ఏపీ అసెంబ్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-08-15T17:09:02+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఏపీ అసెంబ్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అమరావతి: రాష్ట్ర అసెంబ్లీలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  రాష్ట్ర శాసనసభ భవనంపై స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే దానికి సార్దకత చేకూరుతుందని తెలిపారు. ఈ75 యేళ్ళ కాలంలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని... ఇంకా చాలా సాధించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. నేడు దేశం అనేక సవాళ్ళను ఎదురుకుంటోందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. మన విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. నేడు దేశ సరిహద్దుల్లో అనేక కవ్వింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన సైనిక  బలగాలు కృషి చేస్తున్నాయన్నారు. వారికి సంఘీభావంగా ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా తయారు కావలని స్పీకర్ పిలుపునిచ్చారు.  


మరోవైపు ఏపీ సచివాలయం మొదటి భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండను ఆవిష్కరించారు.  స్వాతంత్ర్య సాధనకు జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ వంటివారు ఎన్నో త్యాగాలు చేశారని ఈ సందర్భంగా సతీష్ చంద్ర అన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చర్యలు తీసుకుంటోందని సతీష్ చంద్ర పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-15T17:09:02+05:30 IST