నెల్లూరు: అమరావతి రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై స్పందించిన అమరావతి జేఏసీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలిలో అడుగుపెట్టిన తర్వాత ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. అయితే ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని అమరావతి రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది.