అమరావతి ఉద్యమ రైతులకు ఆత్మీయ స్వాగతం

ABN , First Publish Date - 2022-09-26T07:04:12+05:30 IST

అమరావతి టు అరసవల్లి పాదయాత్రలో భాగంగా 13వ రోజు ఆదివారం అమరావతి రైతుల పాదయాత్ర నందివాడ మండలం టెలిఫోన్‌ నగర్‌ వద్ద మండల టీడీపీ నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని హాజరతులిచ్చి స్వాగతం పలికారు.

అమరావతి ఉద్యమ రైతులకు ఆత్మీయ స్వాగతం

- కృష్ణా జిల్లాలో 106 కి.మీ సాగిన పాదయాత్ర

గుడివాడ/నందివాడ, సెప్టెంబరు 25 : అమరావతి టు అరసవల్లి పాదయాత్రలో భాగంగా 13వ రోజు ఆదివారం అమరావతి రైతుల పాదయాత్ర నందివాడ మండలం టెలిఫోన్‌ నగర్‌ వద్ద మండల టీడీపీ నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని హాజరతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన అమరావతి రైతులకు బిందెలతో నీళ్లు వారబోసి హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవునా మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి ఽగజమాలతో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాట్రగడ్డ రవి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అమరావతి రైతులకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. 

దాతల విరాళాల వెల్లువ..

పెదపారుపూడి : అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పెదపారుపూడి మండల వెంట్రప్రగడ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ చలసాని వాసు, దోసపాడు గ్రామానికి చెందిన రైతులు రూ.75 వేలను పామర్రు టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌ రాజా ఆధ్వర్యంలో నేతల సమక్షంలో ఆదివారం అమరావతి రైతులకు అందజేసినట్టు మండల అధ్యక్షుడు చలసాని రమేశ్‌ చౌదరి తెలిపారు.

గుడివాడ రూరల్‌: గుడివాడ రూరల్‌ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులు రూ. 35 వేల విరాళం అమరావతి రైతులకు అందజేశారు. బొమ్ములూరు గ్రామ రైతులు శనివారం రూ.50 వేల విరాళం అమరావతి జేఏసీకి అందజేశారు. బొమ్ములూరు గ్రామానికి చెందిన గుత్తా సుబ్రహ్మణ్యం రూ.50 వేలు అందజేశారు. గుడివాడ రూరల్‌ మండలం నుంచి అమరావతి పాదయాత్రకు వందలాది మంది తరలివచ్చారు. మహిళలు యాత్రలో పాల్గొని మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. తుమ్మలపల్లిలో యలమంచిలి సతీష్‌ అమరావతి రైతులకు రూ.56 వేల చెక్కును విరాళంగా అందజేశారు. అనంతరం వెన్ననపూడి సెంటర్‌ పులపర్రు గ్రామస్థుడు (వికలాంగుడు) అమరావతి రైతులకు రూ.20 వేల చెక్కును అందజేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం బొప్పిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు రూ.50 వేలు విరాళం అందజేశారు. సూరపనేని నాగేశ్వరరావు కుమారులు మహేష్‌, సురే్‌షలు రూ.10,116లు అమరావతి రైతులకు అందజేశారు. కుదరవల్లి వంతెన వద్ద మాజీ ఎంపీటీసీ ఉప్పల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలుకొండ గ్రామ రైతులు రూ.36 వేలు విరాళంగా అందజేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ మలిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కొండపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జనార్థనపురం రైతులు 700 జతల బూట్లు పంపిణీ చేశారు.

దద్దరిల్లిన కుదరవల్లి 

అమరావతి రైతుల మహాపాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో నిర్వహించే పర్యటనలో ఆఖరి గ్రామం కుదరవల్లి కావటంతో ఆక్వా రైతు కొల్లూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ మసిముక్కు వేణు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి అడుగడుగునా నీరాజనాలతో హోరెత్తించారు. అనంతరం పాదయాత్ర ముగియటంతో కేక్‌ కట్‌ చేసి రైతులకు పంచిపెట్టారు. అమరావతి రైతులు కృష్ణా జిల్లాను దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లారు. కార్యక్రమంలో మాజీ మంత్రి యర్నేని సీతాదేవి - రామచంద్రరావు, మండల టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, కార్యదర్శి నంబూరి రాకేష్‌, సీనియర్‌ నేతలు కాకరాల సురేష్‌, రాధాకృష్ణ, గూడపాటి రత్నప్రసాద్‌, గద్దె సురేష్‌, ఆరెకపూడి రామశాస్త్రి, ఉప్పల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ రవి, జాన్‌, ప్రభాకర్‌, సోమరాజు, మసిమక్కు వేణు, కృష్ణయ్య స్వామి, శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.  

రైతులు సహకరించారు : రావి వెంకటేశ్వరరావు

గుడివాడ, చుట్టుపక్కల మండలాల రైతులు మహాపాదయాత్రకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. రాజధానిగా అమరావతే కావాలని, కోర్టు తీర్పును అమలు చేయాలని పాదయాత్రకు మద్దతు తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన విధంగా బుద్దిచెబుతారన్నారు. 

మూర్ఖపు నిర్ణయాలతో వ్యవస్థలు నాశనం : సౌమ్య

రాజధానికి భూములిచ్చిన రైతులు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని రెండో విడత పాదయాత్ర చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అమలు వారి ప్రధాన డిమాండ్‌. రైతుల జీవితాలతో సీఎం ఆటలాడుకుంటున్నారు. మూర్ఖుడి పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి.అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతుంది.

మీడియాలేకుంటే ప్రాణహాని : జయమంగళ 

రైతుల మహాపాదయాత్రకు రాకుండా శనివారం యాభైమంది పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఉండటంతో ఎట్టకేలకు ప్రాణహానినుంచి బయటపడ్డా. రైతులు చేస్తున్న పాదయాత్రలో సంకల్ప బలం ఉంది. రైతుల వైపే న్యాయం ఉంటుంది. విజయంసాధిస్తారు.

 70 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకం :  ఉమా

వైసీపీలోని 70మంది ఎమ్మేల్యేలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మేల్యేల పనితీరు గ్రాఫ్‌పేరుతో లెక్కలు చెబుతానని అన్న సీఎం ఈ కారణంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విశాఖపట్నంలో అఖిలపక్షంతో సీఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తే ఏ పార్టీ సహకరించలేదు. చంద్రబాబునాయుడు కుటుంబంపై ఎవరైనా అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం. పాదయాత్రనుంచి ప్రజలను వేరుచేసేందుకు సీఎం జగన్‌ ఎత్తుగడలు వేస్తున్నాడు. బాలకృష్ణ ట్వీట్‌తో వైసీపీ ఎమ్యేల్యేలు కలవరపాటుకు గురవతున్నారు.

పులివెందుల సీటు బీసీలకు ఇస్తారా : కొల్లు రవీంద్ర 

కుప్పం టీడీపీ ఎమ్మెల్యే సీటును బీసీలకు ఇమ్మని సీఎం జగన్‌ అంటున్నారు. పులివెందుల సీటు కూడా బీసీలకు ఎందుకివ్వరు. ఎన్నో సంవత్సరాలుగా పులివెందులలో వైఎస్‌ కుటుంబం జాగీరుగానే వస్తోంది. పులివెందుల సీటును బీసీలకు ఇచ్చేదమ్ముందా. జిల్లాలో వీకెండ్‌ మంత్రి ఒకరు ఉన్నారు. వారం చివరిలో వచ్చి మామూళ్లు వసూలు చేసుకుని పోతున్నాడు. అవినీతి పరుడైన మంత్రి చంద్రబాబునాయుడిపై, రైతులు చేస్తున్న మహాపాదయాత్రపై విమర్శలు చేస్తున్నాడు. అమరావతి రైతుల ఉద్యమంలో వాస్తవం ఉంది. విజయం వారినే వరిస్తుంది. 

రైతులే విజయం సాధించారు 

- అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జి

గుడివాడలో అధికారపార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా మహపాదయాత్రను ఆపలేకపోయారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పునకు, ప్రజల అభిప్రాయానికి పాలకులు గౌరవం ఇవ్వాలి.

బాపూజీ ఆశయాలు సాధిస్తాం : అమరావతి జేఏసీ

రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని, కోర్టు తీర్పుకు కట్టుబడి రాజధానిని అభివృద్ధిపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర గుడివాడ చేరుకోగా ఏలూరు రోడ్డులోని గాంధీ విగ్రహానికి కొలికిపూడి పూలమాలవేసి నివాళ్ళులర్పించారు. పాదయాత్ర విజయవంతం కావాలని, జగన్‌కు సద్భుద్ధి ప్రసాదించాలని గాంధీజీని కోరుకున్నట్టు తెలిపారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి గోకవరపు సునీల్‌కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ అడుసుమిల్లి శ్రీనివాసరావు, నాయకులు బ్రహ్మయ్య, కుందేటి ప్రసాద్‌, జోన్స్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-26T07:04:12+05:30 IST