Amaravati: అమరావతి రైతుల మరో పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-19T01:45:50+05:30 IST

సేవ్‌ అమరావతి, బిల్డ్‌ అమరావతి నినాదంతో మొదలైన అమరావతి (Amaravati) ఉద్యమం 1000 రోజులకు చేరుకుంటున్న తరుణంలో మరో పాదయాత్రకు రైతులు

Amaravati: అమరావతి రైతుల మరో పాదయాత్ర

విజయవాడ: సేవ్‌ అమరావతి, బిల్డ్‌ అమరావతి నినాదంతో మొదలైన అమరావతి (Amaravati) ఉద్యమం 1000 రోజులకు చేరుకుంటున్న తరుణంలో మరో పాదయాత్రకు రైతులు (Farmers) సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 12వ తేదీన ఈ యాత్రను ప్రారంభిస్తారు. అమరావతి నుంచి అరసవల్లి (Arasavilli) వరకు ఈ పాదయాత్ర సాగుతుందని అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రైవేటు హోటల్‌లో జేఏసీ నేతలు శివారెడ్డి, శైలజ, తిరుపతిరావు తదితరులు మీడియాతో గురువారం మాట్లాడారు. ఇంతకుముందు నిర్వహించి న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు వివిధ ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి నుంచి అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం వరకు పాదయాత్రను చేస్తామన్నారు. దీనికి ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వివరించారు.


పాదయాత్రలో పాల్గొనే వారు ఎన్నిరోజులు పాల్గొంటారో తెలియజేస్తూ, వారి వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వారికి అవసరమైన వసతి, భోజన సదుపాయాలు తాము కల్పిస్తామని వెల్లడించారు. రాజ్యాంగం, హైకోర్టు తీర్పులపై ఎలాంటి గౌరవం లేని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి అన్ని ప్రాంతాల ప్రజలు, రాజకీయ పక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్రలో పాత 13 జిల్లాల ప్రజలు పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. హైకోర్టు అమరావతి రాజధానిగా ఉంటుందని, దాన్ని కదిలించే హక్కు ఎవరికీ లేదని స్పష్టంగా తీర్పు ఇచ్చినా వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడంపై మండిపడ్డారు. ఏ హక్కు లేకుండా ఈ బిల్లును ఎలా ప్రవేశపెట్టారని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-19T01:45:50+05:30 IST