించేది. పర్యాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజధాని నిర్మాణం యథాతథంగా కొనసాగి ఉంటే ఈపాటికే అక్కడ దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కి ఉండేవని అంచనా! అంటే... సగటున ప్రతిగ్రామం నుంచి 50 మందికి రాజధానిలో ఉపాధి దొరికేది. పన్నులు, వాణిజ్య కార్యకలాపాల రూపంలో ఒక్క అమరావతి నుంచే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని ఒక అంచనా. 


బాదుడే బాదుడు తప్పేది...

ప్రభుత్వానికే ఇంత సంపద పోగుపడితే ప్రజలపై బాదుడే బాదుదు, దంచుడే దంచుడు కార్యక్రమాలు ఉండేవి కావు. చెత్త పన్ను నుంచి ఆస్తిపన్ను వరకూ వేయాల్సిన అవసరమూ తప్పేది. ఫ్యాన్లు కట్టేయండి, లైట్లు వేసుకోవద్దు... చీకట్లోనే ఉండండి అని ప్రాధేయపడే దౌర్భాగ్య పరిస్థితి తలెత్తేది కాదు. అంతేకాదు...రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవి. ప్రజల తలసరి ఆదాయం మరింతగా అభివృద్ధి చెందేది. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.


చివరికి సాధించిందేమిటి?

విపక్షంలో ఉండగానే అమరావతిపై వైసీపీ నేతలు విషం కక్కడం ప్రారంభించారు. అంతా గ్రాఫిక్స్‌ అంటూ ప్రజలను మభ్యపెట్టారు. అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదని పదేపదే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎడారి, శ్మశానం అని ఎద్దేవా చేశారు. చివరికి... అధికారంలోకి రాగానే... అమరావతిని పూర్తిగా అటకెక్కించారు. చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని, అది రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టని, ఒక సామాజిక వర్గం కోసమే పనికొస్తుందని రకరకాల అభాండాలు వేశారు. అవన్నీ అబద్ధాలే అని, తప్పులే అని రుజువైంది. అమరావతి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే ప్రాజెక్టు అని తెలిసీ... అంత ఖర్చు భరించలేమని తప్పుడు సాకులు చెప్పారు. చివరికి... ‘మూడు ముక్కలాట’ మొదలుపెట్టారు. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏమిటంటే...  రాజధాని ఏదో చెప్పుకోలేని రాష్ట్రంగా మారిపోయింది.




కొనసాగించి ఉంటే...

ఎమ్మెల్యేల క్వార్టర్స్‌, మంత్రుల బంగళాలు, జడ్జిల బంగళాలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, ఫోర్త్‌ క్లాస్‌... ఇలా అన్ని రకాల క్వార్టర్ల నిర్మాణం! ఇంటెగ్రేటెడ్‌ సెక్రటేరియట్‌ టవర్స్‌, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం! ఇవన్నీ అమరావతిలోని ప్రభుత్వ నగరిలో ఏర్పాటయ్యేవి! అంటే... లక్షలాది మందికి ఇది ఆవాసంగా మారేది. వీటిని పక్కనపెడితే... కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు అనేకం అమరావతిలో ఏర్పాటయ్యేవి. రాజధాని నిర్మాణం తొలి దశలోనే... ఎస్‌ఆర్‌ఎం, విట్‌ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు సంస్థల్లోనే 20వేల మంది చదువుకుంటున్నారు. అమృతానందమయి, జేవియర్స్‌ సహా అనేక ప్రముఖ సంస్థలు అమరావతిలో తమ సంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు, ప్రసిద్ధ హోటళ్లకు అప్పటికే స్థలాల కేటాయింపు కూడా పూర్తయింది. 


రిజర్వు బ్యాంకుకు 11 ఎకరాలు, నాబార్డ్‌కు 4.3 ఎకరాలు, ఇండియన్‌ నేవీకి 15 ఎకరాలు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 15 ఎకరాలు, కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ కార్యాలయం కోసం 17ఎకరాలు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎస్‌, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌... ఇలా దాదాపు 20కిపైగా సంస్థలకు స్థలాలు కేటాయించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగానికి చెందినవే. కచ్చితంగా కార్యాలయాలు ఏర్పాటు చేసేవే. రాజధాని నిర్మాణం యథాతథంగా కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ పని చేస్తుండేవి. ఇవి కాకుండా మరో 30 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. అంటే... దాదాపు 50 జాతీయ స్థాయి సంస్థలు అమరావతి కేంద్రంగా ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు... రాజధానిలో తమ ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనేక బ్యాంకులు పోటీపడ్డాయి.  స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు (యూనియన్‌ బ్యాంకులో విలీనమైంది)కు అప్పుట్లో 15ఎకరాల చొప్పున కేటాయించారు. ఈ బ్యాంకులకు సొమ్ములకు కొదవ లేదు! ఆధునిక భవనాలు నిర్మించి ఎప్పుడో తమ కార్యకలాపాలను ప్రారంభించి ఉండేవి. 

Updated Date - 2022-04-30T08:17:06+05:30 IST