Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 04:32:13 IST

అమాత్యా.. అసత్యమేముంది?

twitter-iconwatsapp-iconfb-icon

అమాత్యా.. అసత్యమేముంది?

అసెంబ్లీలో ‘ఆంధ్రజ్యోతి’పై బుగ్గన అక్కసు 

ఆర్థికంపై ‘గొప్పలు’.. సమర్థనకు తిప్పలు

కాగ్‌ నివేదికపై వాస్తవాలు వెల్లడించని వైనం 

ఏజీ కార్యాలయానికి అప్పులు దాచివేత 

లేఖలు రాసినా వివరాలు పంపని ప్రభుత్వం

తాను పంపినవే కాగ్‌ లెక్కలని బుకాయింపు

ఇవే విషయాలను వెల్లడించిన ‘ఆంధ్రజ్యోతి’

వాస్తవాలు దాచి పత్రికపై మంత్రి నిందలు 

చివరకు పత్రికా భాషపైనా పాఠాలు 

క్రిసిల్‌ నివేదికపైనా మభ్యపెట్టే యత్నం


గత మూడేళ్ల నుంచి ఏపీ కార్పొరేషన్ల అకౌంట్లు, అప్పుల వివరాలను ఏజీ కార్యాలయానికి ప్రభుత్వం సమర్పించలేదు. పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ఇలా సమాచారం ఇవ్వకుండా కాగ్‌ ప్రతిష్ఠను దిగజారుస్తోంది ఎవరో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పాలి. 

ఏపీసీఆర్‌డీఏ బాండ్ల రేటింగ్‌ను తగ్గిస్తూ క్రిసిల్‌ ఇచ్చిన నివేదికలో ఏపీ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని స్పష్టంగా రాసింది. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి జూలై, ఆగస్టులో క్రిసిల్‌ ఇచ్చిన జనరల్‌ నివేదికను అసెంబ్లీలో మంత్రి చూపించారు. ఇందులో ఏపీ గురించి ఏం లేదని చెప్పడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కాదా? 

సీఎం జగన్‌ అని పత్రికలో ఏకవచనంతో సంబోధిస్తారా అని బుగ్గన ఆక్రోశించారు. వార్తా పత్రికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనే రాస్తారు కానీ పేరు తర్వాత ‘గారు’ అని రాయరు. అంతెందుకు ముఖ్యమంత్రి సొంత పత్రికలో కూడా రాయరు. అలాంటిది ‘ఆంధ్రజ్యోతి’లో సీఎం జగన్‌ అని రాయడంలో మంత్రికి ఏం తప్పు కనిపించిందో? 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పరిమితికి మించి అడ్డుగోలుగా అప్పులు చేస్తున్నారు. అయినా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎన్నో అభివృద్ధి పనులను అటకెక్కించారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఆ అప్పుల లెక్కలను దాచేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి గణాంకాలు విడుదల చేశారు. అవన్నీ కాగ్‌ లెక్కలని చెప్పారు. అయితే, రాష్ట్రం పంపిన అకౌంటింగ్‌ గణాంకాలనే కాగ్‌ యథాతథంగా ముద్రించి నివేదిక రూపంలో విడుదల చేసిందని శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ఓ కథనం వచ్చింది. అవి కాగ్‌ లెక్కలు కావని, రాష్ట్రం పంపిన కాకి లెక్కలేనని ‘కాకిలెక్కలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంలో పేర్కొంది. దీనిపై బుధవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో రాసినవి అసత్యాలనో, ఊహాజనితాలనో ఆయన తప్పుబట్టలేదు. కేవలం రాసిన విధానం మంత్రికి నచ్చినట్టుగా లేదు. సీఎం ప్రకటించి, విడుదల చేసిన గణాంకాలు కాబట్టి ఏవైనా అభ్యంతరాలుంటే తమకు ఈ సందేహాలున్నాయని రాయాలంటూ జర్నలిజం పాఠాలు చెప్పారు. బుధవారం అసెంబ్లీలో సమర్పించిన కాగ్‌ ఆడిట్‌ నివేదిక నుంచి దృిష్టి మళ్లించేందుకే మంత్రి ఇలా తన అక్కసు వెళ్లగక్కారని రాజకీయ, ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే కాగ్‌ ఆడిట్‌ నివేదికలో రాష్ట్ర ఆర్థిక విధానాలను కడిగిపారేసింది. 


కాగ్‌ ప్రతిష్ఠను దిగజార్చింది ఎవరు..? 

కాగ్‌ ప్రతిష్ఠను ‘ఆంధ్రజ్యోతి’ తన కథనాలతో దిగజార్చుతోందని అసెంబ్లీలో మంత్రి బుగ్గన ఆవేశంతో అక్కసు వెళ్లగక్కారు. వాస్తవానికి కాగ్‌ ప్రతిష్ఠను మసకబారుస్తోంది ఎవరు? గత మూడేళ్ల నుంచి కాగ్‌ విషయంలో జగన్‌ సర్కార్‌ వ్యవహరించిన తీరు, ’ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలను చూద్దాం... 

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్ల నుంచి ఒక్క ఏడాది కూడా ఏపీలోని కార్పొరేషన్లు, బోర్డులు ఏజీ కార్యాలయానికి కానీ, ఆర్‌వోసీకి కానీ అకౌంట్లు సమర్పించడం లేదు. 

నెలా నెలా సమర్పించాల్సిన జీఎ్‌సటీ వివరాలు కూడా సమర్పించడం లేదు. 

కార్పొరేషన్ల అకౌంట్లు పంపాలని, అప్పుల వివరాలు చెప్పాలని మూడేళ్ల నుంచి ఏజీ కార్యాలయం పలుమార్లు లేఖలు రాసింది. అయినా జగన్‌ సర్కారు స్పందించలేదు. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏజీ కార్యాలయం లేఖలు రాసిన విషయాన్నే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. కార్పొరేషన్ల అప్పుల వివరాలు, అకౌంట్లు సమర్పించని వైనాన్ని ఎండగట్టింది. 


‘ఆంధ్రజ్యోతి’ చెప్పింది ఇదే... 

కాగ్‌ స్వయంగా లెక్కలు సేకరించడం లేదని గత కొంతకాలంగా ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా కథనాలు వచ్చాయి. దీన్ని మంత్రి బుగ్గన తప్పుబట్టారు. అయితే, వాస్తవంగా జరుగుతోంది ఇదే. ఏజీ కార్యాలయంలోని అకౌంటింగ్‌ విభాగం అకౌంట్ల వివరాలు కావాలని రాష్ర్టాలను అడగవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో స్వయంగా వెళ్లి తీసుకునే అధికారం అకౌంటింగ్‌ విభాగానికి ఉంది. స్వయంగా పార్లమెంటే ఈ అధికారం కల్పించింది. అయితే, మూడేళ్ల నుంచి కార్పొరేషన్ల అకౌంట్లు, అప్పుల వివరాలు కావాలని అకౌంటింగ్‌ విభాగం వరుసగా లేఖలు రాస్తోందే తప్ప... స్వయంగా వచ్చి తీసుకోవడం లేదు. కాగ్‌కు అధికారం ఉన్నప్పటికీ లెక్కలు స్వయంగా సేకరించడం లేదని ’ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. 


ఇవిగో తప్పుడు లెక్కలు.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే కాగ్‌ యథాతథంగా ముద్రిస్తోందనడానికి మరో ఉదాహరణ ఇది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.52,164 కోట్లని కాగ్‌ వెబ్‌సైట్‌లోని ఫిబ్రవరి నెల నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలాఖరుకు అప్పు పెరిగే అవకాశముంది కానీ తగ్గదు. అయితే మార్చి నెలాఖరుకు ఆ రుణం రూ.25,012.74 కోట్లకు తగ్గిందని అదే కాగ్‌ వెబ్‌సైట్‌లోని మార్చి నెల నివేదిక పేర్కొంది. నెల రోజుల్లోనే రాష్ట్ర అప్పుల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో..? మార్చి... ఆర్థిక సంవత్సరం చివరి నెల. బ్యాలెన్స్‌ షీట్లు, అప్పుల పరిమితుల సర్దుబాట్లు అన్నీ ఆ నెలలో చేస్తారు. ఈ సర్దుబాట్ల కోసం ప్రభుత్వం అప్పును ఏకంగా సగానికి సగం తగ్గించి లెక్కను కాగ్‌కు పంపింది. కాగ్‌ అవే లెక్కలు ముద్రించింది. ఈ రెండు నివేదికలు నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీనిపై మంత్రి బుగ్గన ఏం సమాధానం చెబుతారో? తప్పుడు లెక్కలతో కాగ్‌ను ఏమార్చడం ఆ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదా..? 


మీడియాపై బుగ్గన అక్కసు

తప్పుడు సమాచారం తీసుకొని, ఉద్దేశపూర్వకంగా రాసే వార్తలకు ముగింపు పలకాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం సీఎం జగన్‌ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన ప్రజెంటేషన్‌ తర్వాత మీడియాలో ఆ గణాంకాలను విమర్శిస్తూ పలు కథనాలు వచ్చాయన్నారు. ఇది రాష్ర్టానికి అగౌరవమని, సభకు అగౌరవమని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘కాకిలెక్కలు’ కథనం కాగ్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని నిందించారు. తరచూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విష ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగడం లేదన్నారు.  


భావం నిజమే...

‘కాకి లెక్కలు’, ‘అసెంబ్లీలో అబద్ధాల సీరియల్‌’ అని రాయడం ఆర్థిక మంత్రికి నచ్చలేదట. ఇదేం భాష అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అని ఏకవచనంతో సంబోధిస్తారా అని ప్రశ్నించారు. సాధారణంగా వార్తా పత్రికల్లో ఎంతటి ప్రముఖులైనా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం చంద్రబాబు అని రాస్తారు. అంతేకానీ పేరు తర్వాత గారు అని రాయరు. ప్రామాణిక భాషలో వార్తలు ప్రచురిస్తారు. అలాంటిది సీఎం జగన్‌ అని రాయడంలో మంత్రి బుగ్గనకు ఏం తప్పు కనిపించిందో?  మొత్తానికి ఆ కథనాల భావం నిజం, భాషపైనే అభ్యంతరం అని బుగ్గన పరోక్షంగా అంగీకరించారు. 


క్రిసిల్‌ నివేదికపైనా దాటవేత 

ఏపీసీఆర్‌డీఏ బాండ్ల రేటింగ్‌ను తగ్గిస్తూ క్రిసిల్‌ ఇచ్చిన నివేదికలో ఏపీ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని స్పష్టంగా రాసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆర్థిక అధ్వా న్నం’ పేరుతో కథనం వచ్చిం ది. తాజాగా ‘కాకి లెక్కలు’ కథనంలో కూడా ఈ నివేదిక గురించి ప్రస్తావన ఉంది. ఆ నివేదిక క్రిసిల్‌ వెబ్‌సైట్‌లో ఉంది. కానీ, ఆర్థిక మంత్రి తెలివిగా క్రిసిల్‌ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి జూలై, ఆగస్టులో ఇచ్చిన జనరల్‌ నివేదికను అసెంబ్లీలో చూపించి... ఇందులో ఏపీ గురించి ఏం లేదని చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు. 


సర్కారు ఒత్తిడికి కాగ్‌ ఓకే? 

ఏజీ కార్యాలయం రాస్తున్న లేఖలకు ఏళ్ల తరబడి సమాధానం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా ఆ సంస్థ రాసిన లేఖను స్వయంగా వెనక్కి తీసుకునేలా చేసింది. 2022 మార్చి నెలలో 40 రెవెన్యూ ఖాతాలకు సంబంధించి రూ.18,644 కోట్ల ఖర్చును జగన్‌ సర్కార్‌ తక్కువ చేసి చూపించింది. 11 నెలల నుంచి చేసిన ఈ ఖర్చు హఠాత్తుగా ఎలా మాయమైందో చెప్పాలని 2022 జూన్‌లో కాగ్‌  రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఆ మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాకు బదిలీ చేస్తున్నామని కాగ్‌ ఆ లేఖలో స్పష్టంగా చెప్పింది. కానీ, ఆ మొత్తం సస్పెన్స్‌ ఖాతాకు బదిలీ కాలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏజీ కార్యాలయానికి వెళ్లి రూ.18,644 కోట్లు సస్పెన్స్‌ ఖాతాకు మళ్లించకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం. ఆ ఖర్చును తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టుగానే లెక్కలను కాగ్‌ ఆమోదించింది. ఈ నివేదిక కూడా నెట్‌లో ఉంది. 11 నెలల పాటు చేసిన ఖర్చును తాము చేయలేదని చెప్పి కాగ్‌ చేత ఓకే చెప్పించుకోవడం ఆ సంస్థ ప్రతిష్ఠను  దిగజార్చడం కాదా..? రాష్ట్ర ఆర్థిక శాఖ పంపిన అకౌంటింగ్‌ లెక్కలను ఏనాడైనా కాగ్‌ క్రాస్‌ చెక్‌ చేసి తన నివేదికలో అదనంగా వివరాలు పొందుపరిచిన సందర్భాలు ఏమైనా ఉంటే ఆర్థిక మంత్రి చెప్పాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.