చికిత్స, రక్షణకు చర్యలేవీ!

ABN , First Publish Date - 2020-04-03T09:12:50+05:30 IST

చికిత్స, రక్షణకు చర్యలేవీ!

చికిత్స, రక్షణకు చర్యలేవీ!

బాధితులకు వైద్యం, వైద్య సిబ్బందికి సదుపాయాల కల్పన వివరాలివ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

‘ఆశ్రం’లో పీపీఈల కల్పనపై ఆక్షేపణ


అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 బాధితులకు చికిత్స, వారికి వైద్యం చేస్తున్న సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కల్పనకు సంబంధించి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు చికిత్స, వైద్య సిబ్బందికి పీపీఈల కల్పనలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేసింది. అల్లూరి సీతారామరాజు వైద్య విజ్ఞాన సంస్థ(ఆశ్రం) వైద్య కళాశాలలో కరోనా బాధితులకు సేవలందించే సిబ్బందికి పీపీఈలు అందుబాటులో లేవంటూ మీడియాలో వచ్చిన వార్తలతో పాటు, అదే వ్యవహారానికి సంబంధించి అక్కడి వైద్యులు రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. బుధవారం వాటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆశ్రంలో పరిశీలించి నివేదించాలని ఏలూరు మొదటి అదనపు జిల్లా జడ్జి టి.మల్లికార్జునరావును ఆదేశించింది. ఆ మేరకు జడ్జి అందించిన నివేదికలో.. ప్రభుత్వం ఆశ్రంకు 200 పీపీఈలు, 100 ఎన్‌-95 మాస్కులు అందించిందని, అయితే కరోనా అనుమానితులకు ఆస్పత్రి కనీస వైద్యం అందించలేదని వివరించారు. గురువారం మరోమారు ఈ వ్యవహారంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సీహెచ్‌ సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పీపీఈలను ప్రభుత్వం సమకూరుస్తోందని వివరించారు. వాటిని వైద్యులందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ బి.కృష్ణమోహన్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా బాధితులకు చికిత్స అందించే వ్యవహారంలో, వైద్య సిబ్బందికి సదుపాయాల కల్పనలో ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలను, కేంద్రం  మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పీపీఈలు అందుబాటులో ఉన్నాయన్న మల్లికార్జునరావు నివేదికతో విభేదించింది. బుధవారం తాము ఉత్తర్వులు జారీచేశాకే ఆశ్రంలో పీపీఈలు అందుబాటులో ఉంచినట్లుందని అనుమానం వ్యక్తంచేసింది. అక్కడి కరోనా బాధితుల్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. వారి చికిత్సా వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. 

Updated Date - 2020-04-03T09:12:50+05:30 IST