అమరపురిలో ‘అమరావతి’ నినాదం

ABN , First Publish Date - 2020-02-24T08:57:00+05:30 IST

పవిత్ర పుణ్యక్షేత్రం అమరేశ్వరుని ఆలయ ప్రాంగణం, వీధులు ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగాయి. ఆదివారం జరిగిన అమరలింగేశ్వర స్వామి రథయాత్రలో రాజధాని అమరావతి ప్రాంత రైతులు,

అమరపురిలో ‘అమరావతి’ నినాదం

  • ఆదుకోవాలంటూ అమరేశ్వరునికి మొరపెట్టుకున్న రాజధాని రైతులు
  • ధ్యానబుద్ధ వద్ద నిరసన ప్రదర్శన

గుంటూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పవిత్ర పుణ్యక్షేత్రం అమరేశ్వరుని ఆలయ ప్రాంగణం, వీధులు ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగాయి. ఆదివారం జరిగిన అమరలింగేశ్వర స్వామి రథయాత్రలో రాజధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, అసైన్డ్‌ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఆకుపచ్చ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ కదం తొక్కారు. శోభాయమానంగా జరిగిన అమరేశ్వరుని రథయాత్రలో రాజధాని రైతులు పెద్దఎత్తున పాల్గొని.. అమరావతి రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ మొక్కారు. దీక్షా శిబిరాల నుంచి పెద్దఎత్తున మహిళలు, రైతులు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల్లో ప్రముఖ శైవక్షేత్రం అమరావతికి చేరుకుని నిరసన ప్రదర్శన చేశారు. వీరికి మద్దతుగా టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని రాజకుమారితో పాటు, మహిళా జేఏసీ నేతలు పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ధ్యానబుద్ధ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఇదిలావుండగా, పలు గ్రామాల్లో రైతులు, మహిళలు ఆదివారం 68వ రోజు ఆందోళనలు కొనసాగించారు. ఉద్యమ నిర్వహణకు డాక్టర్‌ రామకృష్ణ రూ.10 వేలను విరాళంగా అందజేశారు. తెలంగాణలోని శేరిలింగంపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుబ్బారావు మిత్రమండలికి చెందిన 25 మంది సంఘీభావం తెలిపారు. తెనాలి చెంచుపేట వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, కంచికర్ల నుంచి శ్రీనివాసరావు ప్రెండ్స్‌ సంఘీభావం తెలిపి, రూ.10 వేలు విరాళం ఇచ్చారు. చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన రైతులు సంఘీభావం తెలిపి దీక్షా శిబిరానికి 1,800 కిలోల బియ్యం విరాళంగా ఇచ్చారు.


మద్దతు తెలిపిన మహిళా నేతలు

విజయవాడ మహిళా జేఏసీ నేతలు సుంకర పద్మశ్రీ(కాంగ్రెస్‌) దుర్గా భవాని(సీపీఐ), ఆచంట సునీత(టీడీపీ), బొడ్డు నాగలక్ష్మి(బీజేపీ), మాలతి(లోక్‌సత్తా) తదితరులు బస్సుయాత్రగా పలు ప్రాంతాల్లోని దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణాజిల్లా మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ దీక్షల్లో పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ యువజన సమాఖ్య జేఏసీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చేబ్రో లు హనమయ్య సర్కిల్‌ నుంచి హిందుకళాశాల కూడలి వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.


నిర్మలగిరికి దళితుల యాత్ర

అమరావతి కొనసాగాలని కోరుతూ ఆదివారం రాయపూడి దీక్ష శిబిరం నుంచి 60 మంది దళిత రైతులు, కూలీలు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని నిర్మిలగిరి పుణ్యక్షేత్రానికి యాత్ర చేపట్టారు. సీఎం జగన్‌ మనసు మారాలని మరియమ్మను వేడుకుంటామని తెలిపారు. బైబిల్‌, రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేసి జగన్‌ మాట తప్పారన్నారు. వెలగపూడి దీక్ష శిబిరంలో 151 మంది దళిత రైతులు, కూలీలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.


అమరావతినే  కొనసాగించాలి: రాధా

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత వంగవీటి రాధా డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఏ రైతులూ రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఇవ్వలేదని, అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ఇచ్చారని పేర్కొన్నారు. అమరావతి, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవటంతో ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం పక్కన పెట్టారని రాధా ఆరోపించారు. హైటెక్‌ సిటీ నిర్మాణాన్ని(చంద్రబాబు ప్రభుత్వం) ప్రారంభించినప్పుడు ప్రభుత్వం మారాక వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నా హైటెక్‌ సిటీ విస్తరణకు దోహదపడ్డారే తప్ప అడ్డు పడలేదన్నారు. సీఎం జగన్‌ కూడా అమరావతిని ముందుకెళ్లాల్సిందన్నారు. ఇదే సభలో మాట్లాడిన పలువురు వక్తలు అమరావతిలో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు.

Updated Date - 2020-02-24T08:57:00+05:30 IST