అమరావతినే కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-07-05T12:04:07+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు మరువలేనివని టీడీపీ సీనియర్‌ నాయకులు

అమరావతినే కొనసాగించాలి

రైతుల నిరసన పట్టదా?

బీసీలపై వైసీపీ కక్ష 

టీడీపీ నేతలు 


విజయనగరం రూరల్‌, జూలై 4:  రాష్ట్ర రాజధానిగా  అమరావతినే కొనసాగించాలని, భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు మరువలేనివని టీడీపీ సీనియర్‌ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, బొద్దల నర్సింగరావు అన్నారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శనివారం వారు విలేకరుతో మాట్లాడారు. అమరావతి రైతులు 200 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే సీఎం జగన్‌ కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏడాది కాలంగా మూడు ముక్కలాడడం తప్ప.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాజధానిని అందించ లేకపోయారని విమర్శించారు.  అభివృద్ధి, సంక్షేమం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇసుక అందకపో వడంతో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజధాని అమరావతి కొనసాగించాలని కోరుతూ చనిపోయిన 54 మంది రైతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. 


టీడీపీ వెంట బీసీలు ఉన్నారన్న అక్కసుతోనే.. బీసీ నాయకత్వంపై వైసీపీ కక్ష కట్టిందని టీడీపీ విజయనగరం నేతలు కంది మురళీనాయుడు, గంటా పోలినాయుడు, ప్రసాదుల ప్రసాద్‌  విమర్శించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అనారోగ్య సమస్యలున్నా, ప్రభుత్వం మొండివైఖరితో ఆయనను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్రను ఓ కేసులో ఇరికించి అరెస్టు చేయడం  దుర్మార్గమ న్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నేతలు కోండ్రు శ్రీనివాసరావు, పొగిరి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.  


రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మాజీ కౌన్సిలర్‌ ఉండ్రాళ్ల వెంకట అప్పారావు ఆధ్వర్యంలో శనివారం అంబటిసత్తర్వు జంక్షన్‌ వద్ద ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల దీక్షలు 200వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు రాకేష్‌, వీరబాబు, న్యాయవాది రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


రైతులను విస్మరించడం సరికాదు: జగదీష్‌

రైతులు ఎన్నో త్యాగాలు చేస్తూ వేలాది ఎకరాల భూమిని రాజధాని కోసం ఇస్తే అటువంటి రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.


అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ప్రపంచ మెచ్చుకొనే విధంగా రాజధాని నిర్మించాలనుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పా అని జగదీష్‌ ప్రశ్నించారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం  చేపట్టామని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, కోలా వెంకటరావు, దొగ్గ మోహన్‌, రెడ్డి శ్రీనివాసరావు, జి.రామ్మూర్తి, జి.వెంకటనాయుడు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T12:04:07+05:30 IST