సీఎంది కక్ష సాధింపు

ABN , First Publish Date - 2020-04-03T08:52:54+05:30 IST

సీఎంది కక్ష సాధింపు

సీఎంది కక్ష సాధింపు

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ మార్పు దారుణం

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

రాజధాని రైతుల హెచ్చరిక 

107వ రోజు కొనసాగిన ఆందోళనలు

దీక్షా శిబిరాల్లో సీతారామ కల్యాణం


తుళ్లూరు, గుంటూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఓ పక్క కరోనా విలయతాడవం చేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ తమపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు మండిపడ్డారు. ‘అవసరమైతే అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తారా? ఈ సమయంలో ఇలాంటి నిర్ణయమా!’ అంటూ ధ్వజమెత్తారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వరుసగా 107వ రోజు ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు దీక్షలు, నిరసనలు కొనసాగించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని దీక్షా శిబిరాల్లోనే  సీతారాముల కల్యాణం నిర్వహించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, నీరుకొండ, పెదపరిమి శిబిరాల్లో ‘జై శ్రీరాం.. జై అమరావతి’ అంటూ మహిళలు ముగ్గులు పెట్టి నిరసన తెలిపారు. ఎన్ని రోజులైనా పోరు సాగిస్తామని, వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, రాయపూడి, అబ్బురాజుపాలెం, కృష్ణాయపాలెం, యర్రబాలెం, నేలపాడు గ్రామాల్లోని వీధుల్లో శ్రీరాముని పటాలు పెట్టి పూజలు నిర్వహించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేలా చూడాలని మొక్కుకున్నారు. రాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు మండిపడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయమని సూచించడమేమిటని ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించదని, దానిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రైతులు, జేఏసీ నేతలు తెలిపారు. 


అసభ్య పోస్టింగులపై ఫిర్యాదు..

రాజధానిపై మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని ఓర్చుకోలేక  కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతర కర పోస్టింగులు పెట్టాడని తుళ్లూరు సీఐ శ్రీహరికి గురువారం మహిళలు ఫిర్యాదు చేశారు.  ఇటువంటి పోస్టింగ్‌లు పెట్టిన రవీంద్రారెడ్డిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల మనోభావాలను కాపాడి, ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని కోరారు. 

Updated Date - 2020-04-03T08:52:54+05:30 IST