విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో 11వ పీఆర్సీ అమలు, సీసీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిశితంగా చర్చించారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. రూ.1600 కోట్ల చెల్లింపులపై చర్చించామని.. జేఏసీ తరపున సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.
జగన్ జోక్యం చేసుకోరేం..!
‘ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థికమంత్రి చర్చించారా?. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే ఒప్పుకోం. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు 1600కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. పేదల కోసం పని చేసే ఉద్యోగుల పట్ల మంత్రి కించపరిచేలా మాట్లాడతారా..?. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి అనుభవ రాహిత్యంతో ప్రకటన ఇస్తున్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన డీఏలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలి. ఇవాళ కీలకమైన ప్రకటన ఉండబోతోంది’ అని బొప్పరాజు మీడియాకు వెల్లడించారు