ఆ ప్రచారంతో వైసీపీకి నష్టం.. పార్టీ నేతల గోడు వినేదెవ్వరు?

ABN , First Publish Date - 2020-10-16T20:04:15+05:30 IST

అమరావతి రాజధానిపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందా? రాజధాని ప్రాంతం మునిగిపోతుందంటూ పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు?

ఆ ప్రచారంతో వైసీపీకి నష్టం.. పార్టీ నేతల గోడు వినేదెవ్వరు?

అమరావతి రాజధానిపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందా? రాజధాని ప్రాంతం మునిగిపోతుందంటూ పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఈ దుష్ప్రచారం పార్టీకి లాభం చేసిందా? లేక నష్టం చేకూర్చిందా? అమరావతిపై జగన్‌ పార్టీ విషం చిమ్మడంపై ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల ఆందోళన ఏమిటి? స్థానిక ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తున్నారు? అమరావతి పరిరక్షణ సమితి, టీడీపీ, ఇతర పార్టీల నేతల పరిశీలనలో తేలిన నిజాలు ఏమిటి?    


విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వం...రాజధాని అమరావతిపై విషం చిమ్ముతోంది. రాజధాని అమరావతికి ముంపు సమస్య లేదని సాక్షాత్‌ నేషనల్‌ గ్రీన్‌ ట్రెబ్యునల్ చెప్పినా వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న  చంద్రబాబు నివాసంలోకి నీళ్ళు వచ్చేసాయని, సిమెంట్ బస్తాలు వేసి, వరదను ఆపుతున్నారని వైసీపీ నేతలు, పార్టీ మీడియా ప్రచారంతో హోరెత్తించింది. అయితే చంద్రబాబు ఉంటున్న నివాసం దగ్గర పరిస్థితిపై విడుదలైన ఫోటోల్లో ఇదంత పచ్చిఅబద్ధమని తేలిపోయింది. వైసీపీ నేతలు, పార్టీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు ఇబ్దందికరంగా మారింది. ఇప్పటికే రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు నేరుగా మద్దతు ఇవ్వలేక నలిగిపోతున్న సెకండ్‌ క్యాడర్‌ లీడర్లను ఈ పరిణామం మరింత కుంగదీస్తోంది. దీంతో వారు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.  


స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అమరావతి మునిగిపోతుందని చేస్తున్న అసత్య ప్రచారం వైసీపీకి నష్టం కలుగుతుందని ద్వితీయ శ్రేణినాయకులు ఆందోళనచెందుతున్నారు. రాజకీయంగా తమకు తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తాయని భావిస్తున్నారు. వాస్తవానికి అమరావతి రాజధానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ..చాలామంది ద్వితీయశ్రేణి నాయకులు రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు పరోక్షంగా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, రైతులను అభినందిస్తున్నారు. అలాంటి నాయకులకు ఈ అసత్య ప్రచారం తీవ్ర మనోవేదన కలిగిపోస్తోంది. 




నిజానికి రాజధాని అమరావతి మునిగిపోతుందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. అక్కడ ఎలాంటి వరద లేదన్నది అక్షర సత్యం. ఈ విషయం స్థానిక నాయకులకు కూడా స్పష్టంగా తెలుసు. జగన్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంతో  ఆ పార్టీ సానుభూతి పరులు కూడా కంగుతింటున్నారు. రాజధానిపై విషం చిమ్మడం వైసీపీకి లాభం కంటే నష్టమే చేస్తుందనీ..రాజకీయంగా సమాధి అవుతామనే ఆందోళనలో ఉన్నారట ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఇలాంటి దుష్ప్రచారం ఆపాలని తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఒత్తిడి కూడా తెస్తున్నారట. రాజధాని ప్రాంతంలోని శాసనసభ్యులు కూడా వారి ఆవేదనలో వాస్తవం ఉందని ఒప్పుకుంటున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నాయకులకు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారట. అదే సమయంలో అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులు, ప్రజలకు ఫోన్లు చేసి వారికి క్షమాపణలు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏదో ఆశించి రాజధానిపై చేసిన విష ప్రచారం వైసీపీకి బూమరంగ్‌ అయి సొంత పార్టీ నేతలకు చిక్కులు తేవడమే కాకుండా..అక్కడి ప్రజల ముందు పార్టీ వక్రబుద్ది బట్టబయలైందనే ప్రచారం జోరోగా సాగుతోంది.     


రాజధాని అమరావతి ప్రాంతంలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలిపేందుకు అమరావతి పరిరక్షణ సమితి, టీడీపీ, ఇతర పార్టీల నేతలు ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. భారీ వర్షాలకు వరద పోటెత్తి, హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలే అల్లాడిపోతే..అమరావతిలో ఎక్కడా ముంపునకు గురికాకపోవడంతో ఇంతా సేఫా అనే చర్చ జరుగుతోంది.  మొత్తంగా జగన్‌ పార్టీకి రాజధానిపై చేసిన అసత్య ప్రచార ప్రభావం పాజిటివ్‌ కన్నా నెగటివ్‌ ఫలితం ఇచ్చింది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక టీడీపీ నేతలు వైసీపీ నాయకులకు చురకలు అంటిస్తున్నారు. మరి వైసీపీ నాయకులు, ఆ పార్టీ మీడియా అమరావతిపై తమ వక్రబుద్ధి మార్చుకుంటారో లేదో చూడాలి.  

Updated Date - 2020-10-16T20:04:15+05:30 IST