పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-10T21:56:06+05:30 IST

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్..

పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఛండీగఢ్: దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ విషయం సూచన ప్రాయంగా తెలిపారు. శుక్రవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ వరకూ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఉంటుందని పలు రీసెర్చ్‌లు చెబుతున్నాయని అన్నారు. 58 శాతం ప్రజలపై కరోనా వైరస్ ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు సైంటిస్టులు, మెడికల్ ప్రాక్టీషనర్ల అభిప్రాయంగా ఉందంటూ చెప్పారు. ఆ లెక్కలే నిజమైతే అవి అత్యంత భయానకమైన లెక్కలుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా పంజాబ్‌ ప్రభుత్వం లాక్‌డౌన్ కొనసాగించడానికే కట్టుబడి ఉందని, ఎలాంటి రిస్క్ తీసుకునేది లేదని చెప్పినట్టయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఢిల్లీలోని నిజాముద్దీన్ నుంచి 651 మంది రాష్ట్రానికి వచ్చినట్టు గుర్తించామని, వారిలో 636 మంది ఆచూకీ లభించగా, 15 మంది ఆచూకీ లభ్యం కాలేదని, వారి ఆచూకీ కూడా తీస్తున్నామని అమరీందర్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. పంజాబ్‌లో 132కు పైగా కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు సంభవించినట్టు చెప్పారు. 'సామూహిక వ్యాప్తి' (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ద్వారా రాష్ట్రంలో 27 మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు.


వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో సహా రాష్ట్రంలోని లక్షలాది మందికి  ప్రభుత్వం ఆహారం అందిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 62,000 ఎన్-95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని, మరో 2 లక్షల మాస్క్‌లు ఆర్డర్ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76 ఆపరేషనల్ వెంటిలేటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 358 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్నారని, ఇద్దరు వెంటిలేటర్ కంటే ముందు స్టేజిలో ఉన్నారని, వారికి ఆక్సిజన్ అందిస్తున్నామని సీఎం చెప్పారు. 

Updated Date - 2020-04-10T21:56:06+05:30 IST