ఉప్పొంగిన ఉత్సాహం

ABN , First Publish Date - 2022-09-26T08:02:20+05:30 IST

అమరావతి రాజధాని సాధనే ధ్యేయంగా రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముందుకు సాగుతోంది. పాదయాత్రికులకు అపూర్వ స్వాగతం పలికిన కృష్ణాజిల్లా నందివాడ మండలం రైతులు...

ఉప్పొంగిన ఉత్సాహం

మహాపాదయాత్రకు అఖండ స్వాగతం.. నందివాడలో రైతుల సంఘీభావం’’

అండగా ఉంటామంటూ భరోసా 

దారి పొడవునా తరగని ఆదరణ 

ఇతర జిల్లాల నుంచీ తరలివచ్చిన రైతులు 

మిన్నంటిన ‘జై అమరావతి’ నినాదాలు 

కృష్ణాజిల్లాలో ముగిసిన పాదయాత్ర 

గుడివాడ నుంచి కొణికి గ్రామం వరకూ... 14వ రోజు 18 కిలోమీటర్లు సాగిన యాత్ర 


గుడివాడ/నందివాడ/ఏలూరు(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 25: అమరావతి రాజధాని సాధనే ధ్యేయంగా రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముందుకు సాగుతోంది. పాదయాత్రికులకు అపూర్వ స్వాగతం పలికిన కృష్ణాజిల్లా నందివాడ మండలం రైతులు... ‘మీకు అండగా మేమున్నాం’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు గుడివాడ శివారున ఉన్న వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 14వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. టెలీఫోన్‌ నగర్‌, జొన్నపాడు, నందివాడ, తుమ్మలపల్లి, వెంకటరాఘవాపురం, కుదరవల్లి, గ్రామాల మీదుగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి గ్రామం వరకు 18 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.


తొలుత ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద వేంకటేశ్వరస్వామికి, సూర్యరథానికి దిష్టి తీసి మహిళలు హారతులిచ్చారు. జొన్నపాడు వద్ద అమరావతి రైతులకు స్థానిక రైతులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. తుమ్మలపల్లిలో మధ్యాహ్నం 3గంటలకు భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఇతర జిల్లాలకు చెందిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. గుడివాడ ఐఎంఏ ప్రతినిధులు యాత్రలో పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. ‘జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతే ముద్దు, మూడు రాజధానులు వద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నందివాడ గ్రామంలోని ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు మాజీమంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడలో శనివారం జరిగిన పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు నందివాడ మండలంలో ఆదివారం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


మాజీ ఎమ్యెల్యే రావి వెంకటేశ్వరరావు అధికార పార్టీ నాయకులను భయపెడుతున్నారని, ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ జొన్నపాడుకు చెందిన వైసీపీ నాయకులు వాట్స్‌పలో మెసేజ్‌లు పెట్టారు. వైసీపీ ప్రాబల్యం అధికంగా ఉన్న జొన్నపాడు సెంటరు వద్ద పోలీసులు బందోబస్తును మరింతగా పెంచారు. అయితే ఎటువంటి అవాంతరాలు లేకుండానే యాత్ర సాగింది. కాగా, ఎమ్మెల్పీ బచ్చుల అర్జునుడు, హైదరాబాద్‌కు చెందిన జి.వెంకటేశ్వరరావు చెరో రూ.లక్ష చొప్పున మహాపాదయాత్రకు విరాళంగా అందజేశారు. మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, జయమంగళ వెంకటరమణ, రావి వెంకటేశ్వరరావు, గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ), సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతుసంఘం రాఫ్ట్ర కమిటీ సభ్యుడు పచ్చళ్ల శివాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తదితరులు రైతులతో కలసి నడిచారు. 


వైసీపీ పతనం ప్రారంభం: ఉమా 

అమరావతే రాజధాని కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మహాపాదయాత్రతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. జేఏసీ నాయకుడు గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు కృష్ణాజిల్లా రైతులు, ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న నగదును విరాళంగా ఇచ్చి సహకరించారని చెప్పారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు లోబడి పనిచేయాల్సిందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని, రాష్ర్టాన్ని, దేవుళ్లను ప్రాంతాల వారీగా విభజించే విధానాన్ని విడనాడాలన్నారు. 




పాదయాత్రలో టిప్పర్‌ కలకలం

జొన్నపాడు-నందివాడ గ్రామాల మధ్య ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్‌ మరమ్మతులకు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. అధికార పార్టీకి చెందినవారే ఈ టిప్పర్‌ను అడ్డుపెట్టారనే ప్రచారం జరిగింది. రహదారి గోతులమయంగా ఉండటంతో దాని కమాన్‌ కట్టలు విరిగిపొయాయి. దీంతో పోలీసులు ఎస్కవేటర్‌ను తీసుకువచ్చి టిప్పర్‌లో ఉన్న ఇసుకను తొలగించి రహదారిపై రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. 


వీరులారా స్వాగతం...

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి గ్రామానికి చేరుకున్న అమరావతి రైతులకు ‘వీరులారా స్వాగతం’ అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, స్థానికులు ఎదురేగి పూలవర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. రాత్రికి వట్లూరు సమీపంలోని క్రాంతి కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేయగా, మాజీ మంత్రి మాగంటి బాబు భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 15వ రోజు సోమవారం ఉదయం 9గంటలకు కొణికి నుంచి పెదపాడు మీదుగా కొత్తూరు వరకు 16కిలోమీటర్లు సాగనున్న పాదయాత్రకు పార్టీలకతీతంగా స్వాగతం పలికేందుకు స్థానికులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-09-26T08:02:20+05:30 IST