ప్రధాని జోక్యంతో సత్వర న్యాయం

ABN , First Publish Date - 2020-07-07T09:26:45+05:30 IST

అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ..

ప్రధాని జోక్యంతో సత్వర న్యాయం

అమరావతి రైతుల ఆకాంక్ష

202వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, విజయవాడ, జూలై 6(ఆంధ్రజ్యోతి): అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని రాజధాని రైతులు కోరారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు సోమవారానికి 202వ రోజుకు చేరాయి.  29 గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి వెలుగు కార్యక్రమంతో రైతులు ఇళ్లలో రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ను నిలిపివేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు.  


ఎస్సీ రైతులకు కౌలు వెంటనే జమ చేయాలి: దళిత జేఏసీ

రోజు గడవక అనేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ రైతులకు కౌలు జమ చేయాలంటూ దళిత జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మాజీ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌తో కలిసి సీఆర్‌డీఏ కమిషనర్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు.  


తెలుగు ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ మద్దతు

అమరావతి ఉద్యమానికి అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో ఉన్న తెలుగు ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. ఆంధ్రులకు ఒకటే రాజధాని ఉండాలని నినాదాలు చేస్తూ యువతీ యువకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.  


ఇప్పటికైనా కళ్లు తెరవాలి: అమరావతి జేఏసీ

విజయవాడ, జూలై 6(ఆంధ్రజ్యోతి): అమరాతి ఉద్యమం 200 రోజులపాటు సాగి ఉగ్రరూపం దాల్చడంతో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అమరావతి జేఏసీ గౌరవాధ్యక్షుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని 300 నగరాలు, దేశంలో వివిధ ప్రాంతాల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 


రైతుల త్యాగాలు  వృథా కానీయం: పవన్‌   


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని నిలబెట్టుకునేందుకు రైతులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోమని జనసేన అధ్యక్షుడు పవన్‌  కల్యాణ్‌ అన్నారు. రైతుల పోరాటానికి తాము కూడా మద్దతిస్తామని, కలిసి పోరాడతామని చెప్పారు. రాజధాని పోరాటం 200 రోజులు దాటిన సందర్భంగా పవన్‌ రైతులను ఉద్దేశించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అవమానించడమేనని దుయ్యబట్టారు.


బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతామన్నారు. రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం  తగదన్నారు. ‘‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదు’’ అని పవన్‌  అన్నారు. వనజీవి రామయ్య పేరు మీద పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తామన్నారు.



Updated Date - 2020-07-07T09:26:45+05:30 IST