Amaravati Padayatra: అమరావతి రైతులకు దారిపొడవునా రైతులకు నీరాజనాలు

ABN , First Publish Date - 2022-09-23T01:43:43+05:30 IST

అమరావతి (Amaravati) రాజధాని కోసం రైతులు కదం తొక్కుతున్నారు. పాదయాత్రలో పాల్గొన్న రైతులకు బందరు నియోజకవర్గ ప్రజలు హారతులు పట్టి ఆశీర్వదించారు.

Amaravati Padayatra: అమరావతి రైతులకు దారిపొడవునా రైతులకు నీరాజనాలు

మచిలీపట్నం: అమరావతి (Amaravati) రాజధాని కోసం రైతులు కదం తొక్కుతున్నారు. పాదయాత్రలో పాల్గొన్న రైతులకు బందరు నియోజకవర్గ ప్రజలు హారతులు పట్టి ఆశీర్వదించారు. మహాపాదయాత్ర (Maha Padayatra) గురువారం బందరు మండలం చిన్నాపురంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. చిన్నాపురంలోని అయ్యప్పస్వామి గుడిలో రైతులు, గ్రామస్థులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కొనకళ్ల బుల్లయ్య, సర్పంచ్‌ కాగిత వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించారు. మహిళలు సూర్య రధానికి, శ్రీవెంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. రధం ఎదుట కొబ్బరికాయలు కొట్టి దిష్టితీశారు. 


11వ రోజు పాదయాత్ర చిన్నాపురం నుంచి ప్రారంభమై మచిలీపట్నం నగరం మీదుగా పెడన రోడ్డులోని హర్షా కాలేజీ వరకు 18 కిలోమీటర్ల మేర సాగింది. చిన్నాపురం ప్రధాన సెంటర్లో పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతు పలికేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివచ్చారు. జై అమరావతి, ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదాలతో చిన్నాపురం సెంటర్‌ హోరెత్తింది. ‘అమరావతి రాజధాని ముద్దు.. మూడు రాజధానులు వద్దు. సీఎం డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులనే తన మూర్ఖపు వాదనను విడనాడి అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు హితవు పలికారు. అవమరాతి రైతుల పాదయాత్ర 11వరోజు చిన్నాపురం నుంచి ప్రారంభమవగా, పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T01:43:43+05:30 IST