మాకు చట్టాలు వర్తించవా

ABN , First Publish Date - 2020-05-22T09:24:07+05:30 IST

‘మేం మహిళలం కాదా...? మమ్మల్ని ఉద్ధేశించి సోషల్‌ మీడియాలో కొందరూ

మాకు చట్టాలు వర్తించవా

సోషల్‌ మీడియాలో పోస్టింగులపై చర్యలేవి

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజధాని మహిళలు

156వ రోజు కొనసాగిన అమరావతి ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తుళ్లూరు, తాడికొండ, మే 21: ‘మేం మహిళలం కాదా...? మమ్మల్ని ఉద్ధేశించి సోషల్‌ మీడియాలో కొందరూ ఇష్టానుసారం పోస్టింగులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు ఉండవా..’ అంటూ రాజధాని ప్రాంత మహిళలు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తోన్న ఆందోళనలు గురువారానికి 156వ రోజుకు చేరాయి. సోషల్‌ మీడియాలో రాజధాని మహిళలపై అసభ్య పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా చూడాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మహిళలు వినతిపత్రం అందజేశారు.


తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, పెదపరిమి తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఇళ్లలోనే కూర్చొని నిరసనలు కొనసాగించారు. మహిళలు ఇళ్లముందు జై అమరావతి అంటూ ముగ్గులు పెట్టగా, రైతులు ఇళ్లపై నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలిపారు. అలానే అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు చేస్తున్న నిరసన కార్యక్రమాలు గురువారానికి 33వ రోజుకు చేరుకున్నాయి.  

Updated Date - 2020-05-22T09:24:07+05:30 IST