స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2020-10-23T08:45:17+05:30 IST

స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సర్వనాశనం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు.

స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రం సర్వనాశనం
రాజమహేంద్రవరంలో గురువారం రాత్రి ఆకాశ దీపాలను వదులుతున్న టీడీపీ నాయకులు

  • అమరావతి శంకుస్థాపన దినోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి 
  • రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 22: స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సర్వనాశనం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి టీడీపీ నేతలు రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో స్కైలాంతర్లను నింగిలోకి వదిలారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మించాలని తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెడితే దానికి యావత్‌ భారతదేశం హర్షించిందని, దానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కూడా తన అంగీకారం తెలిపారని గుర్తుచేశారు. అయితే గతంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన జగన్‌.. తీరా ఆయన సీఎం అయ్యాక అమరావతిని వ్యతిరేకించడం దారుణమన్నారు. మూడు రాజధానుల విధానాలను తెరమీదకు తెచ్చి  స్వార్ధంతో అమరావతిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రజలు వ్యతిరేకిస్తున్న మూడు రాజధానులను ఎలాగైనా నిర్మించాలను కోవడం అవివేకమని విమర్శించారు. అనంతరం 300 స్కై లాంతర్లను ఆకాశంలోకి వదిలి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశి నవీన్‌కుమార్‌, నాయకులు రెడ్డి మణి, వర్రే శ్రీనివాసరావు, నక్కా దేవి వరప్రసాద్‌, ఇన్నమూరి దీపు, మాలే విజయలక్ష్మి, టీడీపీ నాయకులు కొయ్యల రమణ, పెనుగొండ రామకృష్ణ, విజయభారతి, కడలి రామకృష్ణ, బెజవాడ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T08:45:17+05:30 IST