లాక్‌... ‘డౌన్‌’

ABN , First Publish Date - 2020-04-03T09:09:08+05:30 IST

లాక్‌... ‘డౌన్‌’

లాక్‌... ‘డౌన్‌’

ఆంక్షలపై వింత ఉత్తర్వులు

సాయంత్రం 4 దాకా బ్యాంకులు

రెండు విడతల్లో రేషన్‌ పంపిణీ

ఆఫీసులకు రావాల్సిందేనన్న ఉత్తర్వులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకవైపు ‘లాక్‌’ చేయమంటారు! మరోవైపు... అవసరంలేని వారినీ ‘ఓపెన్‌’ చేయమంటున్నారు! దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వ్యవహారం గందరగోళానికి దారి తీస్తోంది. జనం వీలైనంత వరకు తక్కువగా రోడ్లమీదికి వచ్చేలా చూడాల్సిన ప్రభుత్వం... మరింత ఎక్కువ సమయం, ఎక్కువమంది ఇళ్ల నుంచి బయటికి వచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన తర్వాత బ్యాంకులను మధ్యాహ్నం 1 గంట వరకే తెరిచి ఉంచుతున్నారు. ఇప్పుడు ఈ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. అంటే... జనం బ్యాంకు పనుల మీద బయటికి వచ్చేందుకు అవకాశం కల్పించడమే! రేషన్‌ పంపిణీ పరిస్థితి మరీ చిత్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం, కందిపప్పును రాష్ట్రాల ద్వారా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజులుగా రేషన్‌ సరుకులు సరఫరా చేస్తోంది. నిజానికి ఈ సరుకులను వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికే ఇవ్వడం ఉత్తమం. లేనిపక్షంలో... కనీసం సరుకులను ఒకేసారి ఇచ్చేస్తే ప్రజలు దీని కోసం మళ్లీ మళ్లీ బయటికి రావాల్సిన అవసరం ఉండదు. కానీ... 15వ తేదీ వరకు ఒక విడత, ఆ తర్వాత మరో విడతలో ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో రేషన్‌ డీలరు వద్ద సగటున 500 రేషన్‌ కార్డులున్నాయి. రోజుకు 60-70 కుటుంబాలకు రేషన్‌ ఇచ్చినా వారం రోజుల పాటు పడుతుంది. కొన్నిచోట్ల 10 రోజులు పడుతోంది. అంటే తొలి విడతలో పది రోజులు, 15వ తేదీ దాటాక మరో 10 రోజులు జనం రోడ్డుమీద ఉండాల్సిందే. వలంటీర్ల ద్వారా ఇంటికే సరుకులు పంపిణీ చేయాలనే డిమాండ్‌ను పట్టించుకోకపోగా... ఇలా రెండేసి విడతల్లో సరుకులు పంపిణీ చేయడం మరీ చిత్రం! ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇదే అస్పష్టత. ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని... ఇంటి నుంచే పని చేయవచ్చునని స్పష్టం చేశారు. కానీ... కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు కార్యాలయాలు తెరవాలని, కొద్దిమంది సిబ్బందితో అయినా పనిచేయాలని అంటున్నారు. అత్యవసర సేవల సిబ్బంది కాకుండా.... ఇతర శాఖల వారికీ  ఇలాంటి ఉత్తర్వులు రావడంతో వారూ అనివార్యంగా బయటకు రావాల్సి వస్తోంది.


ఇప్పుడే ఇసుక...: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు. వర్షాకాలం రాకముందే స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. నిజానికి... మే నెలలో ఈ పని చేయవచ్చు. ఏప్రిల్‌లో ఇసుకను తవ్వి తీయాల్సిన పని లేదని అంటున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇసుక తవ్వకాలకోసం డ్రైవర్లు, కూలీలూ బయటికి రాక తప్పదు. పైగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తగిన పర్యవేక్షణ ఉండదని, అక్రమాలకు కూడా అవకాశమిచ్చినట్లవుతుందని చెబుతున్నారు. ఒకవైపు కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించడం అత్యంత అవసరమంటూనే.... మరోవైపు లాక్‌డౌన్‌పై ప్రణాళికా బద్ధంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల కోసం ఉదయం 10 గంటల వరకు జనం రోడ్లపైనే ఉంటున్నారు. ఇప్పుడు నిత్యావసరాలకు సంబంధించని రంగాలకు మరింత వెసులుబాటు ఇవ్వడం  ‘లాక్‌డౌన్‌’ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-04-03T09:09:08+05:30 IST