కోర్టు తప్పుబట్టినా ముందుకే!

ABN , First Publish Date - 2020-04-03T08:49:51+05:30 IST

కోర్టు తప్పుబట్టినా ముందుకే!

కోర్టు తప్పుబట్టినా ముందుకే!

అమరావతిలో రాజధానేతర పేదలకు ప్లాట్లపై కొత్త ఉత్తర్వులు

సుప్రీంకోర్టుకు వెళ్తామంటూనే పాత జీవోకు సవరణ


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలివ్వడాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టే సదరు జీవోను సస్పెండ్‌ చేసింది. అయినా తన మాటే నెగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘పేదలందరికీ ఇళు’్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి నిర్ణయించారు. అమరావతిలోని నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లోని మొత్తం 1,25,1.51 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏని ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు గత నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం-2014లోని నిబంధనలను ఉల్లంఘించిందని, సీఆర్‌డీఏ చట్టాలు, అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రాజధానిలో స్థానికేతర పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అనుమతించవని స్పష్టం చేసింది. జీవోను సస్పెండ్‌ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా హైకోర్టు తప్పుపట్టిన అంశాలను సవరించి గురువారం తాజా జీవో జారీ చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు కోరిన ప్రకారం ఆయా జిల్లాల్లోని పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియను చేపట్టాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలు చేయబోయే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు వేచి చూసి.. అది వచ్చాక తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని జీవోలో ముక్తాయించడం విశేషం!


ఆ సమావేశాలన్నీ ఇందుకా..!?

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే వెలుగు చూస్తున్న తరుణంలో  పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, జేఎస్సార్కేఆర్‌ విజయ్‌కుమార్‌  కొన్ని రోజులుగా తరచుగా సమావేశమవుతున్నారు, చర్చోపచర్చలు జరుపుతున్నారు. క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, సీఎస్‌ నీలం సాహ్నినీ కలుస్తున్నారు. వీటన్నిటినీ చూశాక నిజంగానే వీరు సమీక్షలు చేస్తున్నారని అందరూ భావించారు. కానీ బొత్స నేతృత్వంలో పురపాలక, రెవెన్యూ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు గత కొద్ది రోజులుగా తెర వెనుక మంత్రాంగంలో నిమగ్నులయ్యారని సమాచారం. బుధవారం ఒక్కసారిగా పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు వెలుగు చూడగా, అదే రోజున సీఎంతో బొత్స, విజయ్‌కుమార్‌, సీఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ వి.రామమనోహరరావు తదితరులు భేటీ అయ్యారు. రాజధానిలో స్థానికేతర పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు జీవోలో చేయాల్సిన సవరణలపైనే వీరు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చర్చలు కొలిక్కి రావడంతో తాజా సవరణలతో గురువారం కొత్త జీవో ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-04-03T08:49:51+05:30 IST